పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీస్తున్న కూలీలు(ఇన్‌సెట్) మురళీ కల్యాణ్(పైల్)
సాక్షి, చిత్తూరు: మామిడి తోటలో యువకుడి తల, మొండెం వేరు చేసి, శవాన్ని గుంతలో పాతిపెట్టిన ఘటన చిత్తూరు జిల్లా యాదమరి మండలం దళవాయిపల్లెలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీనివాసుల రెడ్డి, యాదమరి ఇన్‌చార్జి ఎస్‌ఐ ప్రసాద్ కథనం మేరకు, మామిడితోటలో చెట్టుకింద గొయ్యిలో ఏదో పూడ్చిపెట్టినట్లు కనపడడంతో పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సీఐ, ఎస్‌ఐ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
గొయ్యి పూడ్చిన ప్రాంతంలో మట్టి తవ్వి తీశారు. చెయ్యి కనపడడంతో మరింత లోతుగా మట్టిని తొలగించారు. చివరకు తల, మొండెం వేరుచేసి ఉన్న శవాన్ని బయటకు తీశారు. అదే గ్రామానికి చెందిన మురళీ కల్యాణ్(19) అలియాస్ గుంతోడు అని స్థానికులు గుర్తించారు. దీనిపై ఇన్‌చార్జ్ ఎస్‌ఐ ప్రసాద్ కేసు నమోదు చేయగా సీఐ శ్రీనివాసుల రెడ్డి విచారణ చేపట్టారు. శవాన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానితులను అదుపులోకి తీసు కొని విచారిస్తున్నామని, వీలైనంత త్వరగా నిందితులను అరెస్టు చేస్తామని సీఐ వివరించారు.
మృతుడు అనాథ
దళవాయిపల్లెకు చెందిన కల్పన, చంద్రబాబు దంపతుల కుమారుడు మురళీ కల్యాణ్. చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతి చెందడంతో అనాథగా మారాడు. దీంతో అదే గ్రామంలోని అవ్వా, తాతల వద్ద ఉంటున్నాడు. చదువులేకపోవడంతో భవన నిర్మాణ పనులు చేసుకుంటున్నాడు. ఇంతవరకు పెళ్లి కాలేదు. స్నేహితులతో కలసి ఆదివారం రాత్రి మద్యం తాగిన కల్యాణ్, అనంతరం హత్యకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment