తాడిపత్రి, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి మధ్య ఈ ఏడాదీ ‘వాటర్ వార్’ మొదలైంది. సుబ్బరాయసాగర్ నీటి విడుదల విషయంలో ఇద్దరూ జగడానికి దిగారు. ముందుగా తాడిపత్రి ప్రాంతంలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని జేసీ... కాదు తన నియోజకవర్గంలో తాగునీటి అవసరాలు తీర్చాలని శైలజానాథ్ పంతానికి పోవడంతో వివాదం మొదలైంది.
ఈ వివాదం రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు రాజేసే ప్రమాదం కన్పిస్తోంది. సుబ్బరాయసాగర్ జలాశయం తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) వ్యవస్థలో ఉంది. హెచ్చెల్సీ ద్వారా ఇందులోకి నీటిని నింపి... తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ (టీబీసీ) ఆయకట్టుకు, పుట్లూరు మండలంలో తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తుంటారు. గత నెల 15వ తేదీనే సుబ్బరాయసాగర్‌కు నీటిని విడుదల చేయాల్సి వుండగా... హెచ్చెల్సీ ప్రధాన కాలువకు నీటి లభ్యత లేని కారణంగా ఈ నెల ఒకటి నుంచి వదులుతున్నారు.
హెచ్చెల్సీ వ్యవస్థలోనే ఉన్న మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) నుంచి తుంపెర డీప్‌కట్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే సుబ్బరాయసాగర్‌లోకి 8.5 మీటర్ల మేర నీరు వచ్చి చేరింది. ఇక టీబీసీకి విడుదల చేయడమే తరువాయి. ఇంతలోనే జేసీ, శైలజానాథ్ మధ్య రగడ మొదలైంది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో పత్తి, కరివేపాకు పంటలు ఎండుతున్నాయని, కావున ముందుగా ఆయకట్టుకు నీరు వదలాలని జేసీ పట్టుబడుతున్నారు.
ఇందుకు శైలజానాథ్ ఒప్పుకోవడం లేదు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గ పరిధిలోని పుట్లూరు మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దాన్ని తీర్చడానికి ముందుగా పుట్లూరు, కోమటికుంట్ల చెరువులకు నీరు వదలాలంటూ ఏకంగా సీఎం పేషీ నుంచే హెచ్చెల్సీ అధికారులపై ఒత్తిడి తెప్పిస్తున్నారు. దీంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో అధికారులు తల పట్టుకుంటున్నారు. ‘కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం’ అన్నట్లుగా వారి పరిస్థితి తయారైంది. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున తమ ప్రాంత ప్రజల మెప్పు పొందేందుకే ఇరువురు ప్రజాప్రతినిధులు జల జగడానికి దిగినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఎ.కొండాపురంలో రైతులతో అధికారుల సమావేశం
సుబ్బరాయసాగర్ నుంచి నీటి విడుదల విషయంపై చర్చిం చేందుకు బుధవారం హెచ్చెల్సీ ఈఈ ధనుంజయరావు పుట్లూ రు మండలం ఎ.కొండాపురం వద్ద ఉన్న ఇరిగేషన్ కార్యాలయం లో పుట్లూరు, తాడిపత్రి మండలాలకు చెందిన కొద్దిమంది రైతులతో రహస్యంగా సమావేశమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి శైలజానాథ్ ఆదేశాల మేరకు ముందుగా పుట్లూరు, కోమటికుంట్ల చెరువులకు ఆరు రోజులు నీటిని విడుదల చేస్తామని, ఆ తర్వాత తాడిపత్రి మండలంలోని అయకట్టుకు నీరు ఇస్తామని అధికారులు సూచించడంతో రైతులువ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు
Published Thu, Nov 21 2013 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
Advertisement
Advertisement