సాక్షి, అనంతపురం : జిల్లా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాల రాజుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇతర పార్టీల నుంచి వస్తున్న వారికే అధినేత ప్రాధాన్యత ఇస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అనంతపురం ఎంపీ టికెట్‌ను జేసీ దివాకరరెడ్డికి కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధినేతతో తాడోపేడో తేల్చుకునేందుకు అనంతపురం మునిసిపల్ మాజీ చైర్మన్ ప్రభాకర్ చౌదరి సిద్ధమయ్యారు.
వివరాల్లోకి వెళితే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో బెర్తులు ఖాళీగా లేకపోవడంతో కొందరు కాంగ్రెస్ నేతలు టీడీపీలోకి వలస బాట పడుతున్నారు. ఇదే క్రమంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం సాగుతోంది. జేసీ బ్రదర్స్ పార్టీలో చేరాక అనంతపురం పార్లమెంట్ టికెట్‌ను జేసీ దివాకరరెడ్డికి ఇచ్చే అంశంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
దీంతో ముందు నుంచి అనంతపురం పార్లమెంట్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ప్రభాకర్ చౌదరి.. తన అనుచరులతో కలిసి చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు రెండ్రోజుల్లో హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అనుచరులకు చెప్పినట్లు తెలిసింది. ప్రభాకర్ చౌదరి మొదట్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ జేసీ దివాకరరెడ్డిని వ్యతిరేకించి ఆ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 1999లో ఆ పార్టీ తరఫున మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికై తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూనే పరిటాల రవికి వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహించాడన్న ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి.
ఈ క్రమంలో 2004లో అనంతపురం అసెంబ్లీ టికెట్ ప్రభాకర్ చౌదరికి వస్తుందని ఆయన అనుచరులంతా భావించినా అప్పట్లో పరిటాల రవి అడ్డుపడడంతో మాజీ రాజ్యసభ సభ్యుడు కేఎం సైఫుల్లా కుమారుడు రహంతుల్లాకు టికెట్ దక్కింది. దీంతో కలత చెందిన ప్రభాకర్ చౌదరి టీడీపీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో 25 వేల ఓట్ల వరకు సాధించారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో టీడీపీ మద్దతుదారుల ఓటమి కోసం పని చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్న కొంత కాలానికే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ‘అవే’ స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఫ్యాక్షన్‌కు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. అనంతపురం పార్లమెంట్ స్థానానికి టికెట్ ఇస్తానని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో తిరిగి ప్రభాకర్ చౌదరి టీడీపీలో చేరినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన జేసీ బ్రదర్స్‌ను టీడీపీలో చేర్చుకునేందుకు బాబు ఆసక్తి చూపుతుండడంతో పాటు అనంతపురం పార్లమెంట్ టికెట్ జేసీ దివాకరరెడ్డికి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుండడంపై ప్రభాకర్ చౌదరి అసంతృప్తితో ఉన్నారు. తనకు అన్యాయం జరిగితే గతంలో పార్టీకి నష్టం కలిగించినట్టే ఈ సారి కూడా చేయాల్సి వస్తుందన్న సంకేతాలిచ్చి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకునేందుకు సోమవారం తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.