yadamarri
-
చెట్టుకింద గొయ్యిలో ఏదో పూడ్చిపెట్టినట్లు కనపడడంతో.. పశువుల కాపర్లు..
సాక్షి, చిత్తూరు: మామిడి తోటలో యువకుడి తల, మొండెం వేరు చేసి, శవాన్ని గుంతలో పాతిపెట్టిన ఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలం దళవాయిపల్లెలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీనివాసుల రెడ్డి, యాదమరి ఇన్చార్జి ఎస్ఐ ప్రసాద్ కథనం మేరకు, మామిడితోటలో చెట్టుకింద గొయ్యిలో ఏదో పూడ్చిపెట్టినట్లు కనపడడంతో పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సీఐ, ఎస్ఐ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గొయ్యి పూడ్చిన ప్రాంతంలో మట్టి తవ్వి తీశారు. చెయ్యి కనపడడంతో మరింత లోతుగా మట్టిని తొలగించారు. చివరకు తల, మొండెం వేరుచేసి ఉన్న శవాన్ని బయటకు తీశారు. అదే గ్రామానికి చెందిన మురళీ కల్యాణ్(19) అలియాస్ గుంతోడు అని స్థానికులు గుర్తించారు. దీనిపై ఇన్చార్జ్ ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేయగా సీఐ శ్రీనివాసుల రెడ్డి విచారణ చేపట్టారు. శవాన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానితులను అదుపులోకి తీసు కొని విచారిస్తున్నామని, వీలైనంత త్వరగా నిందితులను అరెస్టు చేస్తామని సీఐ వివరించారు. మృతుడు అనాథ దళవాయిపల్లెకు చెందిన కల్పన, చంద్రబాబు దంపతుల కుమారుడు మురళీ కల్యాణ్. చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాథగా మారాడు. దీంతో అదే గ్రామంలోని అవ్వా, తాతల వద్ద ఉంటున్నాడు. చదువులేకపోవడంతో భవన నిర్మాణ పనులు చేసుకుంటున్నాడు. ఇంతవరకు పెళ్లి కాలేదు. స్నేహితులతో కలసి ఆదివారం రాత్రి మద్యం తాగిన కల్యాణ్, అనంతరం హత్యకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. -
టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు గుండా గిరి
సాక్షి, చిత్తూరు : పంచాయతీ ఎన్నికల నామినేషన్స్ సందర్భంగా చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అవుతోంది. తనకు సంబంధం లేని యాదమర్రి మండలంలో తిష్ట వేసిన దొరబ్బాబు ఆదివారం నాడు హాల్ చల్ చేశారు. నామినేషన్స్ జరుగుతున్న యాదమర్రి మండల పరిషత్ కార్యాలయం వద్ద తన అనుచరులతో రాద్ధాంతం చేశారు. ఎమ్మెల్సీ స్టిక్కర్ కారులో వచ్చిన దొరబాబు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దొరబాబు వల్ల పెరియం బాడీకి చెందిన వారి మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు దొరబాబు గుండా గిరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా గుర్తు తెలియని వ్యక్తులు దొరబాబు వాహనం మీద కర్రలతో కొట్టారు. దీంతో దొరబాబు తన కారును వైఎస్సార్సీపీ కార్యకర్తల మీదికి పోనిచ్చి దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మీద స్థానిక ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. దొరబాబు దాదా గిరిని ఖండించారు. సంబంధం లేని మండలానికి వాక్కువహిన దొరబాబు రౌడీ ఇజం చేశారన్నారు. ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని, వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొరబాబు ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే యాదమర్రిలో దొరబాబు టీడీపీకి చెందిన ఓ వర్గానికి మాత్రమే మద్దతు తెలుపుతున్నారని, ఇది గిట్టని మరో వర్గం నేతలే ఆయనపై దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. -
37 ఏళ్లుగా తిరుమలకు సైకిల్ యాత్ర
సాక్షి, యాదమరి: తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన శ్రీపాదం అరుళ్‌మళై ఆశ్రమ పీఠాధిపతి శక్తిదాసన్ స్వామి సుమారు 37 ఏళ్లుగా తిరుమలకు సైకిల్‌పై వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. నాలుగురోజుల క్రితం కోయంబత్తూరు ఆశ్రమం నుంచి సైకిల్‌పై బయలుదేరిన స్వామి సోమవారం ఉదయం జిల్లాలోని యాదమరికి చేరుకున్నారు. అనంతరం స్థానిక ఏకాంబరేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984 నుంచి సైకిల్‌పై తిరుమల యాత్రకు వస్తున్నానని తెలిపారు. అర్చకులు చంద్రశేఖర్‌శర్మ, సత్యనారాయణశర్మ తీర్థప్రసాదాలు అందించి శక్తిదాసన్స్వామికి వీడ్కోలు పలికారు. (చదవండి: భక్తుడికి పోర్న్ లింక్: ఐదుగురిపై వేటు) -
చిత్తూరులో సైకో వీరంగం
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని యాదమర్రి మండలం మాదిరెడ్డి పల్లె గ్రామంలో శుక్రవారం సురేష్ అనే వ్యక్తి సైకోలా ప్రవర్తించాడు. తనకు అడ్డువచ్చిన గ్రామస్థులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో సురేష్ సైకో ప్రవర్తనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి అతని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సురేశ్ చేతిలో ఉన్న కర్రతో పోలీసులపై తిరగబడ్డారు. దీంతో పాటు ఎస్ఐ నాగేశ్వరరావుపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. అతి కష్టం మీద సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం చిత్తూర్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో కూడా సురేష్ సిబ్బందిపై దాడి చేయబోయాడు. సురేష్ పై ఇది వరకే అత్యాచారం, హత్య కేసులు ఉన్నాయని ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. -
బ్యాంక్‌లోని 17 కిలోల బంగారం మాయం!
వేసిన తాళం వేసినట్లే ఉంది. గేట్లు.. తలుపులు మూసుకునే ఉన్నాయి. అయినా సరే రూ.కోట్ల విలువచేసే నగలు మాయమైపోయాయి. యాదమరి మండలం మోర్దానపల్లె గ్రామంలోని ఆంధ్రాబ్యాంకులో జరిగిన చోరీ ఇంటి దొంగలపనేనంటూ అనుమానం వ్యక్తమవుతోంది. మరోవైపు కిలోల బంగారం మాయమైపోవడంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. సాక్షి, యాదమరి/చిత్తూరు అర్బన్ : నిర్మానుష్యమైన ప్రదేశం. అసలు బ్యాంకు పెట్టడానికి ఏమాత్రమూ ఆమోదయోగ్యం కాని స్థలం. జనసంచారం ఉండదు. ఎక్కడో అడవిలో ఓ మూలన విసిరేసినట్లున్న అద్దె భవనంలో బ్యాంకును పెట్టారు. లోపలకు వెళ్లిచూస్తే స్ట్రాంగ్‌రూమ్‌లు కనిపించవు. సెక్యూరిటీ కనిపించదు. రాత్రికి రాత్రే ఓ జేసీబీ తెచ్చి భవనాన్ని పడగొట్టి బ్యాంకు మొత్తం దోచుకెళ్లినా ఎవ్వరికీ తెలియదు. ఊర్లో జనం బ్యాంకు వద్దకు రావాలన్నా 20 నిముషాలు పడుతుంది. అలాంటి చోట నాలుగేళ్లుగా ఆంధ్రాబ్యాంకును నడుపుతున్నారు. గేట్లకు వేసిన తాళాలు, మూసిన బీరువాలు అలాగే ఉన్నాయి. అసలు బ్యాంకులో ఎక్కడా కూడా చోరీ జరిగిన ఆనవాళ్లులేవు. మొత్తం రూ.6,29 కోట్ల విలువైన 17 కిలోల బంగారు ఆభరణాలు, రూ.2.34 లక్షల నగదు చోరీకి గురయ్యింది. ఆ నగలపై రూ.3.47కోట్ల రుణాలు బాంకు మంజూరు చేసి ఉంది. ఈ ఘటనలో బ్యాంకు అధికారుల పాత్ర ఉందనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు మేనేజర్‌తో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారిస్తున్నారు. ఎలా జరిగిందంటే.. చిత్తూరు–బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఆనుకుని ఉన్న మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకు శాఖలో మేనేజరు పురుషోత్తం, క్యాషియర్ నారాయణస్వామితో పాటు మొత్తం ఆరుగురు పనిచేస్తున్నారు. బ్యాంకులోని లాకర్ (ఓ అల్మారా లాంటిది) తెరవాలన్నా, మూయాలన్నా మేనేజరు, క్యాషియర్ ఇద్దరి వద్ద ఉన్న తాళాలు తీస్తేనే జరుగుతుంది. ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం మేనేజరు, క్యాషియర్ అన్నింటిని లాక్ చేశారు. క్యాషియర్ తాళాలు మేనేజర్‌కు ఇచ్చేశారు. ప్రధాన ద్వారానికి సంబంధించిన తాళాలు క్యాషియర్, మేనేజర్ వద్ద ఉంటాయి. ఏ ఒక్కరు వచ్చైనా దీన్ని తెరిచే అవకాశముంది. శనివారం బ్యాంకు సెలవు అయినప్పటికీ మేనేజరు వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. ఆదివారం ఎవరూ బ్యాంకుకు రాలేదు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో క్యాషియర్ బ్యాంకు ప్రధాన ద్వారం తెరచి లోపలకు వెళ్లాడు. ఓ టేబుల్‌పై కంప్యూటర్ సీపీయూను తెరిచినట్లు ఉండటాన్ని గుర్తించాడు. కంప్యూటర్లు ఆన్ చేయడానికి ప్రయత్నిస్తే అవి పనిచేయలేదు. కొద్దిసేపటికి మేనేజర్ కూడా వచ్చి చూడగానే ఇక్కడ చోరీ జరిగిందని సిబ్బందికి చెప్పాడు. పోలీసులకు మాత్రం మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్‌చేసి తమ బ్యాంకులో చోరీ జరిగినట్లు సమాచారమిచ్చారు. వెంటనే చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డితో పాటు యాదమరి, చిత్తూరు క్రైమ్ పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో చోరీ జరిగిన తీరును పరిశీలించారు. పక్కా ప్రణాళికతో.. బ్యాంకులో చోరీ జరిగిన తీరు పరిశీలిస్తే నివ్వరెపోవాల్సిందే. దొంగతనాన్ని ప్రవృత్తిగా పెట్టుకున్న వ్యక్తి కచ్చితంగా షటర్‌ను పగులగొట్టడమే, గేట్లను విరచడమో చేయాలి. కానీ ఎంచక్కా ప్రధాన ద్వారం తాళాలు తీసి బ్యాంకు లోపలికి వెళ్లి లాకర్ల తాళాలు తీసి, బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఇక బ్యాంకు లోపల, బయట సీసీ కెమెరాలు ఉన్నా ఏ ఒక్కటీ పనిచేయలేదు. అలాగని వైర్లను కత్తిరించలేదు. బ్యాంకు లోపలున్న ప్రధాన కంప్యూటర్ సర్వర్‌లో అమర్చిన హార్డ్‌డిస్క్‌ను ముందుగానే తీసుకెళ్లిపోయారు. బ్యాంకులో రూ.4 లక్షలకు పైగా నగదు ఉంటే కేవలం రూ.2.30 లక్షల వరకు మాత్రమే చోరీ చేసి, మిగిలిన నగదును ఇక్కడే వదిలేశారు. ఇవన్నీ చోరీలో బ్యాంకులో పనిచేసేవారి హస్తం ఉందని నిర్ధారిస్తున్నాయి. పక్కా ప్రణాళికతోనే చోరీకి పాల్పడ్డట్లు స్పష్టమవుతోంది. పైగా బ్యాంకు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చోరీలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రాబ్యాంకులో నగలు, నగదు చోరీకి గురికావడంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. పద్నాలుగేళ్ల క్రితం.. 2005వ సంవత్సరం.. యాదమరి మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి ఇక్కడున్న బ్యాంకు లాకర్లను తొలగించిన దుండగులు ఏకంగా 22 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను కొల్లగొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ కేసులో తమిళనాడుకు చెందిన అయ్యనార్, మరో పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 19 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిని ఖాతాదారులకు పంచడానికి ఏళ్ల సమయం పట్టింది. మరోవైపు బెయిల్‌పై బయటకొచ్చిన ఈ ముఠా కేరళలోని మరో బ్యాంకుకు కన్నంవేసి అక్కడ 20 కిలోలకు పైగా బంగారం దోపిడీ చేయడం సంచలనం రేకెత్తింది. -
ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ..
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని యాదమర్రి ఆంధ్రాబ్యాంక్‌లో బారీ దోపిడీ జరిగింది. బ్యాంక్‌లో రూ. 3.5 కోట్లు విలువచేసే తాకట్టు బంగారం మాయం అయింది. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. అలాగే బ్యాంక్ సెక్యూరిటీ, అకౌంటెంట్, క్యాషియర్, అకౌంటెంట్, మేనేజర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ దోపిడీకి సంబంధించి మేనేజర్ సుబ్రహ్మణ్యం పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సైరా..సై..ఎద్దుల కుమ్ములాట!
సాక్షి, యాదమరి(చిత్తూరు) : పాడుబడిన బావిలో పడిన వృషభ రాజాన్ని శ్రమలకోర్చి అగ్నిమాపక సిబ్బంది కాపాడిన సంఘటన బుధవారం రాత్రి కీనాటంపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన రైతు పౌల్‌కు కొన్ని ఆవులతో పాటు రెండు ఎద్దులు ఉన్నాయి. వీటిలో ఒకటి మామూలు ఎద్దుకాగా మరొకటి పరుగు పందాల్లో సత్తా చాటేది. దీని విలువ రూ.2లక్షల వరకూ ఉంటోంది. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని తన పొలం వద్ద పౌల్ ఆవులను కట్టేసి ఉంచేవాడు. ఈ నేపథ్యంలో పరుగు పందెం ఎద్దు, మరో ఎద్దు..కట్టుతాళ్లను తెంపుకుని రెండూ రోషంతో కుమ్ములాటకు తెగబడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఈ పోట్లాటలో పరుగు పందెం ఎద్దుపై మరో ఎద్దు కాస్తా ఆధిక్యత కనబరచింది. దీని ధాటికి పందెం ఎద్దు పరుగులు తీసింది. అప్పటికీ ఆ ఎద్దు శాంతించక దానికి వెంబడించింది. దీంతో పందెం ఎద్దు పరుగులు తీస్తూ అదుపు తప్పింది. చీకట్లో 100 అడుగుల లోతు ఉన్న పాడుపడిన బావిలో పడిపోయింది. పందెం ఎద్దును బావి నుంచి బయటకు తీస్తున్న అగ్నిమాపక సిబ్బంది కొంతసేపటికి పౌల్ తన పొలం వద్దకు వచ్చి చూస్తే పందెం ఎద్దు కనబడకపోవడంతో దాని కోసం గాలించాడు. పొలం వద్ద పాడుబడిన బావి నుంచి ఎద్దు అరుపులు వస్తుండడం గుర్తించి అక్కడికి చేరుకున్నాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం చేరవేశాడు. వారు హుటాహుటిన వచ్చి పరిశీలించారు. బావి లోతు ఎక్కువగా ఉండడంతో తాళ్లతో వెలికితీయడం అసాధ్యమని గ్రహించి, క్రేన్ తెప్పించారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో ‘ఆపరేషన్ పందెం ఎద్దు’ పనులు మొదలెట్టారు. బావిలోంచి పిచ్చిమొక్కలు, చెట్లు ఏపుగా పెరిగిపోయి ఉండడంతో ఎద్దు సరిగా కనిపించలేదు. కొంతమంది సిబ్బంది ధైర్యం చేసి బావిలోకి దిగారు. లైట్ల సాయంతో ఎద్దును గుర్తించారు. క్రేన్ కొక్కీని బావిలోకి విడవడంతో దానికి ఎద్దును సురక్షితంగా కట్టారు. చెట్ల కొమ్మల మధ్య నుంచి ఆ ఎద్దును పైకి తీశారు. అదృష్టశాత్తు చెట్ల కొమ్మలే పందెం ఎద్దు ప్రాణాలతో బైటపడటానికి కారణమయ్యాయి. చెట్ల కొమ్మలను తగులుకుంటూ సినీ ఫక్కీలో అది బావిలో పడటంతో బలమైన గాయాలు కలగలేదు. చెట్ల కొమ్మలు లేకపోయిన పక్షంలో సరాసరి నేరుగా పడి మరణించి ఉండేదని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. మొత్తానికి ఎద్దు వెలికితీతకు దాదాపు మూడున్నర గంటలకు పైగా పట్టింది. గ్రామస్తులకు ఈ ఆపరేషన్ ఉత్కంఠ కలిగించించింది. మొత్తం మీద పందెం ఎద్దు రాత బాగుందంటూ పలువురు వ్యాఖ్యానించడంతో పౌల్ అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. -
‘పోలీసులు సకాలంలో స్పందించి ఉండాల్సింది’
చిత్తూరు: పోలీసులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకుని వుంటే ఈ ఘోరం జరిగేది కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. జిల్లాలోని యాదమరి మండలం వరిగపల్లిలో శుక్రవారం రంజిత్ అనే వ్యక్తి ట్రాక్టర్‌తో విమలమ్మ అనే మహిళను తొక్కించి చంపిన ఘటనపై ఆయన స్పందించారు. మృతురాలికి శ్రద్ధాంజలి ఘటించి తీవ్రంగా గాయపడిన ఆమె భర్త జగన్నాథరెడ్డిని పరామర్శించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ... ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపితే మాత్రం హౌస్ అరెస్టులు చేస్తారని, ఇలాంటి నేర సంఘటనల్లో నిందితులపై చర్యలు తీసుకుంటే ప్రజలు సంతోషంగా ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి సెక్షన్ 447,302,307,341, రెడ్‌విత్ 109 ఐపీసీల ప్రకారం కేసు నమోదు చేశారు. -
టీడీపీ నేత కిడ్నాప్.. నలుగురు కిడ్నాపర్ల అరెస్ట్
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో బుధవారం నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాపర్లు యాదమర్రిలో టీడీపీ నేత భజలింగంను కిడ్నాప్ చేశారు. ఆయన నుంచి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దాంతో భజలింగం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కిడ్నాపర్లకు 50 లక్షల రూపాయలు ఇచ్చేందుకు భజలింగం కొడుకులు వెళ్లగా.. కిడ్నాపర్లను రెడ్ హ్యాండెడ్‌గా బంగారుపాళ్యెం పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.