నిందితుడిని జైలుకు తరలిస్తున్న పోలీసులు
నరసరావుపేట టౌన్: తన ప్రేమను నిరాకరించిందని యువతిని దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాదికి జీవితఖైదు, రూ.2,500 జరిమానా విధిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఒంగోలు వెంకటనాగేశ్వరరావు గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కోటా అనూష నరసరావుపేట రామిరెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదివేది. అదే కళాశాలలో చదువుతున్న బొల్లాపల్లి మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మేడం విష్ణువర్ధన్‌రెడ్డి తనను ప్రేమించాలని అనూషను వేధింపులకు గురిచేశాడు.
ఆమె నిరాకరించడంతో 2021, ఫిబ్రవరి 24న కళాశాలకు వెళుతున్న అనూషను మాట్లాడాలని విష్ణువర్ధన్‌రెడ్డి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారులోని పాలపాడు రోడ్డు గోవిందపురం మైనర్ కాలువ వద్దకు తీసుకువెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి పరారయ్యాడు. మృతురాలి తల్లి వనజాక్షి ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవడంతోపాటు రూ.10 లక్షల పరిహారం అందించింది.
ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును పల్నాడు జిల్లా దిశ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రత్యేక విచారణ అధికారిగా డీఎస్పీ రవిచంద్రను నియమించారు. హత్యపై సమగ్ర వివరాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేసి సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. దీంతో విచారణ చేసిన న్యాయమూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి జీవతఖైదు, రూ.2,500 జరిమానా విధించారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను ఎస్పీ రవిశంకర్‌రెడ్డి అ«భినందించారు. దిశ డీఎస్పీ రవిచంద్రను అనూష తల్లిదండ్రులు సన్మానించారు.
పోలీసుల సహకారంతోనే త్వరగా శిక్ష
ప్రేమించలేదన్న అక్కసుతో మా అమ్మాయిని దుండగుడు విష్ణువర్ధన్‌రెడ్డి కిరాతకంగా గొంతునులిమి హత్య చేశాడు. పోలీసుల సహకారంతో త్వరితగతిన నిందితుడికి శిక్ష పడింది. ప్రభుత్వం, పోలీసులు మా కేసు పట్ల చూపించిన శ్రద్ధ మరువలేం. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడినప్పటికీ... ఉరిశిక్ష వేసి ఉంటే బాగుండేది.
– కోటా వనజాక్షి, అనూష తల్లి
ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ
ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టాం. నిందితుడ్ని 24 గంటల్లో అరెస్ట్ చేసి 48 గంటల వ్యవధిలో ప్రాథమిక చార్జిషీట్, వారం రోజుల్లో సమగ్ర విచారణ జరిపి తుది చార్జిషీట్‌ను దాఖలు చేశాం. దిశ ద్వారా సత్వర న్యాయం అందుతుందన్న భావన ఈ కేసుతో రుజువైంది.
– రవిచంద్ర, దిశ డీఎస్పీ, నరసరావుపేట
Comments
Please login to add a commentAdd a comment