
పక్కాగా బయోమెట్రిక్!
జిల్లాలో పింఛన్ల పంపిణీకి పక్కాగా బయోమెట్రిక్ అమలు చేయూలని ప్రభుత్వం భావిస్తుంది.
జిల్లాలో పింఛన్ల పంపిణీకి పక్కాగా బయోమెట్రిక్ అమలు చేయూలని ప్రభుత్వం భావిస్తుంది. దీని వల్ల పింఛన్ల మిగులు సొమ్ము ప్రభుత్వ ఖాతాలో జమవుతుంది. జిల్లాలో ప్రస్తుతం వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, గీత కార్మికులు అన్నీ కలిపి 2,70,805 పింఛన్లు అందజేస్తున్నారు. వీరి కోసం నెలకు రూ.29.66 కోట్లు మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం 79 శాతం బయోమెట్రిక్ పద్ధతిపై అందజేస్తుండగా, 21 శాతం పింఛన్లను గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవోలు, ఇతర పంపిణీ అధికారులు స్వీయ ధృవీకరణపై అందజేస్తున్నారు. స్వీయ ధృవీకరణను పూర్తిగా నిలిపేసి బయోమెట్రిక్ అమలు చేయూలని భావిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో బయోమెట్రిక్ అమలు మెరుగ్గానే ఉన్నా.. మరికొన్ని ప్రాంతాల్లో మెరుగ్గా లేదు.
గత రెండు నెలలు పరిశీలిస్తే జిల్లాలో బయోమెట్రిక్ పనిచేయక పోవటం వల్ల డిసెంబర్‌లో 44,390 మందికి, జనవరిలో 55,093 మందికి స్వీయ ధృవీకరణతో అందజేశారు. ముఖ్యంగా బయోమెట్రిక్‌లో వేలి ముద్రలు పడక పోవటం, ఆధార్ అనుసంధానం లోపం, సర్వర్లు పని చేయక పోవటం, ఇంటర్నెట్ సమస్య, బయోమెట్రిక్‌లో ఆధార్ నంబర్ తప్పిపోవటం, మరో పక్క పలాస ప్రాంతంలో జీడి పరిశ్రమల్లో పని చేసే వారి వేలిముద్రలు పక్కాగా పడక పోవటం వంటి అనేక సమస్యలు వల్ల పింఛన్లు పంపిణీలో జాప్యం అవుతుంది. అయితే అధికారులు పాస్‌వర్డ్, లాగెన్ ఐడీ తెలిస్తే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు సైతం స్వీయ ధృవీకరణతో పింఛన్లు సొమ్ము స్వాహా చేయవచ్చున్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. సిబ్బంది కొరత... పింఛన్లు 1 నుంచి 10వ తేదీలోపు అందజేయాలి. అయితే ఒకటి నాటికి పింఛన్లు సొమ్ము బ్యాంకుల్లో జమ కావటం లేదు. కొన్నిసార్లు నాలుగో తేదీ సైతం అవుతుంది. మరో పక్క పింఛన్లు పంపిణీ సిబ్బంది కొరత సైతం వెంటాడుతుంది. జిల్లాలో 1097 పంచాయతీలు ఉన్నాయి. 515 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు.
ఆరు మున్సిపాలిటీల్లో 147 వార్డులు ఉండగా, 92 మంది మాత్రమే పింఛన్ పంపిణీ అధికారులు ఉన్నారు. ఈ నేపధ్యంలో ప్రత్యామ్నాయంగా వీఆర్వోలకు పింఛన్‌లు పంపిణీ బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి నెలా 10లోపు పింఛన్లు మంజూరు పూర్తి, మిగులు డబ్బులు అకౌంట్‌లో జమ చేయటం, రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థకు 15లోపు వివరాలు అందజేసే చర్యలు పక్కాగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బయోమెట్రిక్ పక్కాగా అమలు సాధ్యం అవుతుందో? లేదో? వేచి చూడాల్సిందే!