సార్వత్రిక ఎన్నికల పొత్తులో భాగంగా జిల్లాలో నెల్లూరు రూరల్ టీడీపీలో అసమ్మతి నిరసనలు వెల్లువెత్తాయి. వలస నేతలకు సీట్లు కేటాయిస్తుండటంపై ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు ఆవేశంలో ఉన్నారు.
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల పొత్తులో భాగంగా జిల్లాలో నెల్లూరు రూరల్ టీడీపీలో అసమ్మతి నిరసనలు వెల్లువెత్తాయి. వలస నేతలకు సీట్లు కేటాయిస్తుండటంపై ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు ఆవేశంలో ఉన్నారు. తాజాగా నెల్లూరు రూరల్‌ను బీజేపీకి కేటాయించడంపై మండిపడుతున్నారు. నెల్లూరు రూరల్ సీటును బీజేపీకి కేటాయించవద్దనే డిమాండ్‌తో మంగళవారం టీడీపీ కార్యకర్తలు పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
ఎన్‌టీఆర్ అమర్ రహే, చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నిరసనకారులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. రూరల్ నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కిలారి వెంకటస్వామినాయుడు కార్యకర్తలకు సర్ది చెప్పడంతో వెనుదిరిగారు. కిలారి మాట్లాడుతూ రూరల్ టికెట్‌ను పార్టీ అధినాయకత్వం ఏకపక్షంగా బీజేపీకి కేటాయించడాన్ని తప్పుబట్టారు. కార్యకర్తల ఆవేదనను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకుపోతామన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టకుండా పొత్తులో భాగంగా వేరే పార్టీలకు కేటాయిస్తునందున కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినాయకత్వం అలోచించి ఈ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థులకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కాగా పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు కల్పించుకోవాల్సి వచ్చింది.