J.C diwakar reddy
-
దళితులను దగాజేసి..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : చెట్లు పుట్టలతో నిండిన భూములను దళితులు చెమటోడ్చి సాగుకు యోగ్యంగా తీర్చిదిద్దుకున్నారు. 24 ఏళ్ల పాటు ఆ భూముల్లో పంటలు పండించుకున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన చాగల్లు రిజర్వాయర్ కుడి కాలువ కింద ఆ భూములకు నీళ్లందించాలని ప్రభుత్వం నిర్ణయించడం దళితుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. కానీ.. ఇంతలోనే ఆ భూములపై మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి కళ్లు పడ్డాయి. అసైన్మెంట్ చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఆ భూములను కొట్టేసి.. తన భూముల్లో కలిపేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సొంతూరు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని పెద్దపప్పూరు మండలం జూటూరు. ఆ గ్రామంలో జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానికి భూములున్నాయి. జలయజ్ఞంలో భాగంగా పెద్దపప్పూరు మండలం జూటూరుకు సమీపంలో పెన్నాన దిపై 1.50 టీఎంసీల సామర్థ్యంతో రూ.220 కోట్ల వ్యయంతో చేపట్టిన చాగల్లు రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. వరుణుడు కరుణించి పెన్నమ్మ ఉరకలెత్తితే చాగల్లు రిజర్వాయర్ నిండుతుంది. అప్పుడు రిజర్వాయర్ కింద 4,500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించవచ్చు. చాగల్లు రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తెప్పించి.. ఆయకట్టుకు నీళ్లందిస్తానని ఎమ్మెల్యే హోదాలో జేసీ దివాకర్‌రెడ్డి అనేక సందర్భాల్లో ప్రకటించారు. జేసీ దివాకర్‌రెడ్డి చేసిన ప్రకటన జూటూరులో సర్వే నంబర్లు 1587 ఏ1, ఏ2, ఏ3బీ పరిధిలోని 18.68 ఎకరాల అసైన్డు భూమిని సాగుచేసుకుంటోన్న దళితుల్లో సరి కొత్త ఆశలు రేపాయి. కారణం.. ఆ భూములు చాగల్లు రిజర్వాయర్ పరిధిలోనివి కావడమే. చాగల్లు రిజర్వాయర్ నీటిని విడుదల చేస్తే తమ భూముల్లో బంగారం పండించుకుంటామని ఆ దళితులు ఆశించారు. జేసీ ఎత్తుకు దళితుల ఆశలు చిత్తు చాగల్లు రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని భూములను బినామీ పేర్లతో జేసీ దివాకర్‌రెడ్డి మూడేళ్లుగా నయానోభయానో తక్కువ ధరలకు భారీ ఎత్తున కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలోనే జూటూరులోని తన పొలాల సమీపంలో ఉన్న 18.68 ఎకరాల దళితుల భూములపై జేసీ కళ్లు పడ్డాయి. వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఎత్తు వేశారు. ఈ క్రమంలోనే అసైన్మెంట్ చట్టంలోని లొసుగులు జేసీకి కలిసొచ్చాయి. ఆ భూములను జూలై 31, 1985న జూటూరు గ్రామానికి చెందిన తొమ్మిది మంది దళితులకు ప్రభుత్వం అసైన్మెంట్ చేసింది. పెన్నానది పక్కనే ఉన్న ఈ భూముల్లో దళితులు పంటలు పండించుంటున్నారు. కానీ.. ఉన్నట్టుండి హఠాత్తుగా జూలై 25, 2009న ఆ భూములను తాము సాగుచేసుకోలేమని, వాటిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని పెద్దపప్పూరు తహశీల్దార్‌కు దళితులు వినతిపత్రాన్ని సమర్పించుకున్నారు. అసైన్డు చేసిన 24 ఏళ్ల తర్వాత వాటిని సాగుచేసుకోలేమని.. ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని దళితులు విజ్ఞాపన చేసుకోవడం వెనుక మాజీ మంత్రి జేసీ, ఆయన సోదరుడి ఒత్తిళ్లే కారణమని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. దళితులు విజ్ఞాపన చేసుకున్నదే తడవుగా వాటిని తహ శీల్దార్ స్వాధీనం చేసుకున్నారు. దళితులు సరెండర్ చేసిన వెంటనే.. ఖాళీగా ఉన్న ఆ భూములను కేటాయిస్తే, అందులో ఔషధ మొక్కలు పెంచి.. ఆయుర్వేద, హోమియోపతి, యునానీ మందులు తయారుచేస్తామని జేసీ దివాకర్‌రెడ్డి తన సోదరుడి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి ద్వారా సర్కారుకు ఓ ప్రతిపాదన చేయించారు. ఆ ప్రతిపాదనపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని అప్పటి కలెక్టర్ బి.జనార్దనరెడ్డి జూటూరు గ్రామ పంచాయతీకి లేఖ రాశారు. ఇందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆ గ్రామ పంచాయతీ కలెక్టర్‌కు స్పష్టీకరించింది. చకా చకా కదిలిన ఫైళ్లు అనంతపురం జిల్లాలో మంత్రి రఘువీరా వర్గీయుల చేతిలో 2009 నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తింటోన్న మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి దళితుల భూములను సొంతం చేసుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ క్రమంలో అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ ఒత్తిళ్ల వల్లే జేసీ అస్మిత్‌రెడ్డి చేసుకున్న ప్రతిపాదనను పరిశీలించాలని అప్పటి కలెక్టర్ బి.జనార ్ధనరెడ్డి పెద్దపప్పూరు తహశీల్దార్‌కు లేఖ రాశారు. దీనిపై తహశీల్దార్ స్పందిస్తూ.. ఆ భూములు సాగుచేసుకోవడం లేదని, వాటిని జేసీ అస్మిత్‌రెడ్డికి చెందిన అస్మిత్ బయోటెక్‌కు కేటాయించవచ్చునని కలెక్టర్‌కు నివేదించారు. ఇదే అంశంపై అనంతపురం ఆర్డీవో గౌతమిరెడ్డి జూటూరు వెళ్లి భూములను పరిశీలించి.. వాటిని సాగుచేసుకోలేదని నిర్ధారించి, ఎకరం రూ.41 వేల చొప్పున అస్మిత్ బయోటెక్‌కు అప్పగించవచ్చునని కలెక్టర్‌కు ప్రతిపాదించారు. ఇదే ప్రతిపాదనలను డిసెంబర్ 1, 2010న అప్పటి కలెక్టర్ బి.జనార్ధనరెడ్డి ప్రభుత్వ పరిశీలనకు పంపారు. ఫిబ్రవరి, 2012లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎకరం రూ.50 వేల చొప్పున ఆ భూములను అస్మిత్ బయోటెక్‌కు కేటాయించాలని తీర్మానించారు. ఆ మేరకు ఆ భూములను అస్మిత్ బయోటెక్‌కు కేటాయిస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌చంద్రపునేఠా మార్చి 29, 2012న ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నం:210) జారీచేశారు. కానీ.. మార్కెట్ధరల ప్రకారం ఆ ప్రాంతాల్లో ఎకరం రూ.1.50 లక్షకుపైగా పలుకుతోంది. చాగల్లు రిజర్వాయర్ కోసం చేసిన భూసేకరణలో కూడా రైతులకు ఎకరానికి రూ.1.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. ప్రభుత్వం ఈ అంశాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కారుచౌకగా అత్తెసరు ధరకే అస్మిత్ బయోటెక్‌కు భూములను కేటాయించడం గమనార్హం. రెండేళ్ల క్రితం ప్రభుత్వం కేటాయించిన భూములను తక్షణమే స్వాధీనం చేసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి.. వాటిని తన భూముల్లో కలిపేసుకున్నారు. ఆ భూముల్లో ఔషధమొక్కలకు బదులుగా మామిడిమొక్కలు సాగుచేయడం కొసమెరుపు. -
దటీజ్ జేసీ మార్క్..
అనంతపురం కైం, న్యూస్‌లైన్ : ‘అనంత’లో జేసీ దివాకరరెడ్డి తన శైలి రాజకీయాన్ని ప్రదర్శించారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ బలిజలపై సవతి ప్రేమ చూపుతోందన్న వాదనకు బలం చేకూరింది. కేవలం ఓట్ల కోసం వారిని వాడుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. అనంతపురం అర్బన్ టికెట్‌పై చాన్నాళ్లుగా ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం అర్థరాత్రి ఈ స్థానానికి ప్రభాకర్ చౌదరి పేరును ఖరారు చేశారు. ఈ వ్యవహారంపై బలిజ సామాజిక వర్గం పెద్దలు పెదవి విరుస్తున్నారు. అనంతపురం లోక్‌సభకు టీడీపీ తరఫున బరిలో నిలిచిన జేసీ దివాకరరెడ్డి వేసిన ప్లాక్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం ప్రభాకర్ చౌదరి ఇంటికి జేసీ దివాకరరెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనంతపురం టికెట్ వచ్చేలా చేస్తానని జేసీ.. చౌదరికి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ సమయంలోనే రాజకీయ కుట్రకు వారిద్దరూ తెరలేపినట్లు సమాచారం. ఇందులో భాగంగా అసెంబ్లీ టికెట్ రాన్నట్టుగా అందరినీ నమ్మించి.. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, అనంతపురం సీటు ఆశిస్తున్న మహాలక్ష్మి శ్రీనివాస్‌ను ముగ్గులోకి దించారు. అనంతరం ఇద్దరూ కలిసి పోయామంటూ మహాలక్ష్మితో కలిసి పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. కొంత సేపు అసమ్మతి నాటకమాడారు. చివరకు మహాలక్ష్మి శ్రీనివాస్‌కు మొండి చేయి చూపి టికెట్‌ను సాధించుకుని అటు బలిజలను, ఇటు ముస్లింలను మోసం చేశారు. మొన్నటి ఉప ఎన్నికలో మహాలక్ష్మి శ్రీనివాస్ తనకు ఇష్టం లేదని చెప్పినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక నీకే అవకాశం ఇస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. ఆ హామీ నిజమని నమ్మిన మహాలక్ష్మీ శ్రీనివాస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేశారు. తీరా ఇప్పుడు ప్రభాకర్‌చౌదరికి అవకాశమిచ్చారు. ఈ వ్యవహారంలో జేసీ బ్రదర్స్ పాత్ర కీలకమని, ఈ ఎన్నికల్లో వారికి సహకరించేది లేదని బలిజ సామాజిక వర్గం నేతలు చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీలో బలిజలకు పెద్ద పీట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలిజలకు పెద్ద పీట వేసిందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. అనంతపురంలో మేయర్ స్థానంతో పాటు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తమ వారికే ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ఉన్న బలిజ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించనుందని సమాచారం. -
ఇక తేల్చుడే!
సాక్షి, అనంతపురం : జిల్లా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాల రాజుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇతర పార్టీల నుంచి వస్తున్న వారికే అధినేత ప్రాధాన్యత ఇస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అనంతపురం ఎంపీ టికెట్‌ను జేసీ దివాకరరెడ్డికి కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధినేతతో తాడోపేడో తేల్చుకునేందుకు అనంతపురం మునిసిపల్ మాజీ చైర్మన్ ప్రభాకర్ చౌదరి సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బెర్తులు ఖాళీగా లేకపోవడంతో కొందరు కాంగ్రెస్ నేతలు టీడీపీలోకి వలస బాట పడుతున్నారు. ఇదే క్రమంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం సాగుతోంది. జేసీ బ్రదర్స్ పార్టీలో చేరాక అనంతపురం పార్లమెంట్ టికెట్‌ను జేసీ దివాకరరెడ్డికి ఇచ్చే అంశంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ముందు నుంచి అనంతపురం పార్లమెంట్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ప్రభాకర్ చౌదరి.. తన అనుచరులతో కలిసి చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు రెండ్రోజుల్లో హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అనుచరులకు చెప్పినట్లు తెలిసింది. ప్రభాకర్ చౌదరి మొదట్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ జేసీ దివాకరరెడ్డిని వ్యతిరేకించి ఆ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 1999లో ఆ పార్టీ తరఫున మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికై తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూనే పరిటాల రవికి వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహించాడన్న ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. ఈ క్రమంలో 2004లో అనంతపురం అసెంబ్లీ టికెట్ ప్రభాకర్ చౌదరికి వస్తుందని ఆయన అనుచరులంతా భావించినా అప్పట్లో పరిటాల రవి అడ్డుపడడంతో మాజీ రాజ్యసభ సభ్యుడు కేఎం సైఫుల్లా కుమారుడు రహంతుల్లాకు టికెట్ దక్కింది. దీంతో కలత చెందిన ప్రభాకర్ చౌదరి టీడీపీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో 25 వేల ఓట్ల వరకు సాధించారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో టీడీపీ మద్దతుదారుల ఓటమి కోసం పని చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్న కొంత కాలానికే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ‘అవే’ స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఫ్యాక్షన్‌కు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. అనంతపురం పార్లమెంట్ స్థానానికి టికెట్ ఇస్తానని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో తిరిగి ప్రభాకర్ చౌదరి టీడీపీలో చేరినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన జేసీ బ్రదర్స్‌ను టీడీపీలో చేర్చుకునేందుకు బాబు ఆసక్తి చూపుతుండడంతో పాటు అనంతపురం పార్లమెంట్ టికెట్ జేసీ దివాకరరెడ్డికి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుండడంపై ప్రభాకర్ చౌదరి అసంతృప్తితో ఉన్నారు. తనకు అన్యాయం జరిగితే గతంలో పార్టీకి నష్టం కలిగించినట్టే ఈ సారి కూడా చేయాల్సి వస్తుందన్న సంకేతాలిచ్చి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకునేందుకు సోమవారం తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. -
పాపాల పుట్ట... వోల్వో బస్సు
-
వోల్వో బస్సు లోపాల పుట్ట
సాక్షి, హైదరాబాద్/వనపర్తి: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద గత ఏడాది 45 మంది ప్రయాణికులను బలితీసుకున్న ఘోర బస్సు ప్రమాదానికి అనేక విభాగాల బాధ్యత, నిర్లక్ష్యం ఉన్నాయని సీఐడీ చీఫ్ టి.కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఈ బస్సు వాస్తవంగా ప్రముఖ ట్రావెల్స్ కంపెనీ అధినేత జె.సి.ప్రభాకరరెడ్డి సతీమణి జె.సి.ఉమారెడ్డి పేరుతో రిజిస్టరయి ఉన్నట్లు దర్యాప్తులో బయటపడిందని.. దీంతో ఆమెను బుధవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రభాకరరెడ్డి మాజీ మంత్రి జె.సి.దివాకర్‌రెడ్డి సోదరుడనే విషయం తెలిసిందే. ఉమారెడ్డిని సీఐడీ పోలీసులు బుధవారం మధ్యాహ్నమే రహస్యంగా వనపర్తి కోర్టులో హాజరుపరిచారు. కేసులో ఉమారెడ్డి ఏ9 ముద్దాయిగా ఉన్నారు. కేసును విచారించిన వనపర్తి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ మిలింద్కాంబ్లీ ఆమెను మొదట రిమాండ్‌కు ఆదేశించారు. అయితే ఆమెకు బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో ఆమె తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయడంతో బెయిల్ మంజూరు చేశారు. తిరిగి మార్చి 4న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. మరోవైపు.. తాము చేపట్టిన సాంకేతిక దర్యాప్తులో వోల్వో బస్సు డిజైన్లోనే లోపాలు ఉన్నట్లు తేలిందని, ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా వోల్వో సర్వీసుల్ని రద్దు చేయాలని సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక పంపుతామని సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు దాదాపు పూర్తయిందని, ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశామని, త్వరలో న్యాయస్థానంలో దాఖలు చేయనున్న చార్జ్‌షీట్‌లో మరికొందరు నిందితుల పేర్లు చేరుస్తామని చెప్పారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు గత ఏడాది అక్టోబర్ 30 తెల్లవారుజామున పాలెం వద్ద కల్వర్టును ఢీ కొని అగ్ని ప్రమాదానికి లోనైంది. ఈ ఉదంతంలో 45 మంది ప్రయాణికులు సజీవ దహనమైన విషయం విదితమే. ఈ కేసును దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు బస్సు డిజైన్లోనూ ఎన్నో లోపాలు, ప్రమాద హేతువులు ఉన్నట్లు గుర్తించారు. ఇటు బస్సులో.. అటు రోడ్డులో ఉల్లంఘనలు... బస్సు డ్రైవర్ సీటు కింద భూమి నుంచి కేవలం 9 నుంచి 12 అంగుళాల ఎత్తులో భారీ బ్యాటరీ ఉండటం.. మొత్తం మూడు డీజిల్ ట్యాంకర్లు ఏర్పాటు చేయటం, బస్సు కింది భాగాన్ని (ఫ్లోర్) పూర్తిగా చెక్కతో చేయటం, అత్యవసర ద్వారం వద్ద సీటు ఏర్పాటు చేయటం వంటి ఉల్లంఘనలు బస్సులో ఉన్నాయి. ప్రమాదం చోటు చేసుకున్న కల్వర్టు దగ్గర రోడ్డు ఇరుకుగా ఉంది. వాస్తవానికి ఇక్కడ రోడ్డును విస్తరించి, కొత్తగా కల్వర్టును కట్టాల్సి ఉన్నా కాంట్రాక్టర్లు పట్టించుకోలేదు. కల్వర్టుకు ఆనుకునే స్టీల్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మితిమీరిన వేగంతో బస్సును నడుపుతూ వచ్చిన డ్రైవర్ రహదారికి కుడిపక్కన ఉండే మార్జిన్ లైన్ (తెల్లగీత) దాటి కల్వర్టును ఢీ కొట్టాడు. అక్కడ ఉన్న స్టీల్ బారికేడ్లలోని ఓ రాడ్డు.. బస్సుకు గల ప్లాస్టిక్ డీజిల్ ట్యాంక్ (300 లీటర్ల సామర్థ్యం గలది)ను ఛిద్రం చేసుకుంటూ బస్సు లోపలికి వచ్చేయడంతో డీజిల్ ప్రయాణికులపై చిందింది. అదే సమయంలో డ్రైవర్ సీటు కింద ఉన్న బ్యాటరీ భూమికి తగిలి నిప్పురవ్వలు రేగాయి. అప్పటికే డీజిల్ చింది ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఎమర్జెన్సీ డోర్ మూసుకుపోవడంతో అందరినీ చుట్టుముట్టి బలిగొన్నాయి. ప్రమాదం తర్వాత లీజు ఒప్పందాల సృష్టి ప్రమాదం జరిగే నాటికి వోల్వో బస్సు బెంగళూరుకు చెందిన దివాకర్ రోడ్ లైన్స్ పేరిటే రిజిస్టర్ అయి ఉంది. దీని యజమానిగా జె.సి.ఉమారెడ్డి ఉన్నారు. ఆమె పేర బస్సును బుక్ చేసి బ్యాంకులో రుణం కూడా పొందారు. ప్రమాదం చోటుచేసుకున్న తరవాత పాత తేదీలతో జబ్బార్ ట్రావెల్స్తో వివిధ లీజు అగ్రిమెంట్లను సృష్టించారు. సీఐడీ దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి రావటంతో ఉమారెడ్డిని బుధవారం అరెస్టు చేసి వనపర్తి కోర్టులో హాజరుపరిచారు. వోల్వో కంపెనీని సైతం నిందితుల జాబితాలో చేర్చారు. -
లైన్ క్లియర్
సాక్షి ప్రతినిధి, అనంతపురం : కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. టీడీపీలో చేరడం ఇక లాంఛనమే. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇవ్వడాన్ని తాడిపత్రిలోని ఆ పార్టీ నేతలు వ్యతిరేకించలేదు. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామంటూ మంగళవారం చంద్రబాబు వద్ద తాడిపత్రి నేతలు ప్లేటు ఫిరాయించడం టీడీపీ నేతలనే విస్మయానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం జిల్లా టీడీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమైన విషయం విదితమే. జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి తీసుకోవాలన్న తన నిర్ణయాన్ని చంద్రబాబు ఆ సమావేశంలో వివరించారు. చంద్రబాబు నిర్ణయం పరిటాల సునీత, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులును వెనకడుగు వేసేలా చేసింది. ఇన్నాళ్లూ జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన వారు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడం ఆ పార్టీ నేతలను ఆశ్చర్యపరచింది. ఈ క్రమంలోనే తాడిపత్రి ప్రాంత నేతలను పిలిపించి.. సర్దిచెప్పి జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి చేర్చుకోవాలని పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు .. చంద్రబాబుకు సూచించడం గమనార్హం. ఆ మేరకు మంగళవారం తాడిపత్రి ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలను హైదరాబాద్‌కు చంద్రబాబు రప్పించారు. యాడికి, పెదపప్పూరు, పెద్దవడుగూరు, తాడిపత్రి రూరల్, తాడిపత్రి పట్టణానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు విడివిడిగా సమావేశమయ్యారు. జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి తీసుకోవాలన్న నిర్ణయంపై ఇటీవల తాడిపత్రిలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ సభలో ఆ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నిర్వహించే సమావేశంలో తాడిపత్రి నేతలు ధిక్కారస్వరం విన్పించడం ఖాయమనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు అంచనా వేశారు. కానీ.. ఒకరిద్దరు నేతలు మినహా జేసీ బద్రర్స్‌ను పార్టీలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించకపోవడం టీడీపీ నేతలనే విస్మయానికి గురి చేసింది. వీరు ప్లేటు ఫిరాయించడం వెనుక మర్మమేమిటన్నది అంతుచిక్కడం లేదు. తాడిపత్రి నేతలు కూడా వ్యతిరేకించని నేపథ్యంలో జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరిక లాంఛనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ.. రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన జేసీ దివాకర్‌రెడ్డి కొత్తపార్టీ పెట్టేందుకు కసరత్తు చేస్తోన్న అపద్ధర్మ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో మంగళవారం సమావేశం కావడం.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించడం రాజకీయ విశ్లేషకుల మెదళ్లకు పనిపెట్టింది. అనంతపురం టీడీపీ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించిన తరుణంలో జేసీ.. కిరణ్‌తో సమావేశం కావడం హాట్‌టాపిక్‌గా మారింది. -
నీటి రాజకీయం
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : చాగల్లు రిజర్వాయర్‌కు నీటి విడుదలపై రాజకీయం చోటుచేసుకుంది. నీటిని తరలించుకుపోయేందుకు మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి పట్టు బిగించగా, తన అనుమతి లేకుండా ఎలా విడుదల చేస్తున్నారంటూ మరో ముఖ్య ప్రజాప్రతినిధి అధికారులపై శివమెత్తుతున్నారు. అదనపు నీటి కోసం వీరి మధ్య సాగుతున్న అధిపత్య పోరులో వారు నలిగి పోతున్నారు. దీంతో వారు మూకుమ్మడి సెలవుపై వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మహానేత చలవతో జిల్లా తాగునీటి అవసరాల కోసం వస్తున్న అదనపు జలాల కోసం రాజకీయాలు చేస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఓట్లు దండుకునే ఎత్తుగడే తప్ప, చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమాన్ని వారు ఆకాంక్షించడం లేదన్నది ఆ నేతల చర్యలు చెబుతున్నాయి. వాస్తవానికి పీఏబీఆర్‌కు వస్తున్న అదనపు జలాల కుడి కాల్వ కింద ఉన్న రైతులకు, జిల్లా ప్రజలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలి. అలాగే ఏయే ప్రాంతానికి ఎంత నీరు వాడాలన్నది సాగునీటి సలహా మండలి(ఐఏబీ) చైర్మన్, జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి మాత్రం తన నియోజకవర్గంలోని చాగల్లుకు అదనపు జలాల్లోంచి 1.5 టీఎంసీలు వదలాలని ప్రభుత్వం నుంచి జీవో తెచ్చుకున్నారు. ఐఏబీ చైర్మన్, హెచ్చెల్సీ అధికారులతో చర్చించకుండానే ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. తనను డమ్మీని చేస్తున్నారని ఐఏబీ చైర్మన్, కలెక్టర్ చెప్పడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. జేసీ రాజకీయ బలంతో చివరకు శుక్రవారం నుంచి చాగల్లుకు నీటి విడుదల చేశారు. ఒక టీఎంసీ నీరు చాగల్లుకు చేరుతాయా? ఈ ఏడాది అదనపు కోటాలో చివరిసారిగా విడుదల చేసిన 2 టీఎంసీలు శనివారంతో పూర్తవుతున్నాయి. ప్రస్తుతం గార్లదిన్నె మండలంలోని మిడ్‌పెన్నార్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇంకా మిడ్‌పెన్నార్ సౌత్ కెనాల్ కింద వెనుకదును కింద సాగైన పంటలకు ఒకటి, రెండు తడులు అందించాల్సి ఉంది. దీంతో రిజర్వాయర్‌లో 1 టీఎంసీ మాత్రమే నిల్వ ఉంటుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో మేరకు పెన్నానది ద్వారా మాత్రమే చాగల్లుకు నీటిని పంపాలి. రానున్న వేసవిలో జిల్లాతో పాటు, వైఎస్సార్ జిల్లాలో కూడా తాగునీటి ఇబ్బందులు పరిష్కరించాల్సిన బాధ్యత ఇక్కడి అధికారులపైనే ఉంటుంది. పులివెందులకు మిడ్‌పెన్నార్ నుంచే తాగునీటిని అందించాల్సి ఉంది. ఈ మేరకు రానున్న వేసవిలో 5.715 టీఎంసీలు అవసరమవుతాయని లెక్కలు కట్టారు. ప్రస్తుతం మిడ్‌పెన్నార్ 1 టీఎంసీలు, పీఏబీఆర్‌లో 2 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. తుంగభద్ర నుంచి వస్తున్న అదనపు కోటా కూడా ఆగిపోనుంది. హంద్రీ నీవా జలాలు ఎప్పుడు ఆగిపోతాయో చెప్పలేని పరిస్థితి. ఈ సమయంలో నదీ ద్వారా వదలడం వలన నీటి వృథా అవుతుందే తప్పా రైతులకు, ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరదని అధికారులు పేర్కొంటున్నారు. -
తమ్ముళ్లు బేజారు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఫ్యాక్షన్‌కు పుట్టినిల్లయిన తాడిపత్రి వేదికగా జిల్లాలో రాజకీయ చదరంగానికి తెరలేచింది. ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానికి పార్టీ తీర్థం ఇవ్వాలని నిర్ణయించడం ఆ పార్టీలో కలకలం రేపింది. జేసీ బ్రదర్స్‌కు పార్టీ తీర్థం ఇస్తే టీడీపీని వీడటానికి కూడా వెనుకాడబోమని ఎమ్మెల్యే పరిటాల సునీత, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు, తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పేరం నాగిరెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ఆ అల్టిమేటంను కూడా చంద్రబాబు లెక్క చేయకుండా జేసీ బ్రదర్స్ వద్దకు సీఎం రమేష్‌ను రాయబారం పంపడటంపై పేరం నాగిరెడ్డి మనస్థాపం చెందారు. తాడిపత్రిలో బుధవారం టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన పేరం నాగిరెడ్డి.. శ్రేణుల సూచన మేరకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పులివెందులలో వైఎస్సార్పీపీలో చేరారు. జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు స్పందనపై టీడీపీ శ్రేణులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి 2009 నుంచి ఆ పార్టీలో ఏకాకిగా మిగిలిపోయారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ తీవ్రంగా స్పందించారు. దిగ్విజయ్ ఆదేశాల మేరకు జేసీ దివాకర్‌రెడ్డికి పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌లో ఇమడలేని పరిస్థితులు ఏర్పడటంతో చాలా కాలంగా జేసీ బ్రదర్స్ ‘వలస’వాదం విన్పిస్తున్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను ఆర్నెల్ల క్రితమే జేసీ బ్రదర్స్ చంద్రబాబు వద్దకు రాయబారం పంపారు. జేసీ బ్రదర్స్‌ను టీడీపీలో చేర్చుకోవడానికి అప్పట్లో చంద్రబాబు ప్రాథమికంగా అంగీకరించారు. చంద్రబాబు సూచన మేరకే ఆయన కుమారుడు లోకేష్ పలు మార్లు హైదరాబాద్‌లోని జేసీ దివాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరపడం ఆ పార్టీలో కలకలం రేపింది. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇవ్వడం ఖాయమనే అంచనాకు వచ్చిన తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పేరం నాగిరెడ్డి.. ఇదే అంశంపై అప్పట్లో చంద్రబాబును నిలదీశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి తీసుకోవడం లేదని చెప్పినట్లు పేరం నాగిరెడ్డి అప్పట్లో ప్రకటించారు. తాడిపత్రిలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ సభలో సీనియర్ ఎమ్మెల్యే పరిటాల సునీత, పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు, పేరం నాగిరెడ్డి, కందిగోపుల మురళి తదితర నేతలు జేసీ బ్రదర్స్‌పై నిప్పులు చెరిగారు. టీడీపీ కార్యకర్తలను చంపి.. హత్యా రాజకీయాలు చేసిన జేసీ బ్రదర్స్‌కు పార్టీ తీర్థం ఇస్తే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. సీనియర్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చంద్రబాబు అప్పట్లో వెనక్కి తగ్గారు. కానీ, ఇటీవల జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల్లో జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలతో మరోసారి జేసీ బ్రదర్స్‌కు పార్టీ తీర్థం ఇచ్చే అంశంపై చంద్రబాబు చర్చించారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మినహా తక్కిన ప్రజాప్రతినిధులు, నేతలు జేసీ బ్రదర్స్‌ను పార్టీలో చేర్చుకోవద్దంటూ సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలకు నచ్చజెప్పే బాధ్యతను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అప్పగించారు. ఆర్థిక వనరుల సమీకరణ కోసం జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి చేర్చుకోక తప్పని పరిస్థితి నెలకొందని.. అభ్యంతరం చెప్పవద్దని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం రమేష్, సోమిరెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ.. ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, కందికుంట ప్రసాద్, అబ్దుల్ ఘనీ, ఎంపీ నిమ్మల కిష్టప్ప తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా టీడీపీ శ్రేణుల అభిప్రాయంతో నిమిత్తం లేకుండా జేసీ బ్రదర్స్‌కు పార్టీ తీర్థం ఇవ్వడానికే చంద్రబాబు మొగ్గుచూపుతుండటంతో పేరం నాగిరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు టీడీపీకీ గుడ్‌బై చెప్పారు. జిల్లాలో జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానికి.. పరిటాల రవి కుటుంబానికి రెండు దశాబ్దాలుగా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇస్తే పరిటాల రవి వర్గం ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఆది నుంచి జేసీ బ్రదర్స్‌ను వ్యతిరేకిస్తోన్న మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది. -
రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు
తాడిపత్రి, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి మధ్య ఈ ఏడాదీ ‘వాటర్ వార్’ మొదలైంది. సుబ్బరాయసాగర్ నీటి విడుదల విషయంలో ఇద్దరూ జగడానికి దిగారు. ముందుగా తాడిపత్రి ప్రాంతంలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని జేసీ... కాదు తన నియోజకవర్గంలో తాగునీటి అవసరాలు తీర్చాలని శైలజానాథ్ పంతానికి పోవడంతో వివాదం మొదలైంది. ఈ వివాదం రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు రాజేసే ప్రమాదం కన్పిస్తోంది. సుబ్బరాయసాగర్ జలాశయం తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) వ్యవస్థలో ఉంది. హెచ్చెల్సీ ద్వారా ఇందులోకి నీటిని నింపి... తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ (టీబీసీ) ఆయకట్టుకు, పుట్లూరు మండలంలో తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తుంటారు. గత నెల 15వ తేదీనే సుబ్బరాయసాగర్‌కు నీటిని విడుదల చేయాల్సి వుండగా... హెచ్చెల్సీ ప్రధాన కాలువకు నీటి లభ్యత లేని కారణంగా ఈ నెల ఒకటి నుంచి వదులుతున్నారు. హెచ్చెల్సీ వ్యవస్థలోనే ఉన్న మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) నుంచి తుంపెర డీప్‌కట్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే సుబ్బరాయసాగర్‌లోకి 8.5 మీటర్ల మేర నీరు వచ్చి చేరింది. ఇక టీబీసీకి విడుదల చేయడమే తరువాయి. ఇంతలోనే జేసీ, శైలజానాథ్ మధ్య రగడ మొదలైంది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో పత్తి, కరివేపాకు పంటలు ఎండుతున్నాయని, కావున ముందుగా ఆయకట్టుకు నీరు వదలాలని జేసీ పట్టుబడుతున్నారు. ఇందుకు శైలజానాథ్ ఒప్పుకోవడం లేదు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గ పరిధిలోని పుట్లూరు మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దాన్ని తీర్చడానికి ముందుగా పుట్లూరు, కోమటికుంట్ల చెరువులకు నీరు వదలాలంటూ ఏకంగా సీఎం పేషీ నుంచే హెచ్చెల్సీ అధికారులపై ఒత్తిడి తెప్పిస్తున్నారు. దీంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో అధికారులు తల పట్టుకుంటున్నారు. ‘కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం’ అన్నట్లుగా వారి పరిస్థితి తయారైంది. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున తమ ప్రాంత ప్రజల మెప్పు పొందేందుకే ఇరువురు ప్రజాప్రతినిధులు జల జగడానికి దిగినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎ.కొండాపురంలో రైతులతో అధికారుల సమావేశం సుబ్బరాయసాగర్ నుంచి నీటి విడుదల విషయంపై చర్చిం చేందుకు బుధవారం హెచ్చెల్సీ ఈఈ ధనుంజయరావు పుట్లూ రు మండలం ఎ.కొండాపురం వద్ద ఉన్న ఇరిగేషన్ కార్యాలయం లో పుట్లూరు, తాడిపత్రి మండలాలకు చెందిన కొద్దిమంది రైతులతో రహస్యంగా సమావేశమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి శైలజానాథ్ ఆదేశాల మేరకు ముందుగా పుట్లూరు, కోమటికుంట్ల చెరువులకు ఆరు రోజులు నీటిని విడుదల చేస్తామని, ఆ తర్వాత తాడిపత్రి మండలంలోని అయకట్టుకు నీరు ఇస్తామని అధికారులు సూచించడంతో రైతులువ్యతిరేకించినట్లు తెలుస్తోంది. -
పారని జేసీ పాచిక!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి పాచిక పారలేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రచ్చబండలో ముఖ్యమంత్రితో ‘చాగల్లు’ రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయించి.. పునర్వైభవం సాధించాలని ఆరాటపడ్డారు. తాడిపత్రిలో పర్యటిస్తే.. తాము బహిష్కరిస్తామని మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ తెగేసి చెప్పడంతో సీఎం వెనక్కి తగ్గారు. మరోసారి శింగనమల నియోజకవర్గంలోనే రచ్చబండ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. రెండేళ్లుగా సీఎంను రప్పించుకునేందుకు జేసీ విఫలయత్నం చేస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ మంత్రులే పైచేయి సాధిస్తున్నారు. ముఖ్యమంత్రి ఈనెల 11 నుంచి 26 వరకు మూడో విడత ‘రచ్చబండ’ నిర్వహిస్తోన్న విషయం విదితమే. జిల్లాలో 19 లేదా 24 తేదీల్లో రచ్చబండ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్‌ను కోరింది. ఇది పసిగట్టిన జేసీ దివాకర్‌రెడ్డి రచ్చబండలో భాగంగా తన నియోజకవర్గంలో పర్యటించాలని కోరారు. ఇందుకు సీఎం అంగీకరించారు కూడా. సీఎం చేతుల మీదుగా చాగల్లు రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయడంతోపాటు తాడిపత్రిలో మున్సిపల్ కార్యాలయం, కాంప్లెక్స్‌లను ప్రారంభింపజేసి, నియోజకవర్గంపై పట్టు సాధించాలని జేసీ ఆరాటపడ్డారు. ఈ క్రమంలోనే చాగల్లుకు హంద్రీ-నీవా నీటిని తరలించేందుకు నవంబర్ 30న ప్రయత్నించారు. కానీ.. ఇందుకు అనుమతి లేకపోవడంతో అధికారులు నీటి విడుదల ఆపేశారు. తాడిపత్రిలో పర్యటించేందుకు సీఎం అంగీకరించడాన్ని తెలుసుకున్న మంత్రులు రఘువీరా, శైలజానాథ్ మండిపడ్డారు. తాడిపత్రిలో పర్యటిస్తే.. తాము బహిష్కరిస్తామని సీఎంకు స్పష్టం చేశారు. దాంతో.. సీఎం వెనక్కి తగ్గారు. తన నియోజకవర్గంలో పర్యటించాలని శైలజానాథ్ పట్టుబట్టారు. గతంలో నిర్దేశించిన షెడ్యూల్‌తో నిమిత్తం లేకుండా ఈ నెల 22న శింగనమలలో పర్యటించాలని కోరారు. ఇందుకు సీఎం అంగీకరించారు. ఆ మేరకు శింగనమలలో రచ్చబండ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కిరణ్ 2011లో నిర్వహించిన తొలి విడత రచ్చబండలో శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలంలో పర్యటించారు. మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, మంత్రులు రఘువీరా, శైలజానాథ్ మధ్య ఆధిపత్య పోరుతో రెండో విడత రచ్చబండ పర్యటనను గతేడాది సీఎం కిరణ్ జిల్లాలో రద్దు చేసుకున్నారు. రెండో విడత రచ్చబండ సమయంలోనూ తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించాలంటూ సీఎంను జేసీ పట్టుపట్టారు. అక్కడ పర్యటిస్తే.. తాము బహిష్కరిస్తామని మంత్రులు చెప్పడంతో అప్పట్లో ఏకంగా రచ్చబండ పర్యటననే జిల్లాలో రద్దుచేసుకోవడం గమనార్హం. కాగా సీఎం సభను తొలుత ఈ నెల 24 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నెల 23న సత్యసాయి జయంతి వేడుకలు ఉన్నందున.. పోలీసు సిబ్బంది అంతా అక్కడకు వెళ్తారని పోలీసు అధికారులు సెలవిచ్చారు. దీంతో శైలజానాథ్ కల్పించుకుని.. ముఖ్యమంత్రి పర్యటన కంటే ఉత్సవాలు అంత ముఖ్యమా అని వ్యాఖ్యానించడంతో ‘రచ్చబండ’ను ఈ నెల 22న నిర్వహించాలని ఖరారు చేశారు. -
ఇక రచ్చ రచ్చ
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘రచ్చబండ’పై అధికార పార్టీలో రచ్చ మొదలైంది. తాడిపత్రి నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహించాలన్న సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి ప్రతిపాదనను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారు. ఇది పసిగట్టిన మంత్రులు రఘువీరా, శైలజానాథ్‌లు తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తే తాము బహిష్కరిస్తామని సీఎం కిరణ్‌కు తెగేసిచెప్పారు. శింగనమల నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇది అధికార పార్టీలో ఆధిపత్య పోరును తారస్థాయికి చేర్చింది. ఈనెల 11 నుంచి 26 వరకు మూడో విడత రచ్చబండను నిర్వహించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. తాడిపత్రిలో రూ.32 కోట్ల వ్యయంతో మున్సిపల్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. రూ.2.2 కోట్ల వ్యయంతో మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించారు. రూ.202 కోట్ల వ్యయంతో చాగల్లు రిజర్వాయర్ నిర్మాణం పూర్తైది. ఇకపై ఏ ఎన్నికల్లో పోటీచేసేది లేదని పదే పదే ప్రకటిస్తోన్న జేసీ దివాకర్‌రెడ్డి.. 2014 ఎన్నికల్లో తన కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డిని తాడిపత్రి శాసనసభ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. చాగల్లు రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయడం.. మున్సిపల్ కాంప్లెక్స్, మున్సిపల్ కార్యాలయ భవనాన్ని సీఎంతో ప్రారంభింపజేసి- నియోజకవర్గ అభివృద్ధి తమకే సాధ్యమనే భావనను ప్రజల్లో కలిగించడానికి జేసీ ఎత్తులు వేస్తున్నారు. తద్వారా ఎన్నికల్లో తన కుమారుడికి లబ్ధి చేకూర్చాలన్నది ఆయన ఎత్తుగడ. ఆ క్రమంలోనే ఇటీవల సీఎంను కలిసి రచ్చబండ కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో నిర్వహించాలని కోరారు. పనిలో పనిగా చాగల్లు రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయడం.. మున్సిపల్ కాంప్లెక్స్, కార్యాలయ భవనాన్ని ప్రారంభించడానికి సీఎంను ఆహ్వానించారు. ఇటీవల జేసీతో సాన్నిహిత్యం పెరిగిన దృష్ట్యా తాడిపత్రిలో పర్యటించడానికి సీఎం కిరణ్ అంగీకరించారు. ఈనెల 19నగానీ.. 24నగానీ తాడిపత్రిలో పర్యటిస్తానని జేసీకి కిరణ్ హామీ ఇచ్చారు. దాంతో.. సీఎం పర్యటన ఏర్పాట్లు చేయాలని అధికారులపై జేసీ ఒత్తిడి తెస్తున్నారు. ఆ క్రమంలోనే చాగల్లు రిజర్వాయర్‌కు మిడ్ పెన్నార్ నుంచి నీటిని కూడా విడుదల చేయించారు. ఇది పసిగట్టిన మంత్రులు రఘువీరా, శైలజానాథ్‌లు ఇటీవల సీఎం కిరణ్‌ను వేర్వేరుగా కలిశారు. తాడిపత్రి నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహిస్తే.. ఆ పర్యటను తాము బహిష్కరిస్తామని తెగేసిచెప్పారు. పెనుకొండ, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట రచ్చబండ నిర్వహించాలని సీఎం కిరణ్‌ను మంత్రి రఘువీరా కోరారు. శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలంలో పర్యటించి.. రచ్చబండ నిర్వహించాలని మంత్రి శైలజానాథ్ కోరారు. ఈ నేపథ్యంలో సీఎం ఏం చేస్తారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.