సాక్షి ప్రతినిధి, అనంతపురం : చెట్లు పుట్టలతో నిండిన భూములను దళితులు చెమటోడ్చి సాగుకు యోగ్యంగా తీర్చిదిద్దుకున్నారు. 24 ఏళ్ల పాటు ఆ భూముల్లో పంటలు పండించుకున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన చాగల్లు రిజర్వాయర్ కుడి కాలువ కింద ఆ భూములకు నీళ్లందించాలని ప్రభుత్వం నిర్ణయించడం దళితుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. కానీ.. ఇంతలోనే ఆ భూములపై మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి కళ్లు పడ్డాయి. అసైన్‌మెంట్ చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఆ భూములను కొట్టేసి.. తన భూముల్లో కలిపేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సొంతూరు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని పెద్దపప్పూరు మండలం జూటూరు. ఆ గ్రామంలో జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానికి భూములున్నాయి. జలయజ్ఞంలో భాగంగా పెద్దపప్పూరు మండలం జూటూరుకు సమీపంలో పెన్నాన దిపై 1.50 టీఎంసీల సామర్థ్యంతో రూ.220 కోట్ల వ్యయంతో చేపట్టిన చాగల్లు రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. వరుణుడు కరుణించి పెన్నమ్మ ఉరకలెత్తితే చాగల్లు రిజర్వాయర్ నిండుతుంది.
అప్పుడు రిజర్వాయర్ కింద 4,500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించవచ్చు. చాగల్లు రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తెప్పించి.. ఆయకట్టుకు నీళ్లందిస్తానని ఎమ్మెల్యే హోదాలో జేసీ దివాకర్‌రెడ్డి అనేక సందర్భాల్లో ప్రకటించారు. జేసీ దివాకర్‌రెడ్డి చేసిన ప్రకటన జూటూరులో సర్వే నంబర్లు 1587 ఏ1, ఏ2, ఏ3బీ పరిధిలోని 18.68 ఎకరాల అసైన్డు భూమిని సాగుచేసుకుంటోన్న దళితుల్లో సరి కొత్త ఆశలు రేపాయి. కారణం.. ఆ భూములు చాగల్లు రిజర్వాయర్ పరిధిలోనివి కావడమే. చాగల్లు రిజర్వాయర్ నీటిని విడుదల చేస్తే తమ భూముల్లో బంగారం పండించుకుంటామని ఆ దళితులు ఆశించారు.
జేసీ ఎత్తుకు దళితుల ఆశలు చిత్తు
చాగల్లు రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని భూములను బినామీ పేర్లతో జేసీ దివాకర్‌రెడ్డి మూడేళ్లుగా నయానోభయానో తక్కువ ధరలకు భారీ ఎత్తున కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలోనే జూటూరులోని తన పొలాల సమీపంలో ఉన్న 18.68 ఎకరాల దళితుల భూములపై జేసీ కళ్లు పడ్డాయి. వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఎత్తు వేశారు.
ఈ క్రమంలోనే అసైన్‌మెంట్ చట్టంలోని లొసుగులు జేసీకి కలిసొచ్చాయి. ఆ భూములను జూలై 31, 1985న జూటూరు గ్రామానికి చెందిన తొమ్మిది మంది దళితులకు ప్రభుత్వం అసైన్‌మెంట్ చేసింది. పెన్నానది పక్కనే ఉన్న ఈ భూముల్లో దళితులు పంటలు పండించుంటున్నారు. కానీ.. ఉన్నట్టుండి హఠాత్తుగా జూలై 25, 2009న ఆ భూములను తాము సాగుచేసుకోలేమని, వాటిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని పెద్దపప్పూరు తహశీల్దార్‌కు దళితులు వినతిపత్రాన్ని సమర్పించుకున్నారు.
అసైన్డు చేసిన 24 ఏళ్ల తర్వాత వాటిని సాగుచేసుకోలేమని.. ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని దళితులు విజ్ఞాపన చేసుకోవడం వెనుక మాజీ మంత్రి జేసీ, ఆయన సోదరుడి ఒత్తిళ్లే కారణమని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. దళితులు విజ్ఞాపన చేసుకున్నదే తడవుగా వాటిని తహ శీల్దార్ స్వాధీనం చేసుకున్నారు. దళితులు సరెండర్ చేసిన వెంటనే.. ఖాళీగా ఉన్న ఆ భూములను కేటాయిస్తే, అందులో ఔషధ మొక్కలు పెంచి.. ఆయుర్వేద, హోమియోపతి, యునానీ మందులు తయారుచేస్తామని జేసీ దివాకర్‌రెడ్డి తన సోదరుడి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి ద్వారా సర్కారుకు ఓ ప్రతిపాదన చేయించారు. ఆ ప్రతిపాదనపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని అప్పటి కలెక్టర్ బి.జనార్దనరెడ్డి జూటూరు గ్రామ పంచాయతీకి లేఖ రాశారు. ఇందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆ గ్రామ పంచాయతీ కలెక్టర్‌కు స్పష్టీకరించింది.
చకా చకా కదిలిన ఫైళ్లు
అనంతపురం జిల్లాలో మంత్రి రఘువీరా వర్గీయుల చేతిలో 2009 నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తింటోన్న మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి దళితుల భూములను సొంతం చేసుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ క్రమంలో అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ ఒత్తిళ్ల వల్లే జేసీ అస్మిత్‌రెడ్డి చేసుకున్న ప్రతిపాదనను పరిశీలించాలని అప్పటి కలెక్టర్ బి.జనార ్ధనరెడ్డి పెద్దపప్పూరు తహశీల్దార్‌కు లేఖ రాశారు. దీనిపై తహశీల్దార్ స్పందిస్తూ.. ఆ భూములు సాగుచేసుకోవడం లేదని, వాటిని జేసీ అస్మిత్‌రెడ్డికి చెందిన అస్మిత్ బయోటెక్‌కు కేటాయించవచ్చునని కలెక్టర్‌కు నివేదించారు.
ఇదే అంశంపై అనంతపురం ఆర్డీవో గౌతమిరెడ్డి జూటూరు వెళ్లి భూములను పరిశీలించి.. వాటిని సాగుచేసుకోలేదని నిర్ధారించి, ఎకరం రూ.41 వేల చొప్పున అస్మిత్ బయోటెక్‌కు అప్పగించవచ్చునని కలెక్టర్‌కు ప్రతిపాదించారు. ఇదే ప్రతిపాదనలను డిసెంబర్ 1, 2010న అప్పటి కలెక్టర్ బి.జనార్ధనరెడ్డి ప్రభుత్వ పరిశీలనకు పంపారు. ఫిబ్రవరి, 2012లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎకరం రూ.50 వేల చొప్పున ఆ భూములను అస్మిత్ బయోటెక్‌కు కేటాయించాలని తీర్మానించారు.
ఆ మేరకు ఆ భూములను అస్మిత్ బయోటెక్‌కు కేటాయిస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌చంద్రపునేఠా మార్చి 29, 2012న ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నం:210) జారీచేశారు. కానీ.. మార్కెట్‌ధరల ప్రకారం ఆ ప్రాంతాల్లో ఎకరం రూ.1.50 లక్షకుపైగా పలుకుతోంది. చాగల్లు రిజర్వాయర్ కోసం చేసిన భూసేకరణలో కూడా రైతులకు ఎకరానికి రూ.1.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. ప్రభుత్వం ఈ అంశాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కారుచౌకగా అత్తెసరు ధరకే అస్మిత్ బయోటెక్‌కు భూములను కేటాయించడం గమనార్హం. రెండేళ్ల క్రితం ప్రభుత్వం కేటాయించిన భూములను తక్షణమే స్వాధీనం చేసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి.. వాటిని తన భూముల్లో కలిపేసుకున్నారు. ఆ భూముల్లో ఔషధమొక్కలకు బదులుగా మామిడిమొక్కలు సాగుచేయడం కొసమెరుపు.
దళితులను దగాజేసి..!
Published Sat, Apr 26 2014 2:14 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement