Additional District Court
-
డిగ్రీ విద్యార్థిని అనూష హత్య కేసు.. ప్రేమోన్మాదికి జీవితఖైదు
నరసరావుపేట టౌన్: తన ప్రేమను నిరాకరించిందని యువతిని దారుణంగా హత్య చేసిన ప్రేమోన్మాదికి జీవితఖైదు, రూ.2,500 జరిమానా విధిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఒంగోలు వెంకటనాగేశ్వరరావు గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కోటా అనూష నరసరావుపేట రామిరెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదివేది. అదే కళాశాలలో చదువుతున్న బొల్లాపల్లి మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మేడం విష్ణువర్ధన్‌రెడ్డి తనను ప్రేమించాలని అనూషను వేధింపులకు గురిచేశాడు. ఆమె నిరాకరించడంతో 2021, ఫిబ్రవరి 24న కళాశాలకు వెళుతున్న అనూషను మాట్లాడాలని విష్ణువర్ధన్‌రెడ్డి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారులోని పాలపాడు రోడ్డు గోవిందపురం మైనర్ కాలువ వద్దకు తీసుకువెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి పరారయ్యాడు. మృతురాలి తల్లి వనజాక్షి ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవడంతోపాటు రూ.10 లక్షల పరిహారం అందించింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును పల్నాడు జిల్లా దిశ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రత్యేక విచారణ అధికారిగా డీఎస్పీ రవిచంద్రను నియమించారు. హత్యపై సమగ్ర వివరాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేసి సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. దీంతో విచారణ చేసిన న్యాయమూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి జీవతఖైదు, రూ.2,500 జరిమానా విధించారు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను ఎస్పీ రవిశంకర్‌రెడ్డి అ«భినందించారు. దిశ డీఎస్పీ రవిచంద్రను అనూష తల్లిదండ్రులు సన్మానించారు. పోలీసుల సహకారంతోనే త్వరగా శిక్ష ప్రేమించలేదన్న అక్కసుతో మా అమ్మాయిని దుండగుడు విష్ణువర్ధన్‌రెడ్డి కిరాతకంగా గొంతునులిమి హత్య చేశాడు. పోలీసుల సహకారంతో త్వరితగతిన నిందితుడికి శిక్ష పడింది. ప్రభుత్వం, పోలీసులు మా కేసు పట్ల చూపించిన శ్రద్ధ మరువలేం. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడినప్పటికీ... ఉరిశిక్ష వేసి ఉంటే బాగుండేది. – కోటా వనజాక్షి, అనూష తల్లి ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టాం. నిందితుడ్ని 24 గంటల్లో అరెస్ట్ చేసి 48 గంటల వ్యవధిలో ప్రాథమిక చార్జిషీట్, వారం రోజుల్లో సమగ్ర విచారణ జరిపి తుది చార్జిషీట్‌ను దాఖలు చేశాం. దిశ ద్వారా సత్వర న్యాయం అందుతుందన్న భావన ఈ కేసుతో రుజువైంది. – రవిచంద్ర, దిశ డీఎస్పీ, నరసరావుపేట -
లైంగికదాడి కేసులో ఇద్దరికి 20 ఏళ్లు జైలు
కర్నూలు (లీగల్): యువతిపై లైంగిక దాడి కేసులో ఇద్దరికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తూ ఏడవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం... కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామచంద్రానగర్‌కు చెందిన ఒక యువతి (23) తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో సోదరి సహాయంతో 2016, డిసెంబర్లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఆమె తిరిగి ఇంటికి వెళ్లగా, మానసిక స్థితి సరిగా లేని తన తండ్రి కనిపించలేదు. దీంతో తమ కుటుంబానికి పరిచయస్తుడైన ఎల్లన్న(30) వద్దకు వెళ్లి తన తండ్రి గురించి అడిగింది. ‘మీ తండ్రి డోన్ రోడ్డు వైపు వెళ్లాడు. తీసుకువద్దాం పదా..’ అని ఆ యువతిని ఎల్లన్న తన బైక్‌పై ఎక్కించుకుని దూరంగా ముళ్లపొదల వైపు తీసుకువెళ్లి ఆపాడు. అక్కడకు శివకళాధర్(32) అనే వ్యక్తి వచ్చి తాను పోలీసునని బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎల్లన్న కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసు విచారణలో యువతిపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైంది. దీంతో ఎల్లన్న, శివకళాధర్‌కు 20 ఏళ్లు కఠిన కారాగారశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జి.భూపాల్‌రెడ్డి తీర్పు చెప్పారు. జరిమానా మొత్తాన్ని ఫిర్యాదికి ఇవ్వాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. -
డీఎస్పీ, సీఐలపై చర్యలకు ఆదేశం
చార్జిషీటు చదవకుండా కోర్టుకు పంపించారని అదనపు జిల్లా జడ్జి వ్యాఖ్య నరసాపురం(రాయపేట) : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ, సీఐలపై తగు చర్యలు తీసుకోవాలని అదనపు జిల్లా న్యాయస్థానం పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి.కల్యాణరావు సోమవారం తీర్పు చెప్పారు. గతంలో పాల కొల్లు సీఐ, ప్రస్తుతం విజయవాడ డీటీఎస్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జె.సీతారామస్వామి, అప్పటి ఎస్సై, ప్రస్తుతం పాలకొల్లు రూరల్ సీఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌పై తగు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నరసాపురం డీఎస్పీ కార్యాలయ పరిధిలోని మొగల్తూరు పోలీసు స్టేషన్లో క్రైమ్ నంబరు 129/2009 కేసుకు సంబంధించి సెక్షన్ 302, 201 ఐపీసీ ప్రకారం జూలై 8, 2009లో కేసు నమోదు చేశారు. అప్పటి పాలకొల్లు సీఐ సీతారామస్వామి విచారణ అధికారిగా పని చేశారు. కేసు విషయంలో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పరిశోధన చాలా సాధారణంగా ఉందని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని కొత్త సవరణలను పాటించకుండా, ఒక లేఖరి యాంత్రికంగా తయారు చేసిన చార్జిషీటును న్యాయపరంగా సరిపోయిందా లేదా అని చూడ కుండా.. కనీసం చదవకుండా కోర్టుకు దాఖలు చేయడం విధినిర్వహణలో అలసత్వంగా భావిస్తున్నట్లు తీర్పులో అదనపు జిల్లా సెషన్స్ జడ్డి పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతులను సద్వినియోగం చేసుకోకుండా, సమన్లు అందుకున్న అధికారులు సకాలంలో న్యాయస్థానానికి హాజరు కాకపోవడంతో అధికారులపై దురహంకారం, అమర్యాద, ఉల్లంఘన, విధి నిర్వహణలో లోపాలు, సత్వర విచారణ జరపటంలో ఆటంకపర్చి న్యాయస్థానానికి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు, నిందితుని తరపు న్యాయవాదికి ఇబ్బందులు కలగజేశారని పేర్కొ న్నారు. కేసు విచారణ త్వరితగతిన ముగించేం దుకు, నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించేందుకు, న్యాయస్థానం ఆదేశాల మేరకు సాక్షులను ఆయా తేదీల్లో ప్రవేశపెట్టేందుకు సీఐ ఆసక్తి చూపలేదన్నారు. దీనివల్ల న్యాయస్థానానికి, న్యాయవాదులకు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఇబ్బం దికర పరిస్థితులు కలిగాయని పేర్కొన్నారు. సీఐ అహంకారం, న్యాయస్థానం ఆదేశాల ఉల్లంఘన, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా భావించి తగు చర్యలకు ఆదేశించినట్టు తీర్పులో వెల్లడించారు. హత్య, మానభంగం, దొంగనోట్లు తదితర నేరాల పరిశోధనలో నాణ్యమైన ప్రమాణాలను పాటించాలని, లేనిపక్షంలో నేర పరిశోధన వ్యవస్థ అంతిమ తీర్పు ఇవ్వడంలో విఫలమవుతుందన్నారు.