తిరుమలకు బస్సు సర్వీసుల పునరుద్ధరణ
సాక్షి, తిరుమల: తిరుమల, తిరుపతి మధ్య ఆర్టీసీ బస్సులు బుధవారం వేకువజాము నుంచి యథావిధిగా రాకపోకలు సాగిస్తున్నప్పటికీ భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో రాలేదు. సమైక్య ఉద్యమంలో భాగంగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో తిరుమల, తిరుపతి మధ్య 24 గంటలపాటు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. తిరుమలేశుని దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడ్డారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించి బస్సులను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీటీడీ అధికారులు ఆర్టీసీ అధికారులు,యూనియన్ నేతలతో చర్చలు జరపడంతో వారు బస్సులు నడిపేందుకు అంగీకరించారు. బుధవారం వేకువజామున 3 గంటల నుంచి తిరుమల డిపోకు చెందిన మొత్తం 106 బస్సు సర్వీసులు తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించాయి. సమ్మెతో ఇళ్లకు వెళ్లిన ఆర్టీసీ డ్రైవర్లను వేకువజామున టీటీడీ వాహనాల్లో తిరుమలకు రప్పించారు. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 106 బస్సులు కేవలం 250 ట్రిప్పులు తిరిగాయి. దీంతో సుమారు 15 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో తిరుమల, తిరుపతి మధ్య ప్రయాణించినట్టు డీఎం లక్ష్మీ నరసింహారెడ్డి తెలిపారు.
మూడు గంటల్లోనే తిరుమలేశుని దర్శనం: సీమాంధ్ర బంద్ ప్రభావం కారణంగా మూడు గంటల్లోనే తిరుమలేశుని దర్శనం లభిస్తోంది. బుధవారం తిరుమలలో భక్తులు గణనీయంగా తగ్గిపోయారు. బుధవారం వేకువజాము నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామివారిని 20 వేల మంది మాత్రమే దర్శించుకున్నారు. సర్వదర్శనం కోసం మొత్తం 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా, వారికి మూడుగంటల్లోనే దర్శనం లభిస్తోంది. గంటలోపే రూ.300 ప్రత్యేక దర్శనం, రెండు గంటల్లోపే కాలిబాట భక్తులకు దర్శనం లభిస్తోంది. కాగా, తిరుమలలో బుధవారం భారీ వర్షం కురిసింది. గంటసేపు వర్షం కురవడంతో ఆలయ ప్రాంతం జలమయమైంది. మధ్యాహ్నం తర్వాత ఆలయ ప్రాంతమంతా పొగమంచు కమ్ముకుంది. స్వర్ణకాంతులీనే ఆనంద నిలయాన్ని తెల్లటి మబ్బులు తాకుతూ వెళుతున్న దృశ్యాలను చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు.