సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఏపీకి చెందిన వారిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ పోటీపడుతున్నాయి. తెలంగాణలో సెటిలైన చాలా మందికి ఏపీలోని సొంతూళ్లలోనూ ఓట్లున్నాయి. దీంతో వీరికి ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. వీళ్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నెల 11న పోలింగ్ ఉండటంతోపాటు శుక్రవారం సెలవు పెట్టుకుంటే, శని, ఆది సెలవు దినాలు కలసి వస్తున్నాయి. దీంతో సెటిలర్లను సొంతూళ్లకు రప్పించేందుకు ఏపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ప్రాంత ఓటర్లు అధికంగా ఉండే చోట సామాజిక వర్గాలు, ఊళ్ల వారీగా వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపుతున్నారు. ఏప్రిల్ 9 నుంచే ఉచితంగా తీసుకెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. ఓటేశాక తిరిగి తీసుకొచ్చే బాధ్యత కూడా వీరిదే. దారిలో టిఫిన్లు, భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మందుబాబులకు ప్రత్యేక సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఓటుకు రూ.3000 వరకు చేతిలో పెడుతున్నారు.
ఓటరుకు ప్రయాణ చార్జీల పోటు
సాక్షి, అమరావతి/సాక్షి, బెంగళూరు: ఓటు హక్కు వినియోగించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి సొంత ఊర్లకు రానున్న ఓటర్లకు ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణ చార్జీల మోత మోగిస్తున్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఉన్న తెలుగువారు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో సొంత రాష్ట్రానికి బయలు దేరుతున్నారు. చెన్నై, బెంగళూరుల నుంచి బస్సుల్ని బుక్ చేసుకుందామంటే టిక్కెట్టు ధర రూ.3 వేలకు పైగా ఉంది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు టిక్కెట్టు ధర సాధారణ రోజుల్లో రూ.500 నుంచి రూ.600 వరకు ఉంటే, ప్రస్తుతం ఈ ధర రూ.1,500 వరకు ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ 7 వేల ప్రత్యేక బస్సుల్ని నడుపుతోంది. హైదరాబాద్ నుంచి 250 బస్సుల్ని ప్రత్యేకంగా నడుపుతున్నారు. అయితే పండగ సీజన్‌లో మాదిరిగా 150 శాతం అధికంగా చార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణీకులు మండిపడుతున్నారు. ఇక బెంగళూరులో ఉన్న తెలుగువారు, విద్యార్థులు, ఐటీ, ప్రైవేటు ఉద్యోగులు ఓటు వేసేందుకు ఏపీకి తరలివస్తున్నారు. రద్దీ వల్ల రైళ్లలో, బస్సుల్లోనూ వారం ముందే సీట్లన్నీ బుక్ అయిపోయాయి. ప్రజల డిమాండ్‌ను ఆసరాగా తీసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలను భారీగా పెంచేశాయి.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment