
మోసకారి బ్యాంక్‌మిత్ర అరెస్టు
- పెరుగుతున్న బాధిత గ్రూపులు
- రూ.10నుంచి 12 లక్షలు స్వాహా
నూజివీడు రూరల్ : డ్వాక్రా మహిళల సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా స్వాహా చేసిన బ్యాంక్‌మిత్రను రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ ఎస్.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పల్లెర్లమూడి పంచాయతీ శివారు రాట్నాలగూడెంకు చెందిన పోలుకొండ ఇందిరా అలియాస్ షేక్ మస్తాన్‌బీ ఐదేళ్లుగా పల్లెర్లమూడి సిండికేట్ బ్యాంక్‌లో బ్యాంక్‌మిత్రగా పనిచేస్తుంది.
గ్రామంలోని 10 డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు తీసుకున్న రుణాల సొమ్మును బ్యాంక్‌లో జమ చేసేందుకు 2012 నుంచి డబ్బు వసూలు చేస్తుంది. అయితే డ్వాక్రా మహిళల నుంచి తీసుకున్న నగదును పూర్తిగా బ్యాంకులో జమచేయకుండా తన సొంత అవసరాలకు వాడుకుంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఇందిరమ్మ స్వయం సహాయక సంఘం సభ్యులు తమ అవసరాల నిమిత్తం తమ సంఘం లావాదేవీలను తెలపాలని 13వతేదీన బ్యాంకు అధికారులను కోరారు.
దీంతో బ్యాంకు సిబ్బంది వారి లావాదేవీలను పరిశీలించి రూ.3.50లక్షలు రుణం చెల్లించాల్సి ఉందని తెలుపుతూ బ్యాంకు స్టేట్‌మెంట్లను అందించారు. దీంతో ఖంగుతిన్న సంఘం సభ్యులు తమ చెల్లింపు వివరాలను పరిశీలించుకున్నారు. 2012 జనవరిలో రూ.3.30 లక్షల రుణాన్ని పొంది నెలకు రూ.12,600 చొప్పున 23నెలలకుగానూ రూ.2,89,800 చెల్లించగా బ్యాంకు ఖాతాలో మాత్రం ఆ మొత్తం జమ కాలేదని సంఘం అధ్యక్షురాలు నత్తా అన్నామణి, సభ్యులు గుర్తించారు.
బ్యాంకుమిత్ర తమను మోసం చేసిందని గమనించిన సంఘం సభ్యులు 16వతేదీన రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారులిచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం రూ. 1.85 లక్షలు బ్యాంక్‌మిత్ర కాజేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేసిన రూరల్ ఎస్‌ఐ శుక్రవారం ఆమెను అరెస్టు చేశారు. ఇందిరమ్మ స్వయం సహాయక సంఘంతో పాటు మరికొన్ని గ్రూపుల సభ్యులు సైతం ఫిర్యాదు చేశారని, అయితే విచారణ చేయాల్సి ఉందన్నారు.
తీసుకున్న రుణంలో కొంతసొమ్ము మాఫీ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఏడాది జనవరి నుంచి డ్వాక్రా మహిళలు రుణాన్ని చెల్లించకపోయినప్పటికీ వాటితో కలిపి ఫిర్యాదు చేస్తున్నారని తమ విచారణలో గుర్తించామని చెప్పారు. గ్రామంలోని మిగిలిన సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకుమిత్ర సుమారు రూ.10 నుంచి 12లక్షల వరకు స్వాహాచేసి ఉండవచ్చని భావిస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.