సాక్షి, తిరుపతి : ఎర్రచందనం వేలం వెనుక కుట్ర ఉందని సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎర్రచందనం ఆదాయం ద్వారా రుణమాఫీ చేస్తామని చెప్పి ..అడవుల్లో ఉన్న పచ్చదనన్నాంత మాఫీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు ఎర్రచందనం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో ఒక్కరూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. 35 లక్షల ఎకరాల్లో విస్తారంగా ఉన్న ఎర్రచందనాన్ని పచ్చదండు తన్నుకుపోతోందని ధ్వజమెత్తారు.
ఎర్రచందనం వేలం ద్వారా వచ్చిన ఆదాయం ఏమైందని భూమన ప్రశ్నించారు. పతంజలి సంస్థకు A గ్రేడు అమ్మి C గ్రేడుగా మార్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని మండిపడ్డారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు పతంజలి సంస్థకు సరఫరా చేస్తున్న సీ గ్రేడ్ ఎర్రచందనాన్ని పట్టుకుంటే అది ఏ గ్రేడ్‌గా తేలిందన్నారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోందని, ఏపీ పరువు చంద్రబాబు బంగాళాఖాతంలో కలిపారని మండిపడ్డారు. చంద్రబాబు తన అనుచరులను అడవిలోకి పంపి దోపిడీ దొంగలకంటే దారుణంగా ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు అండదండలతో టీడీపీ నేతలు బరి తెగించారన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టామని చెప్పడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా వచ్చే వందల కొట్లతో వచ్చే ఎన్ని కల్లో చంద్రబాబు గెలవాలని చూస్తున్నారని భూమన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment