నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్: ప్రతి ఒక్కరికీ కూడు, గుడ్డతో పాటు గూడు కల్పించాలనే ఉద్దేశంతో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో లక్షలాది మందికి సొంతింటి కల నెరవేర్చారు. అందులో భాగంగా నెల్లూరు శివారులోని కొత్తూరులో వైఎస్సార్ నగర్ పేరుతో 180 ఎకరాల్లో 6,468 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కాలనీకి మహానేత వైఎస్సార్ శంకుస్థాపన చేయగా, 2008లో ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది.
ఈ కాలనీ నిర్మాణానికి రూ.69.84 కోట్లు కేటాయించారు. అసలు సమస్య ఇక్కడ నుంచే మొదలైంది. నిధులపై ‘బాస్’ అనుచరులు కన్నేశారు. కాంట్రాక్టర్ల అవతారమెత్తి పనులు చేజిక్కించుకున్నారు. క్లాస్-4 కాంట్రాక్టర్‌గా గుర్తింపు ఉన్నవారికే ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పజెప్పాల్సి ఉండగా పలుకుబడి కలిగిన వారు, బాస్ అనుచరులు 43 మంది నామినేషన్ విధానంలో పనులను దక్కించుకున్నారు. ఒక్కో ఇంటిని రూ.88 వేలతో నిర్మించేలా, బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.53 వేలు కేటాయించగా, రూ.30 వేలు బ్యాంకు లోను మంజూరైంది. లబ్ధిదారుడు రూ.5 వేలు చెల్లిం చాలని నిర్దేశించారు.
‘బూడిద’రాళ్లతో నిర్మాణం: ఇళ్ల నిర్మాణంలో బాస్ అనుచరులు నిబంధనలకు నీళ్లు వదిలేశారు. బూడిద పోసి నాసిరకంగా తయారుచేసిన రాళ్లతో గోడలు కట్టారు. కాంక్రీట్ మిక్సింగ్, స్టీల్ వినియోగంలోనూ ప్రమాణాలు పాటించలేదు. హడావుడిగా 2,449 ఇళ్లు శ్లాబులెవల్, 348 రూఫ్ లెవల్, 2,256 లింటిల్ లెవల్, 763 ఇళ్లను బేస్‌మెంట్ లెవల్‌లో నిర్మించి ప్రభుత్వం నుంచి రూ.28 కోట్లు డ్రా చేశారు. ఇన్ని కోట్లు వెచ్చించినా నిర్మాణం నాసిరకంగా జరగడంతో ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. నిర్మాణ సమయంలోనే కొన్ని ఇళ్ల శ్లాబులు కూలిపోగా, చాలా ఇళ్ల గోడలు బీటలు వారాయి.
మరికొన్ని కూలేందుకు సిద్ధంగా ఉండడంతో వాటిలో చేరేందుకు లబ్ధిదారులు ససేమిరా అన్నారు. దీనిపై అప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకుల నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు ధర్నాలు నిర్వహించి కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అనంతరం ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. ఆ ఇళ్లను అధికార పార్టీ నేతలే నిర్మించడంతో ఇటు అధికారులు, అటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునేందుకు ముందుకు రాలేదు.
అదనపు నిధులు : వైఎస్సార్‌నగర్‌లో మిగిలిన ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.20 వేలు కేటాయించింది. ఈ పనులను 99 ప్యాకేజీలుగా విభజించిన అధికారులు గత ఏడాది టెండర్లు పిలిచారు. 40 మంది కాంట్రాక్టర్లు ముందుకు రావడంతో ఒక్కొక్కరికి 75 ఇళ్ల చొప్పున అప్పజెప్పారు. వీటికి సంబంధించి ఇప్పటికే రూ.1.40 కోట్ల బిల్లుల చెల్లింపు జరిగిందని అధికారులు చెబుతున్నారు. వీటి నిర్మాణమైనా ఎలా సాగుతుందోనని లబ్ధిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పనులను అధికారులు చిత్తశుద్ధితో పర్యవేక్షించి నాణ్యతతో సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పేదోళ్ల గూడునూ పిండేశారు !
Published Sun, Apr 27 2014 3:53 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement