సాక్షి, నెల్లూరు : వచ్చే నెల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ ప్రభా వం జిల్లా రాజకీయాలపై కూడా పడనుంది. ఎలాగైనా సరే సీమాంధ్రలో పొత్తును తెగతెంపులు చేసుకుంటేనే మంచిదని టీడీపీ కోరుకుంటుండగా, వేచి చూద్దామనే ధోరణిలో బీజేపీ ఉంది. చివరి క్షణంలో ఎటొచ్చి ఎటు పోతుందనే ఉద్దేశంతో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను రంగంలోకి దింపేం దుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా నేతలు గురువారం అత్యవసరంగా సమావేశం కావడంతో పాటు ఎన్నికల కదనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా అభ్యర్థులను ఖరారు చేశారు. ప్రస్తుతానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి బుధవారం నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
సర్వేపల్లి నుంచి పోటీకి సిద్ధమైన సోమిరెడ్డి
నిన్నమొన్నటి వరకు నెల్లూరురూరల్ స్థానం నుంచి మినహా మరెక్కడా పోటీ చేయనని భీష్మించుకు కూర్చున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎట్టకేలకు సర్వేపల్లి నుంచే పోటీకి సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా గురువారం అల్లీపురంలోని ఆయన నివాసంలో తొలుత నెల్లూరురూరల్ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సహకరించేది లేదని ఖరాకండిగా తెల్చిచెప్పగా సోమిరెడ్డి వారిని సముదాయించినట్లు తెలిసింది. అధిష్టానం చెప్పినట్లుగా నడుచుకోవాలని, ఇష్టం లేనప్పటికీ బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందేనని ఆయన చెప్పినట్టు సమాచారం.
సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గ నేతలతో సమావేశమై ప్రధాన ప్రత్యర్థి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఢీ కొనేందుకు అవసరమయ్యే సూచనలు చేసినట్లు సమాచారం. ప్రత్యర్థి బలహీనతలు, మన బలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి గెలుపే ధ్యేయంగా కృషి చేయాలని చెప్పినట్లు తెలిసింది. అయితే బీజేపీతో పొత్తు బెడిసి కొడితే నెల్లూరురూరల్ నుంచి కూడా నామినేషన్‌ను దాఖలుచేసే ఆలోచన ఆయనకు లేకపోలేదు.
పొత్తుపై నీలిమేఘాలు
Published Fri, Apr 18 2014 3:25 AM | Last Updated on Sat, Oct 20 2018 6:07 PM
Advertisement