వోల్వో బస్సు లోపాల పుట్ట | C.I.D T. krishna prasad announced volvo bus accident victim responsibility, are ignored | Sakshi
Sakshi News home page

వోల్వో బస్సు లోపాల పుట్ట

Published Thu, Feb 27 2014 2:46 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

వోల్వో బస్సు లోపాల పుట్ట - Sakshi

వోల్వో బస్సు లోపాల పుట్ట

సాక్షి, హైదరాబాద్/వనపర్తి: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద గత ఏడాది 45 మంది ప్రయాణికులను బలితీసుకున్న ఘోర బస్సు ప్రమాదానికి అనేక విభాగాల బాధ్యత, నిర్లక్ష్యం ఉన్నాయని సీఐడీ చీఫ్ టి.కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఈ బస్సు వాస్తవంగా ప్రముఖ ట్రావెల్స్ కంపెనీ అధినేత జె.సి.ప్రభాకరరెడ్డి సతీమణి జె.సి.ఉమారెడ్డి పేరుతో రిజిస్టరయి ఉన్నట్లు దర్యాప్తులో బయటపడిందని.. దీంతో ఆమెను బుధవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రభాకరరెడ్డి మాజీ మంత్రి జె.సి.దివాకర్‌రెడ్డి సోదరుడనే విషయం తెలిసిందే. ఉమారెడ్డిని సీఐడీ పోలీసులు బుధవారం మధ్యాహ్నమే రహస్యంగా వనపర్తి కోర్టులో హాజరుపరిచారు. కేసులో ఉమారెడ్డి ఏ9 ముద్దాయిగా ఉన్నారు. కేసును విచారించిన వనపర్తి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ మిలింద్‌కాంబ్లీ ఆమెను మొదట రిమాండ్‌కు ఆదేశించారు.
 
 అయితే ఆమెకు బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో ఆమె తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయడంతో బెయిల్ మంజూరు చేశారు. తిరిగి మార్చి 4న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. మరోవైపు.. తాము చేపట్టిన సాంకేతిక దర్యాప్తులో వోల్వో బస్సు డిజైన్‌లోనే లోపాలు ఉన్నట్లు తేలిందని, ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా వోల్వో సర్వీసుల్ని రద్దు చేయాలని సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక పంపుతామని సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు దాదాపు పూర్తయిందని, ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశామని, త్వరలో న్యాయస్థానంలో దాఖలు చేయనున్న చార్జ్‌షీట్‌లో మరికొందరు నిందితుల పేర్లు చేరుస్తామని చెప్పారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు గత ఏడాది అక్టోబర్ 30 తెల్లవారుజామున పాలెం వద్ద కల్వర్టును ఢీ కొని అగ్ని ప్రమాదానికి లోనైంది. ఈ ఉదంతంలో 45 మంది ప్రయాణికులు సజీవ దహనమైన విషయం విదితమే. ఈ కేసును దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు బస్సు డిజైన్‌లోనూ ఎన్నో లోపాలు, ప్రమాద హేతువులు ఉన్నట్లు గుర్తించారు.
 
 ఇటు బస్సులో.. అటు రోడ్డులో ఉల్లంఘనలు...
 బస్సు డ్రైవర్ సీటు కింద భూమి నుంచి కేవలం 9 నుంచి 12 అంగుళాల ఎత్తులో భారీ బ్యాటరీ ఉండటం.. మొత్తం మూడు డీజిల్ ట్యాంకర్లు ఏర్పాటు చేయటం, బస్సు కింది భాగాన్ని (ఫ్లోర్) పూర్తిగా చెక్కతో చేయటం, అత్యవసర ద్వారం వద్ద సీటు ఏర్పాటు చేయటం వంటి ఉల్లంఘనలు బస్సులో ఉన్నాయి. ప్రమాదం చోటు చేసుకున్న కల్వర్టు దగ్గర రోడ్డు ఇరుకుగా ఉంది. వాస్తవానికి ఇక్కడ రోడ్డును విస్తరించి, కొత్తగా కల్వర్టును కట్టాల్సి ఉన్నా కాంట్రాక్టర్లు పట్టించుకోలేదు.
 
 కల్వర్టుకు ఆనుకునే స్టీల్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మితిమీరిన వేగంతో బస్సును నడుపుతూ వచ్చిన డ్రైవర్ రహదారికి కుడిపక్కన ఉండే మార్జిన్ లైన్ (తెల్లగీత) దాటి కల్వర్టును ఢీ కొట్టాడు. అక్కడ ఉన్న స్టీల్ బారికేడ్లలోని ఓ రాడ్డు.. బస్సుకు గల ప్లాస్టిక్ డీజిల్ ట్యాంక్ (300 లీటర్ల సామర్థ్యం గలది)ను ఛిద్రం చేసుకుంటూ బస్సు లోపలికి వచ్చేయడంతో డీజిల్ ప్రయాణికులపై చిందింది. అదే సమయంలో డ్రైవర్ సీటు కింద ఉన్న బ్యాటరీ భూమికి తగిలి నిప్పురవ్వలు రేగాయి. అప్పటికే డీజిల్ చింది ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఎమర్జెన్సీ డోర్ మూసుకుపోవడంతో అందరినీ చుట్టుముట్టి బలిగొన్నాయి.
 
 ప్రమాదం తర్వాత లీజు ఒప్పందాల సృష్టి
 ప్రమాదం జరిగే నాటికి వోల్వో బస్సు బెంగళూరుకు చెందిన దివాకర్ రోడ్ లైన్స్ పేరిటే రిజిస్టర్ అయి ఉంది. దీని యజమానిగా జె.సి.ఉమారెడ్డి ఉన్నారు. ఆమె పేర బస్సును బుక్ చేసి బ్యాంకులో రుణం కూడా పొందారు. ప్రమాదం చోటుచేసుకున్న తరవాత పాత తేదీలతో జబ్బార్ ట్రావెల్స్‌తో వివిధ లీజు అగ్రిమెంట్లను సృష్టించారు. సీఐడీ దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి రావటంతో ఉమారెడ్డిని బుధవారం అరెస్టు చేసి వనపర్తి కోర్టులో హాజరుపరిచారు. వోల్వో కంపెనీని సైతం నిందితుల జాబితాలో చేర్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement