Love harassment
-
ప్రేమోన్మాది వేధింపులకు విసిగి..
యశవంతపుర: ప్రేమించాలని యువకుని వేధింపులు తట్టుకోలేక యువతి ప్రాణాలు తీసుకుంది. ఈ దుర్ఘటన హాసన జిల్లా బేలూరు తాలూకా నిడగూడు గ్రామంలో జరిగింది. జయణ్ణ కూతురు సంగీత (21)తో తమ కుమారుడు శివుకు పెళ్లి చేయాలని అతని తల్లిదండ్రులు అడిగితే తిరస్కరించారు. ప్రేమించాలని శివు తరచూ సంగీతను వేధించేవాడు. ఈనెల 11న సంగీత కుటుంబం బేలూరులోని అయ్యప్పస్వామి గుడికి వెళ్తే శివు వచ్చి ప్రేమించాలని సతాయించాడు. ఆమెను దూషించి తలపై కొట్టాడు. నన్ను ప్రేమించకుంటే హత్య చేస్తానని, నేను ఫోన్ చేస్తే మాట్లాడాలని హెచ్చరించాడు. గుడిలో అందరి ముందు ఇలా అవమానించడంతో సంగీత కుంగిపోయింది. ఇంటికి వచ్చాక గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. శివు వేధింపులే కారణమని తల్లిదండ్రులు బేలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా శివును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
ప్రేమ పేరుతో వంచన.. రహస్య వీడియోలు బయటపెడతానని..!
తిరుత్తణి: ప్రేమ పేరిట యువతిని మోసం చేసిన యువకుడిని పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. తిరుత్తణి యూనియన్ ఎస్.అగ్రహారం గ్రామానికి చెందిన యువతి (24) చైన్నెలో ప్రయివేటు కళాశాలలో చదువుతోంది. రోజూ తిరుత్తణి నుంచి ట్రైనులో కళాశాలకు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో ఆమెకు గుడిగుంట గ్రామానికి చెందిన ఇళంగో(30)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమెను అనుభవించాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు తీశాడు. తనను వివాహం చేసుకోవాలని యువతి కోరగా కుదరదని, ఎవరికై నా చెబితే అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె యువకుడి ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. వారు కూడా ఆమెను బెదిరించి పంపి వెంటనే యువకుడికి వేరొక అమ్మాయితో వివాహం చేశారు. మోసపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుత్తణి ఎస్ఐ రాఖీకుమారి కేసు నమోదు చేసి ఇళంగోను అరెస్టు చేశారు. పైగా యువతిని బెదిరించి ఆత్మహత్యకు ప్రేరేపించి పరారిలో వున్న ఇళంగో తండ్రి నాగరత్నం, అతని పెదనాన్న చక్రపాణి, కృష్ణమూర్తి, చిన్నాన్న సంజీవులు కోసం గాలిస్తున్నారు. -
ప్రేమ వేధింపులకు విసిగి.. బాలిక తీవ్ర నిర్ణయం..
వికారాబాద్: ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన యాలాల మండల పరిధిలోని హాజీపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ అరవింద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్జుకాడి వెంకటమ్మ, రాములు దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. వీరిలో పెద్ద కూతురు ప్రవలిక (17) పదో తరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన కమాలి రాజు కొంతకాలంగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ప్రవలికను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాజు వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
డిగ్రీ విద్యార్థిని అనూష హత్య కేసు.. ప్రేమోన్మాదికి జీవితఖైదు
నరసరావుపేట టౌన్: తన ప్రేమను నిరాకరించిందని యువతిని దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాదికి జీవితఖైదు, రూ.2,500 జరిమానా విధిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఒంగోలు వెంకటనాగేశ్వరరావు గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కోటా అనూష నరసరావుపేట రామిరెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదివేది. అదే కళాశాలలో చదువుతున్న బొల్లాపల్లి మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మేడం విష్ణువర్ధన్‌రెడ్డి తనను ప్రేమించాలని అనూషను వేధింపులకు గురిచేశాడు. ఆమె నిరాకరించడంతో 2021, ఫిబ్రవరి 24న కళాశాలకు వెళుతున్న అనూషను మాట్లాడాలని విష్ణువర్ధన్‌రెడ్డి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారులోని పాలపాడు రోడ్డు గోవిందపురం మైనర్ కాలువ వద్దకు తీసుకువెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి పరారయ్యాడు. మృతురాలి తల్లి వనజాక్షి ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవడంతోపాటు రూ.10 లక్షల పరిహారం అందించింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును పల్నాడు జిల్లా దిశ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రత్యేక విచారణ అధికారిగా డీఎస్పీ రవిచంద్రను నియమించారు. హత్యపై సమగ్ర వివరాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేసి సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. దీంతో విచారణ చేసిన న్యాయమూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి జీవతఖైదు, రూ.2,500 జరిమానా విధించారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను ఎస్పీ రవిశంకర్‌రెడ్డి అ«భినందించారు. దిశ డీఎస్పీ రవిచంద్రను అనూష తల్లిదండ్రులు సన్మానించారు. పోలీసుల సహకారంతోనే త్వరగా శిక్ష ప్రేమించలేదన్న అక్కసుతో మా అమ్మాయిని దుండగుడు విష్ణువర్ధన్‌రెడ్డి కిరాతకంగా గొంతునులిమి హత్య చేశాడు. పోలీసుల సహకారంతో త్వరితగతిన నిందితుడికి శిక్ష పడింది. ప్రభుత్వం, పోలీసులు మా కేసు పట్ల చూపించిన శ్రద్ధ మరువలేం. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడినప్పటికీ... ఉరిశిక్ష వేసి ఉంటే బాగుండేది. – కోటా వనజాక్షి, అనూష తల్లి ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టాం. నిందితుడ్ని 24 గంటల్లో అరెస్ట్ చేసి 48 గంటల వ్యవధిలో ప్రాథమిక చార్జిషీట్, వారం రోజుల్లో సమగ్ర విచారణ జరిపి తుది చార్జిషీట్‌ను దాఖలు చేశాం. దిశ ద్వారా సత్వర న్యాయం అందుతుందన్న భావన ఈ కేసుతో రుజువైంది. – రవిచంద్ర, దిశ డీఎస్పీ, నరసరావుపేట -
Mancherial: పాపం సాయిష్మ.. ఎంగేజ్మెంట్ అయ్యిందన్నా ప్రేమోన్మాది వదల్లేదు!
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడుతున్న యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులను ఆమెను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. వివరాలు.. మంచిర్యాల జిల్లా దండపేల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన ఎంబడి సాయిష్మ అనే యువతిని అదే గ్రామానికి చెందిన నలిమేల వినయ్ కుమార్ గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని తరుచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తనకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని, వేధించవద్దని సాయిష్మ కోరినా.. యువకుడు పట్టించుకోలేదు. అంతేగాక తనను పెళ్లి చేసుకోకపోతే నీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఈనెల 18న యువతికి ఫోన్‌చేసి నువ్వు చచ్చిపో, బతికి ఉండకంటూ బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన సాయిష్మ.. వినయ్ వేధింపులు తట్టుకోలేక శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు వెంటనే చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకువచ్చారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కాగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయిష్మా మృతి చెందింది. దీంతో వినయ్ కుమార్ వల్లే తమ కూతురు చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
ప్రేమోన్మాది వేధింపులకు విద్యార్థిని బలి
భూదాన్‌పోచంపల్లి: ఓ ప్రేమోన్మాది వేధింపులకు మనస్తాపం చెంది పదో తరగతి విద్యార్థిని ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల కావ్య(16) చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదోతరగతి చదువుతోంది. కావ్య ఇన్‌స్టా్రగామ్‌లో ఇదే గ్రామానికి చెందిన మాచర్ల శివమణి తనను ప్రేమించాలని మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో తనను ప్రేమించకపోతే మీ నాన్న, అన్నను చంపేస్తానని, డబ్బులు కూడా కావాలని బెదిరింపులకు గురిచేశాడు. భయపడిన కావ్య ఇటీవల తన సోదరుడు నరేశ్‌కు విషయం చెప్పింది. దీంతో తన చెల్లెలికి మేసేజ్ పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని శివమణిని నరేశ్ హెచ్చరించాడు. ఇదే క్రమంలో డిసెంబర్ 31న అర్ధరాత్రి నరేశ్, శివమణి మధ్య గొడవ జరిగింది. ఆ రోజు రాత్రి కావ్యకు శివమణి ఫోన్‌చేసి ‘మీ అన్నను చంపేస్తాను’ అని బెదిరించడంతో ఆమె మనస్తాపం చెంది పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో కోలుకొని ఈ నెల 2న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. మందలించినా మారని తీరు.. ఈ నెల 2న గ్రామంలో ఇరు కుటుంబాల పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు. ఇకపై కావ్య, ఆమె కుటుంబం జోలికి పోకుండా చూసుకోవాలని శివమణి తల్లిదండ్రులకు చెప్పారు. అయినా శివమణి మళ్లీ మెసేజ్‌లు పెడుతుండటంతో కావ్య కలత చెందింది. బుధవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొంది. సాయంత్రం నరేశ్ ఇంటికి వచ్చి చూడగా కావ్య ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. పోలీసులు పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గురువారం సాయంత్రం కావ్య అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి తండ్రి కన కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోచంపల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థినులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. -
ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు
-
ప్రేమోన్మాది ఘాతుకం
వెంకటగిరి/నెల్లూరు (క్రైం): తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఓ బాలిక గొంతుకోసిన ప్రేమోన్మాదిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చోటుచేసుకుంది. వెంకటగిరి పట్టణం అమ్మవారిపేటకు చెందిన బాలిక జ్యోతి (17) స్థానికంగా ఉన్న విశ్వోదయ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాలేజీమిట్ట ప్రాంతానికి చెందిన రాయపాటి చెంచుకృష్ణ ఆమెను ప్రేమిస్తున్నానని, తనతో మాట్లాడాలని కొంతకాలంగా వెంటపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు చెంచుకృష్ణను మందలించారు. కక్షకట్టిన అతను సోమవారం బాలిక ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన నిందితుడు ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు కోసి పరారయ్యాడు. బాలిక ఇంటికి సమీపంలోనే ఉన్న తన ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ సీహెచ్ విజయారావు ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, వెంకటగిరి ఇన్చార్జి సీఐ శ్రీనివాసులరెడ్డి, వెంకటగిరి, బాలాయపల్లి ఎస్ఐలు కోటిరెడ్డి, జిలానీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాలికను చికిత్స నిమిత్తం వెంకటగిరిలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిలో నిందితుడు హత్యకు వినియోగించిన చాకును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసు ఎస్కార్ట్‌తో మెరుగైన చికిత్స నిమిత్తం బాలికను తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు. బాధితురాలికి పోలీసు రక్షణ ఏర్పాటు చేశారు. వారంలో చార్జిషీట్ : ఎస్పీ ఈ ఘటనపై ఎస్పీ సీహెచ్ విజయారావు నెల్లూరు నగరంలోని ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో వివరాలు వెల్లడించారు. నిందితుడిపై హత్యాయత్నం, పోక్సో చట్టం కింద కేసు (సెక్షన్లు 354–డి, 452, 324,307ఐపిసి సెక్షన్ 10 ఆర్/డబ్ల్యూ 9 (ఐ) అండ్ సెక్షన్ 12 ఆఫ్ పోక్సోయాక్ట్ 2012) నమోదు చేశామన్నారు. ఘటనపై త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి వారంలోపు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ వెల్లడించారు. నిందితుడిపై సస్పెక్టెడ్ షీట్ తెరుస్తామన్నారు. కాగా, ప్రేమోన్మాది చెంచుకృష్ణ చేతిలో గాయపడి తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న జ్యోతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి పరామర్శించారు. బాధితురాలికి మహిళా కమిషన్ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
ప్రేమించానని నమ్మించి.. ఆమె ఫొటోలు తీసి పెళ్లిళ్లు చెడగొడుతూ..
సాక్షి, తూర్పుగోదావరి(పిఠాపురం): ప్రేమ పేరుతో ఓ బాలికను దారుణంగా వంచించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరరావు కథనం ప్రకారం.. గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన బాలిక (17) పిఠాపురంలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఎంఎల్టీ ఒకేషనల్ కోర్సు చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కుక్కా రామకృష్ణ ప్రేమ పేరుతో రెండేళ్లు ఆమె వెంట పడ్డాడు. తాను ఇంకా చదువుకోవాలని, తనకు ప్రేమ ఇష్టం లేదని చెప్పినా వినేవాడు కాదు. తనను ప్రేమించకపోతే పురుగుల మందు తాగి చచ్చిపోతానంటూ బెదిరించాడు. దీంతో తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇస్తేనే ప్రేమిస్తానని ఆ బాలిక చెప్పగా అంగీకరిస్తున్నానని నమ్మించిన రామకృష్ణ ఆమెను లొంగదీసుకున్నాడు. వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లేవాడు. ఎంత వారించినా వినకుండా తన సెల్ ఫోన్లో ఆమె ఫొటోలు తీసేవాడు. చదవండి: (వంటగదిలో ప్రియుడితో భార్య.. భర్తకు మెలకువచ్చి ప్రశ్నించగా) తల్లిదండ్రులు ఆ బాలికకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే.. రామకృష్ణ తన వద్ద ఉన్న ఫొటోలను పెళ్లికొడుకు తరఫు వారికి పంపించి సంబంధాలు చెడగొట్టేవాడు. అలాగైతే తనను పెళ్లి చేసుకోవాలని ఆమె గట్టిగా నిలదీయడంతో తన తల్లి కుక్కా గంగా సత్యవతి, అన్న మురళి అడ్డం పడుతున్నారని చెప్పాడు. ఈ వ్యవహారంపై బాలిక తల్లిదండ్రులు స్థానిక పెద్దల వద్ద గత ఏడాది డిసెంబర్ 30న పంచాయతీ పెట్టారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో ఆ బాలిక శనివారం పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామలింగేశ్వరరావు తెలిపారు. -
ఎంత పనిచేస్తివి.. ఏ కష్టం రానీయకుండా చూసుకున్నం కదామ్మా!
గజ్వేల్ రూరల్: పెళ్లయిన 15 ఏళ్లకు పుట్టిన కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కానీ ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించాడు. యువతి ఇల్లు, కాలేజీ చుట్టూ తిరుగుతూ ఇబ్బందిపెట్టాడు. విషయం తల్లిదండ్రులకు తెలిసి మందలించినా వేధింపులు ఆపలేదు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గజ్వేల్ పట్టణంలో శుక్రవారం ఈ విషాదం జరిగింది. ఆరు నెలలుగా వేధింపులు.. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గుండన్నపల్లికి చెందిన ఎల్ల యాదగిరి, అండాలు దంపతులు వ్యవసాయంతో పాటు మొక్కజొన్న కంకులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పెళ్లైన 15 ఏళ్లకు సంగీత (17) పుట్టింది. ప్రస్తుతం సంగీత గజ్వేల్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రజ్ఞాపూర్‌కు చెందిన సల్ల శ్రీకాంత్ అలియాస్ అర్జున్ అనే యువకుడు 6 నెలలుగా గుండన్నపల్లిలో సంగీత ఇంటి ముందు, కళాశాలకు వెళ్లే సమయంలో వెంబడిస్తూ ప్రేమించాలని వేధిస్తున్నాడు. విషయం సంగీత కుటుంబీకులకు తెలియడంతో 2 నెలల క్రితం యువకుడిని మందలించారు. కొద్ది రోజులు మిన్నకున్న తర్వాత మళ్లీ వారం రోజులుగా ఆ యువకుడు వెంబడించడం ప్రారంభించాడు. తనను ప్రేమించాలని, లేకుంటే తనతో కలిసి దిగిన ఫొటోలను అందరికీ చూపిస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని సంగీత ఇంటి పక్కన ఉండే బాబాయి కూతురితో చెప్పుకొని బాధపడింది. కాలేజీకి వెళ్లి వచ్చేందుకు కుటుంబీకులను తోడు తీసుకెళ్లేది. శ్రీకాంత్ వేధింపులతో మనస్తాపానికి గురై కళాశాలకు కూడా వెళ్లలేక బాధపడేది. చెల్లెలితో మాట్లాడి.. ఇంటికెళ్లి.. పరీక్షలు సమీపిస్తుండటంతో సంగీత గురువారం కళాశాలకు వెళ్లి వచ్చింది. సాయంత్రం ఇంటి పక్కనే ఉండే చెల్లెలితో కొద్దిసేపు మాట్లాడింది. తల్లిదండ్రు లు మొక్కజొన్న కంకులను విక్రయించేందుకు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తర్వాత గుర్తించిన కుటుంబీకులు తలుపులు తెరిచి చూడగా సంగీత విగతజీవిగా కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంగీత ఆత్మహత్య విషయం తెలుసుకున్న తోటి మిత్రులు, విద్యార్థులు శుక్రవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సంగీత ఫొటోలతో ప్లకార్డులను పట్టుకొని న్యాయం చేయాలని, ఆమె మృతికి కారణమైన యువకుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కడుపుకోత మిగిల్చావు బిడ్డా ‘అయ్యో బిడ్డా.. ఎంత పనిచేస్తివి. ఒక్కగానొక్క కూతురు. ఏ కష్టం రానీయకుండా చూసుకున్నం. నువ్వు దూరమై మాకు కడుపుకోత మిగిల్చావు’అంటూ సంగీత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యేలా ఏడ్చారు. శ్రీకాంత్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధించడంతో పాటు చంపుతానని బెదిరించడంతో తమ కూతురు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. సంగీత చావుకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం
అల్లిపురం (విశాఖ దక్షిణ): ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించడమే కాకుండా తాను కూడా ఆత్మహుతికి పాల్పడ్డాడు ఓ యువకుడు. విశాఖలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నగరంలో కరాస ప్రాంతానికి చెందిన వల్లభదాసు ప్రత్యూష (20), వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన పలకల హర్షవర్ధన్ (21) పంజాబ్‌లోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. ప్రత్యూషను ప్రేమిస్తున్నానంటూ ఆమెను కొద్దికాలంగా హర్షవర్ధన్ వేధిస్తున్నాడు. కానీ, అతని ప్రేమను ప్రత్యూష నిరాకరించింది. దీంతో శనివారం ప్రత్యూషతో మాట్లాడదామని చెప్పి నగరంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ.. తనను ప్రేమించాలని అడగటంతో ఆమె నిరాకరించింది. దీంతో హర్షవర్ధన్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను లాడ్జి రూమ్‌లోనే ప్రత్యూషపై పోసి నిప్పంటించాడు. అనంతరం తనపై పోసుకుని అక్కడే నిప్పంటించుకున్నాడు. గది నుంచి అరుపులు రావటంతో హోటల్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న ఇద్దరినీ హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. టూటౌన్ సీఐ కే వెంకట్రావు, ఎస్ఐ మన్మథరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరి శరీరాలు 60 శాతం మేర కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఇన్చార్జి హార్బర్ ఏసీపీ శిరీష సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి మేజిస్ట్రేట్ వాంగ్మూలం రికార్డు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వెంకటరావు తెలిపారు. -
ప్రేమోన్మాది బాధిత కుటుంబాన్ని ఆదుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి/రెడ్డిగూడెం(మైలవరం): ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకున్నారు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురానికి చెందిన వీరమల్ల పెద్ద జమలయ్య, ఏసమ్మల కుమార్తె చిన్నారిపై నాగభూషణం అనే ప్రేమోన్మాది గత ఏడాది అక్టోబర్‌లో విజయవాడ హనుమాన్‌పేటలో పెట్రోల్ పోసి నిప్పంటించగా అక్కడికక్కడే సజీవ దహనమైంది. యువతి కుటుంబ పరిస్థితిని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సీఎం దృష్టికి తీసుకువెళ్లగా.. అన్నివిధాలుగా ఆదుకోవాలని ఆదేశించారు. కాగా, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆ యువతి తల్లిదండ్రులను బుధవారం సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లగా.. జగన్ వారిద్దరికీ ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని, కుమారుడికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని సీఎం ఆదేశించగా.. రూ.10 లక్షలను అధికారులు అందజేశారు. -
ప్రియుడితో సహజీవనం.. వేధింపులతో..
వారిద్దరి మధ్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్నేహం చిగురించింది.. అదికాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. ఇళ్లలో తమకంటే పెద్దవారు ఉన్నారనే కారణంగా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. వీరి సహజీవన ప్రయాణంలో అనుమానపు పొరలు అలుముకున్నాయి. వేధింపులు భరిస్తూ బతకడం కంటే తనువు చాలించడమే మేలనుకున్న ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. కడప అర్బన్: ప్రేమించిన యువకుడు తనను వేధిస్తున్నాడంటూ ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కడప నగరం బుడ్డాయపల్లిలో జరిగిన ఈ సంఘటన వివరాలు మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన ఆంథోనీ గీత(25) కడపలోని నాగరాజుపేటలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. అదే ప్రాంతంలోని మరో ప్రైవేట్ హాస్పిటల్లో అనిల్‌కుమార్ ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. చదవండి: 15.74 ఎకరాలను నొక్కేసేందుకు కుట్ర వీరిరువురు గతంలో క్రిస్టియన్‌లేన్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న సమయంలో పరస్పరం ప్రేమించుకున్నారు. ఇంటిలో తమకంటే పెద్ద వయసు వారు ఉన్నారని, వారి పెళ్లిళ్లు కాగానే వివాహం చేసుకుందామని అనుకున్నారు. ఈ క్రమంలోనే అనిల్‌కుమార్ రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడ్డాయపల్లెలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటిలో ఇద్దరూ సహజీవనం చేసేవారు. ఈ మధ్య కాలంలో ఆంథోనీ గీతపై అనుమానం పెంచుకున్న అనిల్‌కుమార్ ఆమెను చచ్చిపో అంటూ వేధించేవాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె మంగళవారం అనిల్‌కుమార్ ఇంటిలో లేని సమయంలో ఇంటిపై భాగంలోకి వెళ్లి, ఇంజక్షన్ ద్వారా విషం ఎక్కించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి మల్లికను పోలీసులు పిలిపించారు. కేసు నమోదు చేసినట్లు రిమ్స్ సీఐ నరేంద్రరెడ్డి తెలిపారు. చదవండి: బెంగళూరులో దంపతుల హత్య... అనంతపురంలో నిందితుల అరెస్టు -
వరుడికి చేరిన ప్రైవేటు ఫొటోలు.. అవమానంతో యువతి ఆత్మహత్య
టెక్కలి రూరల్ (శ్రీకాకుళం): ప్రేమించానని మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకోమంటే కులాన్ని సాకుగా చూపి మొహం చాటేశాడు. పెద్దల బలవంతంతో ఆ యువతి వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడగా.. ఆమె ప్రైవేటు ఫొటోలను వరుడితోపాటు మరికొందరికి పంపించి అల్లరి పాల్జేశాడు. దీంతో అవమాన భారాన్ని దిగమింగుకోలేక ఆ యువతి ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెంటూరు గ్రామానికి చెందిన లీలావతి (25) తల్లిదండ్రులతో కలిసి టెక్కలిలో తన అక్క ఇంట్లో ఉంటోంది. లీలావతి అదే మండలంలోని నరేంద్రపురం గ్రామానికి చెందిన పైల వెంకటేష్ అనే యువకుడిని ఐదేళ్ల క్రితం ప్రేమించింది. వివాహం చేసుకోవాలని కోరగా.. కులం పేరు చెప్పి వెంకటేష్ పెళ్లికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల తల్లిదండ్రులు వేరే యువకుడిని పెళ్లి చేసుకునేలా లీలావతిని ఒప్పించారు. ఆగస్టు 26న పెళ్లి కూడా నిశ్చయించారు. ఈ విషయం తెలిసిన వెంకటేష్ ఆ యువతికి సంబంధించి కొన్ని ప్రైవేటు ఫొటోలను వరుడితోపాటు మరికొందరికి పంపించి అల్లరి చేశాడు. ఈ విషయం తెలిసిన లీలావతి అవమాన భారం తట్టుకోలేక శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ కొక్కేనికి ప్లాస్టిక్ వైరుతో ఉరి వేసుకుంది. -
నా ప్రేమ కాదంటే బ్లేడ్‌తో చేయి, గొంతు కోస్తా..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): తనను ప్రేమించాలని డిగ్రీ విద్యార్థినిని వేధిస్తున్న యువకున్ని చంద్రాలేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా మాదిరిలో రోడ్లపై వెంట పడుతూ డైలాగులు చెబుతూ పీడించేవాడు. మీ కూతురినే ప్రేమించి పెళ్లి చేసుకొంటానని అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించాడు. తనను కాదంటే బ్లేడ్‌తో చేయి, గొంతు కోస్తానని, డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకొంటానని చెప్పేవాడు. దీంతో బాధితులు చంద్రాలేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రోమియో రాజేశ్‌ను అరెస్ట్ జేసి జైలుకు తరలించారు. చదవండి: టీఆర్ఎస్ కట్టు బానిసను.. -
వేధించి ఉసురు తీశాడు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమోన్మాది యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు. విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చివరకు తను కూడా గొంతు కోసుకుని పడిపోయాడు. అంతలో ఘటనా స్థలానికి వచ్చిన యువతి సోదరుడు ఆ ప్రేమోన్మాది తలపై బండరాయితో మోదాడు. ప్రేమోన్మాది కూడా ప్రాణాలు విడిచాడు. చిత్తూరు నగరం రీడ్స్‌పేటకు చెందిన వరదయ్య, లత దంపతులకు సుస్మిత(21), సునీల్ సంతానం. వంటపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలిద్దరినీ చదివించాడు వరదయ్య. నగర శివారులోని సాంబయ్యకండ్రిగలో ఇందిరమ్మ ఇల్లు రావడంతో పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు. సుస్మితకు ఇటీవల చిత్తూరు శివారులోని చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం వచ్చింది. స్థానిక శ్రీనివాసనగర్‌కు చెందిన ఆనంద్, అల్లియమ్మ దంపతుల మూడో కుమారుడు చిన్నా (24). వారి కుటుంబం కూడా సాంబయ్యకండ్రికలోని ఇందిరమ్మ ఇంట్లోనే స్థిరపడింది. ప్రేమ పేరిట వేధింపులు కొన్నాళ్లుగా సుస్మితను చిన్నా ప్రేమ పేరిట వేధించడం మొదలెట్టాడు. దీంతో ఈ ఏడాది జనవరిలో సుస్మిత కుటుంబ సభ్యులు చిన్నాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. చిన్నా వేధింపులపై తిరిగి రెండు నెలల కిందట వరదయ్య మళ్లీ పోలీసులకు చెప్పగా.. పోలీసులు చిన్నాకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా సుస్మితపై పగ పెంచుకుని ఆమెను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. గురువారం రాత్రి డ్యూటీ చేసిన సుస్మిత.. శుక్రవారం ఉదయం తన తమ్ముడు సునీల్‌తో కలిసి ఇంటికొచ్చింది. అప్పటికే ఆమె తండ్రి హోటల్లో వంట చేసేందుకు వెళ్లగా, తల్లి మార్కెట్‌కు వెళ్లింది. అక్కను ఇంటి వద్ద దిగబెట్టి తన తల్లిని తీసుకొచ్చేందుకు సునీల్ మార్కెట్‌కు వెళ్లాడు. సుస్మిత ఇంటికి వెనుక వైపే చిన్నా ఇల్లు ఉండటంతో ఇంటిపైకెక్కి మూడు భవనాలు దాటుకుంటూ సుస్మిత ఇంట్లోకి దూకాడు. తన ప్రేమను ఎందుకు నిరాకరిస్తున్నావంటూ బెదిరించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితంగా ఆమెను పొడిచాడు. గొంతుపై కూడా పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమె శరీరంపై ఎనిమిది కత్తిపోట్లున్నాయి. అప్పటికే చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో అదే కత్తితో తన గొంతు కోసుకుని కిందపడిపోయాడు. అంతలో సునీల్ తన తల్లితో సహా ఇంటికొచ్చాడు. రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న సోదరిని చూసి రగిలిపోతూ బండరాయి తీసుకుని చిన్నా తలపై మోదాడు. చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ నరసింహరాజు తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ప్రేమ పేరుతో వేధింపులు..
సాక్షి, మల్కాజిగిరి: ప్రేమ పేరుతో ఓ విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిని మల్కాజిగిరి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ లింగస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్కాజిగిరి వాణీనగర్‌కు చెందిన సాయిప్రసాద్(35) ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా అతను అదే ప్రాంతానికి చెందిన విద్యార్థిని వెంటపడుతూ ప్రేమించాలని వేధిస్తున్నాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లి తండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. సోమవారం దయానంద్‌నగర్ స్టేషన్ వద్ద సాయిప్రసాద్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఇంటర్ విద్యార్థినిపై ఉన్మాది కత్తితో దాడి
-
యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పట్టపగలే అందరూ చూస్తుండగానే ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో దాడికి దిగాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతిపై కత్తితో ఇష్టానుసారంగా ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. స్థానికులు అప్రమత్తమవడంతో, అప్పటికే కత్తిపోట్లు పడ్డ యువతికి ప్రాణాపాయస్థితి తప్పింది. ప్రస్తుతం నిందితుడు దిలీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉన్న ఓ వస్త్రదుకాణంలో దిలీప్, బాధితురాలు పని చేసేవారు. ఇటీవలే ఆమెను ప్రేమిస్తున్నాని చెప్పడంతో యువతి నిరాకరించింది. అప్పటి నుంచి ఆమెను వెంటాడుతూ వేధించడం ప్రారంభించాడు. శనివారం మరింతగా రెచ్చిపోయాడు. ప్రేమిస్తావా చస్తావా అంటూ యువతిని అడ్డుకున్నాడు. ఆమె నిరాకరించడంతో తనతో తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడి చేశాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. స్థానికులు దిలీప్‌ను అడ్డుకుని యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. దిలీప్‌కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. -
ప్రేమోన్మాది చేతిలో విద్యార్థిని బలి
హైదరాబాద్: ఇద్దరూ పదవ తరగతి చదువుతూ ఒకే దగ్గర ట్యూషన్‌కు వెళ్లారు. అక్కడ ఏర్పడ్డ చనువు ప్రేమగా మారింది. రెండేళ్లు ఇద్దరి మధ్య సాగిన ప్రేమ వ్యవహారం మనస్పర్థలు రావడంతో దూరమయ్యారు. తన ప్రేమను నిరాకరిస్తుందని కసి పెంచుకున్న ఆ ప్రేమోన్మాది మాట్లాడదామని పిలిచి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు.ఈ హృదయ విదారక సంఘటన ఓయూ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బౌద్ధనగర్ డివిజన్ పరిధిలోని అంబర్‌నగర్‌లో బీఎస్ఎన్ ఉద్యోగి హరిప్రసాద్ తన భార్య రేవతి, కుమార్తెలు అనూష (16), గ్రీష్మలతో కలిసి నివాసముంటున్నాడు. కాగా హరిప్రసాద్‌కు ఇటీవలే విజయవాడకు బదిలీ అవడంతో, కుటుంబాన్ని ఇక్కడే ఉంచి తను మాత్రం విజయవాడ వెళ్లివస్తున్నాడు. హరిప్రసాద్ పెద్ద కూతురు అనూష నారాయణగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. కాగా ఇదే ప్రాంతంలో నివాసముండే ఆరెపల్లి రవీందర్ కుమారుడు ఆరెపల్లి వెంకటేశ్ (19) సైతం హిమాయత్‌నగర్‌లోని న్యూచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. పక్కపక్క వీధుల్లో నివాసముండే వెంకటేష్, అనూషలు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వెంకటేశ్ ప్రవర్తనతో విసుగుచెందిన అనూష గత ఆర్నెళ్లుగా అతనితో దూరంగా ఉంటోంది. తనను వదిలేయాలని కోరడమే కాకుండా అతని ప్రేమను నిరాకరిస్తూ వస్తోంది. దీంతో వెంకటేశ్ అనూషపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకుని మంగళవారం రాత్రి మాట్లాడాల్సి ఉందని చెప్పి ఓయూ దూర విద్యా కేంద్రం సమీపంలోని క్వార్టర్ల వద్దకు పిలిచాడు. అతని మాటలు నమ్మిన అనూష అక్కడకు వెళ్లింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో వెంకటేశ్ ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. అనూష పెద్దగా అరుస్తూ కుప్పకూలిపోయింది. చితకబాదిన స్థానికులు అనూష అరుపులు విన్న ఇమ్రాన్, ఇజాజ్అనే ఇద్దరు యువకులు అక్కడికి వెళ్లి చూడగా, అప్పటికే అనూష రక్తం మడుగులో కొట్టుకుంటోంది. ఘటన స్థలంలో ఉన్న వెంకటేశ్ వీరిని చూసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని వెంకటేశ్‌ను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని, అనూషను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే ఆమె మృతి చెందింది. -
ప్రేమించట్లేదని.. విద్యార్థినిపై బ్లేడుతో దాడి
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. తన ప్రేమను నిరాకరించిందని తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఓ యువకుడు బ్లేడుతో దాడి చేశాడు. ఈ సంఘటన ఏలూరు పాత బస్టాండ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన విజయ్ అనే యువకుడు స్థానికంగా ఉంటున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని ప్రేమ పేరుతో వేదింపులకు గురిచేస్తున్నాడు. బాలిక అతని ప్రేమను తిరస్కరించడంతో స్నేహితులతో కలిసి ఆమె పై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో విద్యార్థిని చేతికి, ముఖానికి గాయాలుకావడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
నా చావుకు ఈడే కారణం..
విజయవాడ : విజయవాడలో దారుణం జరిగింది. ఆకతాయి వేధింపులకు ఇంటర్మీడియట్ విద్యార్ధిని తేజశ్రీ మానస బలైంది. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం యనమలకుదురు శివపార్వతీనగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి మర్రిబోయిన మధుసూదనరావు,వెంకట శైలజలకు తేజశ్రీ మానస(16)కుమార్తె ఉంది. ఆమె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. వీరి ఇంటి సమీపంలో ఈడే శ్రీనివాసరావు కుటుంబం ఉంది. కాగా శ్రీనివాసరావు కుమారుడు రేణుకారావు(19)(నాని) తేజశ్రీ మానసతో చనువుగా ఉండేవాడు. అయితే అతను ప్రేమించమని వేధించడంతో ఆమె కొంతకాలంగా దూరంగా ఉంది. అయినా ఫోన్ చేయడం, మెసేజ్‌లు పెట్టడంతో విషయాన్ని బాలిక తల్లి వెంకట శైలజ దృష్టికి తీసుకువచ్చింది. దీంతో బాలిక వద్ద ఉన్న ఫోన్ తల్లికి ఇచ్చేయగా ఆమెకు కూడా ఫోన్ చేసి మానసను ప్రేమిస్తున్నానంటూ ఫోన్లు చేశాడు. గుడికి వెళ్లి వచ్చేలోపు బలవన్మరణం తేజశ్రీమానస తల్లి శైలజ పుట్టినరోజు బుధవారం కావడంతో దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళతామని కుమార్తె తేజశ్రీమానసను రమ్మని తల్లి కోరింది. ఇంటర్ మొదటి ఏడాది ఫలితాలు వచ్చిన తరువాత గుడికి వస్తానని చెప్పడంతో తల్లి ఉదయం 11.30 గంటల ప్రాంతంలో గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు లోపల గడియపెట్టి ఉంది. ఎంతసేపటికీ తీయకపోవడంతో తలుపు తీసి లోనికి వెళ్లి చూడగా వంటగ గదిలో తేజశ్రీమానస చున్నీతో ఫ్యాన్ కొక్కానికి ఉరేసుకుని ఉంది. ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. తన కుమార్తెను ప్రేమించమని వేధించడం వలనే మృతి చెందిందని మృతురాలి తల్లి శైలజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మృతురాలు సూసైడ్‌నోట్‌లో కూడా తన మరణానికి (నా చావుకు ఈడే కారణం) రేణుకారావు కారణమని రాసింది. పోలీసులు సూసైడ్‌నోట్ స్వాధీనం చేసకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.