వేధించి ఉసురు తీశాడు | Young man who stabbed the young woman to death in Chittoor | Sakshi
Sakshi News home page

వేధించి ఉసురు తీశాడు

Published Sat, Jun 5 2021 4:45 AM | Last Updated on Fri, Sep 17 2021 5:56 PM

Young man who stabbed the young woman to death in Chittoor - Sakshi

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమోన్మాది యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు. విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చివరకు తను కూడా గొంతు కోసుకుని పడిపోయాడు. అంతలో ఘటనా స్థలానికి వచ్చిన యువతి సోదరుడు ఆ ప్రేమోన్మాది తలపై బండరాయితో మోదాడు. ప్రేమోన్మాది కూడా ప్రాణాలు విడిచాడు. చిత్తూరు నగరం రీడ్స్‌పేటకు చెందిన వరదయ్య, లత దంపతులకు సుస్మిత(21), సునీల్‌ సంతానం. వంటపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలిద్దరినీ చదివించాడు వరదయ్య. నగర శివారులోని సాంబయ్యకండ్రిగలో ఇందిరమ్మ ఇల్లు రావడంతో పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు. సుస్మితకు ఇటీవల చిత్తూరు శివారులోని చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం వచ్చింది. స్థానిక శ్రీనివాసనగర్‌కు చెందిన ఆనంద్, అల్లియమ్మ దంపతుల మూడో కుమారుడు చిన్నా (24). వారి కుటుంబం కూడా సాంబయ్యకండ్రికలోని ఇందిరమ్మ ఇంట్లోనే స్థిరపడింది.  

ప్రేమ పేరిట వేధింపులు  
కొన్నాళ్లుగా సుస్మితను చిన్నా ప్రేమ పేరిట వేధించడం మొదలెట్టాడు. దీంతో ఈ ఏడాది జనవరిలో సుస్మిత కుటుంబ సభ్యులు చిన్నాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. చిన్నా వేధింపులపై తిరిగి రెండు నెలల కిందట వరదయ్య మళ్లీ పోలీసులకు చెప్పగా.. పోలీసులు చిన్నాకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా సుస్మితపై పగ పెంచుకుని ఆమెను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. గురువారం రాత్రి డ్యూటీ చేసిన సుస్మిత.. శుక్రవారం ఉదయం తన తమ్ముడు సునీల్‌తో కలిసి ఇంటికొచ్చింది. అప్పటికే ఆమె తండ్రి హోటల్లో వంట చేసేందుకు వెళ్లగా, తల్లి మార్కెట్‌కు వెళ్లింది. అక్కను ఇంటి వద్ద దిగబెట్టి తన తల్లిని తీసుకొచ్చేందుకు సునీల్‌ మార్కెట్‌కు వెళ్లాడు. సుస్మిత ఇంటికి వెనుక వైపే చిన్నా ఇల్లు ఉండటంతో ఇంటిపైకెక్కి మూడు భవనాలు దాటుకుంటూ సుస్మిత ఇంట్లోకి దూకాడు.

తన ప్రేమను ఎందుకు నిరాకరిస్తున్నావంటూ బెదిరించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితంగా ఆమెను పొడిచాడు. గొంతుపై కూడా పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమె శరీరంపై ఎనిమిది కత్తిపోట్లున్నాయి. అప్పటికే చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో అదే కత్తితో తన గొంతు కోసుకుని కిందపడిపోయాడు. అంతలో సునీల్‌ తన తల్లితో సహా ఇంటికొచ్చాడు. రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న సోదరిని చూసి రగిలిపోతూ బండరాయి తీసుకుని చిన్నా తలపై మోదాడు. చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, వన్‌టౌన్‌ సీఐ నరసింహరాజు తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement