బతుకు పడవకు బొరియలు! | Burrowing practice houseboat! | Sakshi
Sakshi News home page

బతుకు పడవకు బొరియలు!

Published Fri, Dec 20 2013 4:17 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Burrowing practice houseboat!

ముత్తుకూరు, న్యూస్‌లైన్: రైతులు, వ్యవసాయ కూలీల బతుకుతెరువుకు ఏరు దాటించే పడవ ఒకటి బొరియలు పడి, పూర్తిగా శిథిలమైపోయింది. ఈ పడవలో ఏటిపై ప్రయాణం దినదినగండంగా మారింది. దొరువులపాళెం, వెంకన్నపాళెం రైతులకు కండలేరుక్రీక్‌కు ద క్షిణాన చిల్లకూరు మండలంలో 350 ఎకరాల పొలాలు ఉన్నాయి.
 
 ఈ పొలాలు సాగు చేయాలంటే రైతులు, వ్యవసాయ కూలీలు పడవ ద్వారా దళితవాడ వద్ద కారాక రేవు నుంచి ఏరు దాటాలి. అంతకుముందు ఉన్న తెప్ప ఏట్లో కొట్టుకుపోవడంతో స్థానికులు తీవ్ర అందోళనకు గురయ్యారు. ఫలితంగా స్థానిక నాయకుడు దువ్వూరు విశ్వమోహన్‌రెడ్డి చొరవతో 10 ఏళ్ల క్రితం మత్స్యశాఖ ద్వారా ఒక ఫైబర్‌బోటు పంపిణీ చేయించారు. ఇంజన్ లేని ఈ పడవను నడిపేందుకు రైతులు పట్టపుపాళెంనకు చెందిన వావిళ్ల అంజయ్యను నియమించుకున్నారు. ఏటిలో ఈ కొస నుంచి ఆ చివరకు మధ్యలో కొయ్యలు నాటి, దీనికి క ట్టిన బలమైన తాడు ఆధారంగా అంజయ్య అటు ఇటూ పడవ నడుపుతున్నాడు. అయితే, ఈ పడవ కొద్ది సంవత్సరాల క్రితం శిథిలమైపోయింది. అడుగు భాగంగా చిల్లులు పడి, పడవలోకి నీరు చేరడంతో రైతులంతా కలిసి ప్లాస్టిక్ గోతాలతో బొరియలు పూడ్చారు. అప్పటి నుంచి స్థానిక నాయకులు కొత్త పడవ కోసం పలుమార్లు మత్స్యశాఖ అధికారులను కలిశారు. అయినా కొత్త పడవ మంజూరుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
 
 ముఖ్యంగా పోటు సమయంలో ఉధృతంగా ప్రవహించే ఉప్పుటేరులో ఈ పడవ ఎక్కే వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని తిట్టుకొంటూ కాలం నెట్టుకొస్తున్నారు.
 
 పడవ లేకుంటే వ్యవసాయం లేదు:
 కండలేరు క్రీక్‌ను దాటించే ఈ ఫైబర్‌బోటు లేకుంటే ఈ ప్రాంతంలో వ్యవసాయం ఉండదనే చెప్పాలి.  రైతులు, కూలీలే కాకుండా మేకలు, గొర్రెలు, కూలీలకు భోజనాలు తీసుకెళ్లే పనివాళ్లు, పురుగు మందులు, ఎరువులు సమస్తం ఈ పడవ ద్వారా నిత్యం ఆవలి గట్టు పొలాలకు తరలిస్తున్నారు. వ్యవసాయ సీజన్‌లో అయితే రోజుకు 100 సార్లు పడవ అటూఇటూ తిరగాల్సిందే. పడవ నడిపినందుకు ఏటా ఎకరాకు ఐదు ముంతల ధాన్యం రైతులు అంజయ్యకు జీతం ఇస్తున్నారు. వయోభారం కుంగదీస్తున్నా పడవను నమ్ముకొని అంజయ్య బతుకు నావను లాక్కొస్తున్నాడు.
 
 పడవ లేకుంటే పనులే లేవు
 పూర్తిగా శిథిలమైపోయినప్పటికీ ఈ పడవ లేకుంటే మాకు పనులే ఉండవు. ఉప్పుటేరుపై వంతెన నిర్మిస్తే ప్రమాదకరమైన పడవ ప్రయాణం తప్పుతుంది. లేకుంటే అధికారులు కొత్త ఇంజన్ పడవ మంజూరు చేయాలి.
 - సొక్కా సుబ్బరామయ్య, స్థానికుడు
 
 ఏటా మూడు పుట్ల ధాన్యం వస్తుంది  
 పడవ నడపడం ద్వారా రైతుల నుంచి ఏటా మాకు మూడు పుట్ల ధాన్యం గిట్టుబాటు అవుతుంది. అయితే, దెబ్బతిన్న పడవలో ప్రయాణం చేయాలంటే భయపడిపోతున్నారు. తాడుతో పడవ లాగడం చాలా కష్టంగా ఉంది.
 - వావిల అంజయ్య, పడవ సరంగు
 
 కొత్త పడవ కోసం ప్రతిపాదనలు
 జిల్లాలో ఇటువంటి ఐదు పడవలు శిథిలమైపోయాయి. వీటిని బాగు చేయాలంటే రూ 4.50 లక్షలు కావాలని ఉన్నతాధికారులను కోరాము. కండలేరుక్రీక్ దాటేం దుకు ఇంజన్ ఉన్న కొత్త పడవ కోసం గతంలో ప్రతిపాదించాం.
 - ప్రసాద్, ఎఫ్‌డీఓ, మత్స్యశాఖ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement