
అల్లిపురం (విశాఖ దక్షిణ): ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించడమే కాకుండా తాను కూడా ఆత్మహుతికి పాల్పడ్డాడు ఓ యువకుడు. విశాఖలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నగరంలో కరాస ప్రాంతానికి చెందిన వల్లభదాసు ప్రత్యూష (20), వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన పలకల హర్షవర్ధన్ (21) పంజాబ్‌లోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. ప్రత్యూషను ప్రేమిస్తున్నానంటూ ఆమెను కొద్దికాలంగా హర్షవర్ధన్ వేధిస్తున్నాడు. కానీ, అతని ప్రేమను ప్రత్యూష నిరాకరించింది. దీంతో శనివారం ప్రత్యూషతో మాట్లాడదామని చెప్పి నగరంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ.. తనను ప్రేమించాలని అడగటంతో ఆమె నిరాకరించింది. దీంతో హర్షవర్ధన్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను లాడ్జి రూమ్‌లోనే ప్రత్యూషపై పోసి నిప్పంటించాడు.
అనంతరం తనపై పోసుకుని అక్కడే నిప్పంటించుకున్నాడు. గది నుంచి అరుపులు రావటంతో హోటల్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న ఇద్దరినీ హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. టూటౌన్ సీఐ కే వెంకట్రావు, ఎస్‌ఐ మన్మథరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరి శరీరాలు 60 శాతం మేర కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఇన్‌చార్జి హార్బర్ ఏసీపీ శిరీష సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి మేజిస్ట్రేట్ వాంగ్మూలం రికార్డు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వెంకటరావు తెలిపారు.