అమ్మను వంచించాడు..బిడ్డను చెరబట్టాడు | Man Molestation On Girl In YSR Kadapa | Sakshi
Sakshi News home page

అమ్మను వంచించాడు..బిడ్డను చెరబట్టాడు

Published Mon, Jun 25 2018 11:18 AM | Last Updated on Mon, Jul 23 2018 8:51 PM

Man Molestation On Girl In YSR Kadapa - Sakshi

రాయచోటి రూరల్‌ : ఆమెకు పెళ్లయింది. భర్త.. పిల్లలు ఉన్నారు.. వీరు అద్దెకుంటున్న ఇంటి యజమానికి ఆమెపై కన్ను పడింది. మాయ మాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. భర్తకు విడాకులు ఇస్తే తాను పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానని ఆశలు రేకెత్తించాడు. అతని మాటలకు ఫిదా అయిపోయిన ఆ మహిళ తన భర్తకు విడాకులిచ్చేసింది. అన్న మాట ప్రకారం ఏడాది క్రితం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇంతలో అతనిలో దాగి ఉన్న పైశాచికత్వం బయటికొచ్చింది. ఇంటర్‌ చదువుతున్న ఆమె కూతురిపై లైంగిక దాడికి యత్నించాడు. మీ అమ్మను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ వేధించడం మొదలు పెట్టాడు. విధిలేని పరిస్థితిలో తల్లీబిడ్డలు పోలీసులను ఆశ్రయించారు.

రాయచోటి పట్టణం బీరామ్‌సాహెబ్‌ వీధిలో షఫీవుల్లా ఖాన్‌ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతని ఇంట్లో అంగన్‌వాడీ వర్కర్‌గా పనిచేస్తున్న ఎస్‌.హాజీరా తన భర్త, నలుగురు పిల్లలతో కలిసి అద్దెకుండేది. అవివాహితుడైన ఆ ఇంటి యజమాని షఫీవుల్లా ఖాన్‌ వారితో స్నేహపూర్వకంగా ఉండేవాడు. ఇలా వారి మధ్య పెరిగిన పరిచయం కాస్తా ఆమెపై మోజు పడేలా చేసింది. చివరకు ఆమె భర్తతో విడాకులు ఇప్పించి హాజీరాను గత ఏడాది ఆగస్టు 8న వివాహం చేసుకుని అతని ఇంటిలో ఉంచుకున్నాడు. కాలక్రమంలో ఆమెపై అతనికి అనుమానం మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంటర్‌ చదివే ఆమె బిడ్డపై వేధింపులు మొదలు పెట్టాడు. నాకు ఇక మీ అమ్మ అవసరం లేదు.. నిన్ను పెళ్లి చేసుకుంటానని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాడని ఆ బాధిత బాలిక కన్నీటి పర్యంతమవుతోంది. మూడు రోజుల క్రితం మా అమ్మ ఎదుటే నాపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని.. దుస్తులన్నీ చింపేసి.. శరీరంపై గాయపరిచాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చివరకు షఫీవుల్లా ఖాన్‌ వాళ్ల అమ్మ కూడా అమ్మను వదిలేసి కూతురుని పెళ్లి చేసుకొమ్మని ప్రోత్సహిస్తోందని ఆమె ఆరోపించింది. నాలుగు నెలలుగా తమకు తినడానికి తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నాడని వాపోయింది. రాయచోటి పోలీసులను ఆశ్రయించగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చివరకు శనివారం కడపలో జిల్లా ఎస్పీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు రాయచోటి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్యే శరణ్యం : బాధిత బాలిక
‘ప్రతి రోజు షపీవుల్లా ఖాన్‌ దగ్గర చిత్రహింసలు పడుతున్నాము. అమ్మను వదిలేసి నన్ను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడు. ఇటీవల నన్ను పట్టుకుని లాగాడు. దుస్తులు కూడా చిరిగిపోయి, శరీరంపైన గాయాలయ్యాయి. పోలీసులకు చెబితే పట్టించుకోలేదు. పదవ తరగతిలో బాగా చదువుకుని 9.3 జీపీఏ తెచ్చుకున్నాను. తరువాత మానసిక ఒత్తిడి , సమస్యల వల్ల ఇంటర్‌ ఫస్టియర్‌లో 3 సబ్జెక్టులు ఫెయిల్‌ అయ్యాను. మా నాన్న వల్లనే నా స్టడీస్‌ కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయి. పోలీసులు న్యాయం చేయకుంటే ఇప్పుడు చేసేది ఏమీ లేదు. ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే నాకు ఉన్న దిక్కు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement