సైరా..సై..ఎద్దుల కుమ్ములాట! | Bull Fell Into Well While Bull fighting In Chittoor | Sakshi
Sakshi News home page

సైరా..సై..ఎద్దుల కుమ్ములాట!

Published Fri, Oct 4 2019 10:17 AM | Last Updated on Fri, Oct 4 2019 10:31 AM

Bull Fell Into Well While Bull fighting In Chittoor - Sakshi

సాక్షి, యాదమరి(చిత్తూరు) : పాడుబడిన బావిలో పడిన వృషభ రాజాన్ని శ్రమలకోర్చి అగ్నిమాపక సిబ్బంది కాపాడిన సంఘటన బుధవారం రాత్రి కీనాటంపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన రైతు పౌల్‌కు కొన్ని ఆవులతో పాటు రెండు ఎద్దులు ఉన్నాయి. వీటిలో ఒకటి మామూలు ఎద్దుకాగా మరొకటి పరుగు పందాల్లో సత్తా చాటేది. దీని విలువ రూ.2లక్షల వరకూ ఉంటోంది. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని తన పొలం వద్ద పౌల్‌ ఆవులను కట్టేసి ఉంచేవాడు. ఈ నేపథ్యంలో పరుగు పందెం ఎద్దు, మరో ఎద్దు..కట్టుతాళ్లను తెంపుకుని రెండూ రోషంతో కుమ్ములాటకు తెగబడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఈ పోట్లాటలో పరుగు పందెం ఎద్దుపై మరో ఎద్దు కాస్తా ఆధిక్యత కనబరచింది. దీని ధాటికి పందెం ఎద్దు పరుగులు తీసింది. అప్పటికీ ఆ ఎద్దు శాంతించక దానికి వెంబడించింది. దీంతో పందెం ఎద్దు పరుగులు తీస్తూ అదుపు తప్పింది. చీకట్లో 100 అడుగుల లోతు ఉన్న పాడుపడిన బావిలో  పడిపోయింది.


పందెం ఎద్దును బావి నుంచి బయటకు తీస్తున్న అగ్నిమాపక సిబ్బంది

కొంతసేపటికి పౌల్‌ తన పొలం వద్దకు వచ్చి చూస్తే పందెం ఎద్దు కనబడకపోవడంతో దాని కోసం గాలించాడు. పొలం వద్ద పాడుబడిన బావి నుంచి ఎద్దు అరుపులు వస్తుండడం గుర్తించి అక్కడికి చేరుకున్నాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేశాడు. వారు హుటాహుటిన వచ్చి పరిశీలించారు. బావి లోతు ఎక్కువగా ఉండడంతో తాళ్లతో వెలికితీయడం అసాధ్యమని గ్రహించి,  క్రేన్‌ తెప్పించారు. ఫ్లడ్‌ లైట్ల వెలుగులో ‘ఆపరేషన్‌ పందెం ఎద్దు’ పనులు మొదలెట్టారు. బావిలోంచి పిచ్చిమొక్కలు, చెట్లు ఏపుగా పెరిగిపోయి ఉండడంతో ఎద్దు సరిగా కనిపించలేదు. కొంతమంది సిబ్బంది ధైర్యం చేసి బావిలోకి దిగారు. లైట్ల సాయంతో ఎద్దును గుర్తించారు. క్రేన్‌ కొక్కీని బావిలోకి విడవడంతో దానికి ఎద్దును సురక్షితంగా కట్టారు. చెట్ల కొమ్మల మధ్య నుంచి ఆ ఎద్దును పైకి తీశారు. అదృష్టశాత్తు చెట్ల కొమ్మలే పందెం ఎద్దు ప్రాణాలతో బైటపడటానికి కారణమయ్యాయి. చెట్ల కొమ్మలను తగులుకుంటూ సినీ ఫక్కీలో అది బావిలో పడటంతో బలమైన గాయాలు కలగలేదు. చెట్ల కొమ్మలు లేకపోయిన పక్షంలో సరాసరి నేరుగా పడి మరణించి ఉండేదని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. మొత్తానికి ఎద్దు వెలికితీతకు దాదాపు మూడున్నర గంటలకు పైగా పట్టింది. గ్రామస్తులకు ఈ ఆపరేషన్‌ ఉత్కంఠ కలిగించించింది. మొత్తం మీద పందెం ఎద్దు రాత బాగుందంటూ పలువురు వ్యాఖ్యానించడంతో పౌల్‌ అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement