వారిద్దరి మధ్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్నేహం చిగురించింది.. అదికాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. ఇళ్లలో తమకంటే పెద్దవారు ఉన్నారనే కారణంగా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. వీరి సహజీవన ప్రయాణంలో అనుమానపు పొరలు అలుముకున్నాయి. వేధింపులు భరిస్తూ బతకడం కంటే తనువు చాలించడమే మేలనుకున్న ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.
కడప అర్బన్: ప్రేమించిన యువకుడు తనను వేధిస్తున్నాడంటూ ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కడప నగరం బుడ్డాయపల్లిలో జరిగిన ఈ సంఘటన వివరాలు మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన ఆంథోనీ గీత(25) కడపలోని నాగరాజుపేటలో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. అదే ప్రాంతంలోని మరో ప్రైవేట్ హాస్పిటల్‌లో అనిల్‌కుమార్ ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.
చదవండి: 15.74 ఎకరాలను నొక్కేసేందుకు కుట్ర
వీరిరువురు గతంలో క్రిస్టియన్‌లేన్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న సమయంలో పరస్పరం ప్రేమించుకున్నారు. ఇంటిలో తమకంటే పెద్ద వయసు వారు ఉన్నారని, వారి పెళ్లిళ్లు కాగానే వివాహం చేసుకుందామని అనుకున్నారు. ఈ క్రమంలోనే అనిల్‌కుమార్ రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడ్డాయపల్లెలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటిలో ఇద్దరూ సహజీవనం చేసేవారు. ఈ మధ్య కాలంలో ఆంథోనీ గీతపై అనుమానం పెంచుకున్న అనిల్‌కుమార్ ఆమెను చచ్చిపో అంటూ వేధించేవాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె మంగళవారం అనిల్‌కుమార్ ఇంటిలో లేని సమయంలో ఇంటిపై భాగంలోకి వెళ్లి, ఇంజక్షన్ ద్వారా విషం ఎక్కించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి మల్లికను పోలీసులు పిలిపించారు. కేసు నమోదు చేసినట్లు రిమ్స్ సీఐ నరేంద్రరెడ్డి తెలిపారు.
చదవండి: బెంగళూరులో దంపతుల హత్య... అనంతపురంలో నిందితుల అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment