ప్రేమోన్మాది చేతిలో విద్యార్థిని బలి | Student killed in the name of Love | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది చేతిలో విద్యార్థిని బలి

Published Wed, Aug 8 2018 3:25 AM | Last Updated on Wed, Aug 8 2018 8:47 AM

Student killed in the name of Love - Sakshi

అనూష (ఫైల్‌) , ప్రేమోన్మాది వెంకటేశ్‌

హైదరాబాద్‌: ఇద్దరూ పదవ తరగతి చదువుతూ ఒకే దగ్గర ట్యూషన్‌కు వెళ్లారు. అక్కడ ఏర్పడ్డ చనువు ప్రేమగా మారింది. రెండేళ్లు ఇద్దరి మధ్య సాగిన ప్రేమ వ్యవహారం మనస్పర్థలు రావడంతో దూరమయ్యారు. తన ప్రేమను నిరాకరిస్తుందని కసి పెంచుకున్న ఆ ప్రేమోన్మాది మాట్లాడదామని పిలిచి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు.ఈ హృదయ విదారక సంఘటన ఓయూ పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బౌద్ధనగర్‌ డివిజన్‌ పరిధిలోని అంబర్‌నగర్‌లో బీఎస్‌ఎన్‌ ఉద్యోగి హరిప్రసాద్‌ తన భార్య రేవతి, కుమార్తెలు అనూష (16), గ్రీష్మలతో కలిసి నివాసముంటున్నాడు. కాగా హరిప్రసాద్‌కు ఇటీవలే విజయవాడకు బదిలీ అవడంతో, కుటుంబాన్ని ఇక్కడే ఉంచి తను మాత్రం విజయవాడ వెళ్లివస్తున్నాడు.

హరిప్రసాద్‌ పెద్ద కూతురు అనూష నారాయణగూడలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. కాగా ఇదే ప్రాంతంలో నివాసముండే ఆరెపల్లి రవీందర్‌ కుమారుడు ఆరెపల్లి వెంకటేశ్‌ (19) సైతం హిమాయత్‌నగర్‌లోని న్యూచైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. పక్కపక్క వీధుల్లో నివాసముండే వెంకటేష్, అనూషలు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వెంకటేశ్‌ ప్రవర్తనతో విసుగుచెందిన అనూష గత ఆర్నెళ్లుగా అతనితో దూరంగా ఉంటోంది. తనను వదిలేయాలని కోరడమే కాకుండా అతని ప్రేమను నిరాకరిస్తూ వస్తోంది. దీంతో వెంకటేశ్‌ అనూషపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకుని మంగళవారం రాత్రి మాట్లాడాల్సి ఉందని చెప్పి ఓయూ దూర విద్యా కేంద్రం సమీపంలోని క్వార్టర్ల వద్దకు పిలిచాడు. అతని మాటలు నమ్మిన అనూష అక్కడకు వెళ్లింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో వెంకటేశ్‌ ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. అనూష పెద్దగా అరుస్తూ కుప్పకూలిపోయింది.  

చితకబాదిన స్థానికులు 
అనూష అరుపులు విన్న ఇమ్రాన్, ఇజాజ్‌అనే ఇద్దరు యువకులు అక్కడికి వెళ్లి చూడగా, అప్పటికే అనూష రక్తం మడుగులో కొట్టుకుంటోంది. ఘటన స్థలంలో ఉన్న వెంకటేశ్‌ వీరిని చూసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని వెంకటేశ్‌ను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని, అనూషను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే ఆమె మృతి చెందింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement