అయిష్టంగానే.. | somireddy contesting from nellore district | Sakshi
Sakshi News home page

అయిష్టంగానే..

Published Thu, Apr 17 2014 4:31 AM | Last Updated on Mon, Oct 22 2018 8:50 PM

somireddy contesting from nellore district

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ టికెట్ ఇస్తేనే ఎన్నికల్లో పోటీకి దిగుతానని తెగేసి చెప్పిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చంద్రబాబు బుజ్జగింపు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అవసరాలపై ఇచ్చిన హామీతో మెట్టు దిగారు. ‘మీ దయ నా ప్రాప్తం’’ అనేలా తన పాత నియోజకవర్గం సర్వేపల్లి నుంచే పోటీకి సిద్ధమయ్యారు. ఈనెల 19వ తేదీ నామినేషన్ దాఖలు చేయడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు.

ఈసారి ఎన్నికల్లో నియోజకవర్గం మారాలనుకున్న చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు రూరల్ మీద గురిపెట్టిన విషయం తెలిసిందే. రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడానికి ప్రత్యామ్నాయంగా తన ఈ కోరిక తీర్చాలని ఆయన చంద్రబాబును కోరడం.. ఓస్ ఇంతేనా అయితే ఓకే అని ఆయన చెప్పేయడం జరిగిపోయాయి. జిల్లా తెలుగుదేశం పార్టీలోని అంతర్గత కలహాలు, బీజేపీతో తెలుగుదేశంకు ఉన్న రాజకీయ అవసరం రీత్యా నెల్లూరు రూరల్ టికెట్ సోమిరెడ్డి చేయి దాటిపోయింది.
 
 కమలనాథులను ఒప్పించి వారిని సర్వేపల్లి, లేదా గూడూరు స్థానాలకు వెళ్లగొట్టేందుకు సోమిరెడ్డి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో ఆయన చంద్రబాబు మీద ఆగ్రహించి అలక పాన్పు ఎక్కడం, ఎంపీలు సుజన చౌదరి, సీఎం రమేష్ బుజ్జగించడం జరిగాయి. సర్వేపల్లి మినహా మరో ప్రత్యామ్నాయం లేదనీ, ఎన్నికలకు అవసరమైన అన్ని అవసరాలు తాను సమకూరుస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో చివరకు చంద్రమోహన్‌రెడ్డి సరేనన్నారు. మంగళవారం రాత్రి కుదిరిన ఈ ఒప్పందం అనంతరం సోమిరెడ్డి సర్వేపల్లి నుంచే పోటీ చేయడానికి మానసికంగా సిద్ధమయ్యారు. హైదరాబాదు నుంచే తన మద్దతుదారులు, పార్టీ ముఖ్యులకు ఫోన్లు చేసి సర్వేపల్లి నుంచే పోటీ చేస్తాననే విషయం చెప్పారు.
 
 గురువారం ఉదయం అల్లీపురంలోని తన ఇంట్లో పార్టీ ముఖ్యు నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. మండలాల వారీగా నాయకులు, కేడర్‌ను మళ్లీ ఎన్నికలకు సిద్ధం చేసి వెనువెంటనే ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 19వ తేదీ నామినేషన్ దాఖలు చేయడానికి ఆయన నిర్ణయించారు. నెల్లూరు రూరల్ టికెట్ దక్కకపోయినా సర్వేపల్లి నుంచి పోటీచేయడానికి అవసరమైన సరంజామా సంపాదించడానికే సోమిరెడ్డి ఈ అసంతృప్తి రాజకీయం నడిపారనే ప్రచారం పార్టీవర్గాల్లో  జరుగుతోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement