సాక్షి, నెల్లూరు: సోమశిల పరిధిలో రెండో పంటకు సక్రమంగా నీరందేలా కనిపించడంలేదు. మే ఒకటిన పెన్నాడెల్టా ఆయకట్టుకు నీళ్లు వదలనున్నట్టు అధికారులు ప్రకటించినా ఇంతవరకూ కాలువ పూడికతీత పనుల ఊసేలేదు. దీంతో వదిలిన కాస్త నీళ్లు ఆయకట్టుకు చేరడం, పంట పండడం సాధ్యమయ్యే పనికాదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. స్టేట్‌లెవల్ కమిటీ ఫర్ వాటర్ మేనేజ్‌మెంట్ ఉత్తర్వుల మేరకు సోమశిల రిజర్వాయర్ కింద రెండో పంటకు కేవలం లక్షా 85 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లివ్వాలని ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. జిల్లా సాగునీటి సలహామండలి తీర్మానం మేరకు మే ఒకటిన సోమశిల నుంచి నీటిని విడుదల చేయనున్నారు. పెన్నాడెల్టా పరిధిలోని మొ త్తం 2.43 లక్షల ఎకరాలకు గాను కేవలం 1.85 లక్షల ఎకరాలకు మాత్రమే రెండో పంటకు నీళ్లు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో 60 వేల ఎకరాలకు నీళ్లందే పరిస్థితి లేదు. రెండోపంటకు నీళ్లొస్తాయనే ఆశతో ఉన్న రైతులకు నిరాశ మిగలనుంది. మరోవైపు రెండోపంటకు నీళ్లిచ్చే కాలువల్లో పూడికతీత పనులు సకాలంలో పూర్తిచేస్తామని అధికారులు ఇచ్చిన హామీలు నీటిమూటలుగానే మిగలనున్నాయి. సకాలంలో పనులు పూర్తయ్యేలా కనిపించడంలేదు.
రెండో పంటకు నీళ్లివ్వనున్న సంగం, పెన్నాడెల్టా పరిధిలోని కొవడలూరు, విడవలూరు, అల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, టీపీగూడూరు, ముత్తుకూరు, సర్వేపల్లి ప్రాంతాల్లో కాలువ పూడికతీత పనులకు సంబంధించి మొత్తం 340 పనులను రూ.2.60 కోట్లతో చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.ఈ నెల 21న టెండర్ ప్రక్రియ మొదలు పెట్టా రు. ఇంకా టెండర్లు ఓపన్ చేయనేలేదు. అవి ఖరారై ఎప్పటికి పను లు మొదలుపెడతారో కూడా తెలియడంలేదు. ఏప్రిల్ 15 నాటికి పంటకోతలు పూర్తయిన మరుక్షణం ఆయకట్టు పరిధిలో కాలువ పూడికతీత పనులు ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తిచేయాల్సి ఉంది.
అయితే తాజాగా ఎన్నికల సీజన్ కావడంతో ఎన్నికల కమిషన్ అనుమతితో పనులు చేయాల్సి ఉంది. అన్ని అనుమతులు తీసుకొని నీటి విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కాని టెండర్ల ప్రక్రియ కూడా పూర్తికాలేదు. మరోవైపు మే ఒకటిన నీటివిడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. అసలే నామమాత్రపు ఆయకట్టుకు నీళ్లిస్తున్న అధికారులు మరోవైపు కాలువ పూడికతీత పనులను చేపట్టకపోతే ఆ ఆయకట్టు కూడా పూర్తిస్థాయిలో పంటపండే పరిస్థితి ఉండదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
సాగు సాగేనా?
Published Wed, Apr 30 2014 2:58 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement