హిందూపురం (అనంతపురం) : అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన ఓ వ్యాపారి బెంగళూరు నగరంలోని ఒక లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. హిందూపురంకు చెందిన విశ్వనాథ్(60) అనే వ్యక్తి స్థానికంగా మొక్కజొన్నల వ్యాపారం చేస్తుంటారు. కాగా రెండు రోజుల క్రితం ఆయన ఇంటి నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వద్ద రూ.10 లక్షల నగదు ఉందని సమాచారం. అయితే బెంగళూరు చిక్కపేటలోని సూర్య లాడ్జిలో బస చేసిన ఆయన మంగళవారం ఉదయం నుంచి బయటకు రాకపోయేసరికి సిబ్బంది తలుపులు బద్దలు కొట్టారు. ఆయన మంచంపై విగతజీవిగా పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించారు. విశ్వనాథ్ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.