సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు రోల్ మోడల్.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయ అరంగేట్రం చేశా. నన్ను గెలిపిస్తే ఎంపీ(లోక్‌సభ సభ్యుడు) అంటే ఎలా ఉండాలో చూపిస్తా.. ఐదేళ్లలో హిందూపురం లోక్‌సభ స్థానాన్ని వ్యవసాయపరంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయకపోతే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయను’ అని హిందూపురం లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో స్పష్టీకరించారు.
సాక్షి: పారిశ్రామికవేత్త అయిన మీరు రాజకీయాల్లోకి
ఎందుకు రావాలనుకున్నారు?
శ్రీధర్‌రెడ్డి: ఎస్కేయూలో ఎమ్మెస్సీ చదువుతున్నప్పుడే పోటీ పరీక్షలకు హాజరయ్యే వాడిని. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖలో ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం సాధించా. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడే.. మా సొంతూరుకు చెందిన పీజీ చదివిన యువకులు భవన నిర్మాణ పనులకు కూలికి వెళ్తుండటం చూసి చలించిపోయా. నా ఉద్యోగం వల్ల పది మందికీ ఉపాధి కల్పించడం సాధ్యం కాదు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 2000లో ఉద్యోగానికి రాజీనామా చేశా.
ఆ వెంటనే సాయి సుధీర్ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించా. నిర్మాణ పనులు చేపడుతూనే సంప్రదాయేతర ఇంధన వనరుల వైపు దృష్టి సారించా. అనంతపురం జిల్లాలో రాయదుర్గం వద్ద ఐదు మెగావాట్లు.. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి వద్ద 20 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పాను. ఇదే సమయంలో రాష్ట్ర విభజన ప్రక్రియ తెరపైకి వచ్చింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దేశంలో సంక్షేమాభివృద్ధి రంగాల్లో మేటిగా నిలిచిన రాష్ట్రం.. ఆయన మరణంతో అధఃపాతాళానికి పడి పోయింది. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారు. సీమాంధ్ర రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే శక్తి ఒక్క వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలోనే ఉంది. అభివృద్ధి పథకాలు చేపట్టాలంటే మేధస్సు ఉండాలి.. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మంచి మనసు ఉండాలి.
ఆ రెండు ఉన్న వాళ్లే గొప్ప పరిపాలన అందించగలరు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆ రెండు లక్షణాలు ఉండటం వల్లే ప్రపంచంలో గొప్ప పాలకుల్లో ఒకరుగా నిలిచారు. సంక్షోభ సమయంలో రాష్ట్రాన్ని గట్టెక్కించే సామర్థ్యం సమకాలీన రాజకీయాల్లో ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉంది. సీమాంధ్రే కాదు.. తెలంగాణ ప్రజలు కూడా ఇదే విశ్వసిస్తున్నారు. అందుకే వైఎస్సార్‌సీపీలో చేరా. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఓ సమిధగా మారాలనే రాజకీయ అరంగేట్రం చేస్తున్నా.
సాక్షి: ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది?
శ్రీధర్‌రెడ్డి: ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో గొప్ప పాలకుడిని చూస్తున్నారు కాబట్టే వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తోన్న నన్ను గుండెల్లో పెట్టుకుంటున్నారు. అపూర్వంగా ఆదరిస్తోన్న ప్రజలకు సేవ చేయడానికి నా జీవితాన్ని అంకితం చేస్తా. హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలోని 32 మండలాలు వర్షాభావ ప్రాంతాలే. 75 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారే. దేశంలో అత్యల్ప వర్షపాతం ఈ ప్రాంతంలోనే నమోదవుతుంది. నల్లమాడ మండలంలో నర్సింగాయపల్లి అనే కుగ్రామంలో జన్మించా. రైతులు, రైతు కూలీల కష్టాలు దగ్గరి నుంచి చూశా. దుర్భిక్షం నుంచి రైతులను, రైతు కూలీలను గట్టెక్కించే ప్రణాళిక నా వద్ద ఉంది. హంద్రీ-నీవా రెండో దశ ద్వారా లోక్‌సభ నియోజకవర్గంలో 2.34 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చు. చెరువులను నీటితో నింపవచ్చు. భూగర్భ జలాలను పెంపొందించవచ్చు. ఐదేళ్లలో హంద్రీ-నీవా రెండో దశను కచ్చితంగా పూర్తి చేస్తాం. ఈ ప్రాంతంలో ఏడాదికి 360 రోజులు ఎండ ఉంటుంది. సౌర విద్యుదుత్పత్తికి అత్యంత అనుకూలమైన ప్రాంతం.
అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాంతంలో సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తా. చౌక ధరకు భూమి లభిస్తుంది. మానవ వనరులకు కొదువ లేదు. బెంగళూరుకు అత్యంత సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా సులభంగా అభివృద్ధి చేయవచ్చు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం ఇచ్చే రాయితీల ఆధారంగా బెంగళూరులోని పరిశ్రమలను హిందూపురం ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నిస్తా. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హిందూపురం ప్రాంతంలో నవరత్న సంస్థలైన బీడీఎల్(భారత్ దైనిక్స్ లిమిటెడ్), బీఈఎల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్), ఈసీఐఎస్(ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), హెచ్‌ఏఎల్ (హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్)లు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి 2008లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ పరిశ్రమలు తక్షణం ఏర్పాటయ్యేలా ఒత్తిడి తెస్తా. నియోజకవర్గంలో కనీసం లక్ష మంది నిరుద్యోగ యువకులకు ఐదేళ్లలో ఉపాధి కల్పించకపోతే 2019 ఎన్నికల్లో పోటీ చేయను.
సాక్షి: హిందూపురం లోక్‌సభ పరిధిలో అధిక శాతం మంది చేనేత పరిశ్రమపై ఆధారపడ్డారు. గిట్టుబాటు ధరలు దక్కక పోవడం వల్ల సంక్షోభంలో పడిన చేనేత పరిశ్రమను ఎలా ఆదుకుంటారు?
శ్రీధర్‌రెడ్డి: హిందూపురం, సోమందేపల్లి, ముద్దిరెడ్డిపల్లి, తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో చేనేత కార్మికులున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై వారికి శిక్షణ ఇప్పించే కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తా. ధర్మవరంలో చేనేత బ్యాంకును ఏర్పాటు చేయిస్తా. ముడి పదార్థాలైన రేషం, అద్దకం రంగులు వంటి వాటిపై రాయితీపై ఆ బ్యాంకు ద్వారానే నేత కార్మికులకు అందజేయిస్తా. దీని వల్ల ముడిసరుకులు తక్కువ ధరలకే అందుతాయి. దేశంతో పాటూ విదేశాలకు ధర్మవరం పట్టుచీరలను ఎగుమతి చేయడం, డిమాండ్ వచ్చేలా చూస్తా. గిట్టుబాటు ధర దక్కేలా చూడటమే కాకుండా.. చేతినిండా పని కల్పిస్తా.
సాక్షి: ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయని భావిస్తున్నారు?
శ్రీధర్‌రెడ్డి: అభివృద్ధి.. సంక్షేమం రెండింటినీ సమపాళ్లలో అమలు చేస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన మేనిఫెస్టోలో అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఈ మేనిఫెస్టో రాష్ట్రంలో మళ్లీ రాజశేఖరుని సువర్ణ యుగాన్ని తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రజలు విశ్వసిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలే నన్ను గెలిపిస్తాయి.
ఎంపీ అంటే ఎలా ఉండాలో చూపిస్తా
Published Wed, Apr 30 2014 2:50 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement