రక్తమోడిన రహదారులు
{బాండెక్స్ బస్సు, ఆటో ఢీ
28 మందికి తీవ్ర గాయాలు
చిన్నారి పరిస్థితి విషమం
కె.కోటపాడు : బత్తివానిపాలెం కూడలిలోని ప్రమాదకర మలుపు వద్ద సోమవారం ఉదయం 4గంటల సమయంలో బ్రాం డెక్స్ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో బ్రాండెక్స్ బస్సులో ప్రయాణిస్తున్న 24 మం ది మహిళా ఉద్యోగులు, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గా యాలయ్యాయి. దాలివలస, కింతా డ, కె.కోటపాడు గ్రామాల నుంచి అచ్యుతాపురంలోని బ్రాండెక్స్ కంపెనీలో ఉదయం ఆరు గంటల డ్యూటీకి తెల్లవారుజామున 4గంటలకు 31 మంది మహిళా ఉద్యోగులు కంపెనీ బస్సులో బయలుదేరారు. బత్తివానిపాలెం కూడలి సమీపంలో మలుపు వద్ద రోడ్డు పక్కన ఉన్న బైక్‌ను తప్పించేక్రమంలో బస్సును డ్రైవర్ పక్కకు మళ్లించాడు. ఇంతలో గొండుపాలెం నుంచి కె.కోటపాడు వైపునకు ఎదురుగా వస్తున్న ఆటోను బస్సు డ్రైవర్ గుర్తించి అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు ఒక్కసారిగా బోల్తాకొట్టి సమీపంలోని తాటిచెట్లను ఢీకొంది.
బోల్తాకొట్టిన బస్సును ఆటో బలంగా ఢీకొనడంతో ఆటోడ్రైవర్ మడకనాయుడు, ఆటోలో ప్రయాణిస్తున్న జె.రామదాసు, జె.సత్యవతి దంపతులతోపాటు వారి రెండేళ్ల చిన్నారి వైష్ణవికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వైష్ణవి కోమాలోకి వెళ్లిపోయింది. ఆటో డ్రైవర్ నాయుడుకు రెండు కాళ్లూ విరగడంతోపాటు తలకు తీవ్ర గాయమయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్ మజ్జి రాముతో పాటు చుక్క పార్వతి, వాసిరెడ్డి రమణమ్మ, ఈర్లె వరలక్ష్మి, ఒబ్బిలిశెట్టి నాగమణి, ఇమంది కృష్ణవేణి, కొత్తుర్తి కనకమహాలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఈర్లె దేవి, బోకం జ్యోతి, దమ్ము ముత్యాలమ్మ, భూమిరెడ్డి వరలక్ష్మి, వి.మౌనిక, ఆదిరెడ్డి లక్ష్మి, పెదగాడి దేవి, పి.నాగమణి, కిర్లంపల్లి నాగమణి, బి.రాధ, కన్నూరు దేవి, వి.వెంకటలక్ష్మి, కె.అప్పలనర్స, శ్రీశైలపు దేవి, చీపురుపల్లి గౌరిలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానిక 30 పడకల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న క్షతగాత్రుల బంధువులు ఆస్పత్రికి చేరుకుని రోదిస్తున్నారు. బస్సు డ్రైవర్ మజ్జి రాము మద్యం సేవించి ఉండడం వల్లే ప్రమాదం సంభవించిందని మహిళలు ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ మహిళలను బ్రాండెక్స్ యాజమాన్యం మెరుగైన వైద్యం అందించేందుకు గాజువాక తరలించారు. ప్రమాద ఘటనపై కె.కోటపాడు ఎస్‌ఐ తాళ్లపూడి శ్రీను కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
క్షతగాత్రులకు ఎమ్మెల్యే బూడి ఓదార్పు
ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు హుటాహుటిన తెల్లవారి ఆరు గంటలకు స్థానిక 30 పడకల ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను ఓదార్చారు. ఆటోలో ప్రయాణిస్తూ గాయపడిన వారిని విశాఖపట్నంకు 108లో తరలించేందుకు చర్యలు చేపట్టారు. విధులకు వెళ్తూ మహిళలు గాయపడడం విచారకరమని ఆయన అన్నారు. క్షతగాత్రులను కె.కోటపాడు మాజీ సర్పంచ్ రెడ్డి జగన్‌మోహన్, శ్రీకాంత్ శ్రీను, బోకం సత్యనారాయణ పరామర్శించారు.