అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : చాగల్లు రిజర్వాయర్‌కు నీటి విడుదలపై రాజకీయం చోటుచేసుకుంది. నీటిని తరలించుకుపోయేందుకు మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి పట్టు బిగించగా, తన అనుమతి లేకుండా ఎలా విడుదల చేస్తున్నారంటూ మరో ముఖ్య ప్రజాప్రతినిధి అధికారులపై శివమెత్తుతున్నారు. అదనపు నీటి కోసం వీరి మధ్య సాగుతున్న అధిపత్య పోరులో వారు నలిగి పోతున్నారు. దీంతో వారు మూకుమ్మడి సెలవుపై వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మహానేత చలవతో జిల్లా తాగునీటి అవసరాల కోసం వస్తున్న అదనపు జలాల కోసం రాజకీయాలు చేస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఓట్లు దండుకునే ఎత్తుగడే తప్ప, చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమాన్ని వారు ఆకాంక్షించడం లేదన్నది ఆ నేతల చర్యలు చెబుతున్నాయి. వాస్తవానికి పీఏబీఆర్‌కు వస్తున్న అదనపు జలాల కుడి కాల్వ కింద ఉన్న రైతులకు, జిల్లా ప్రజలు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలి.
అలాగే ఏయే ప్రాంతానికి ఎంత నీరు వాడాలన్నది సాగునీటి సలహా మండలి(ఐఏబీ) చైర్మన్, జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి మాత్రం తన నియోజకవర్గంలోని చాగల్లుకు అదనపు జలాల్లోంచి 1.5 టీఎంసీలు వదలాలని ప్రభుత్వం నుంచి జీవో తెచ్చుకున్నారు. ఐఏబీ చైర్మన్, హెచ్చెల్సీ అధికారులతో చర్చించకుండానే ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. తనను డమ్మీని చేస్తున్నారని ఐఏబీ చైర్మన్, కలెక్టర్ చెప్పడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. జేసీ రాజకీయ బలంతో చివరకు శుక్రవారం నుంచి చాగల్లుకు నీటి విడుదల చేశారు.
ఒక టీఎంసీ నీరు చాగల్లుకు చేరుతాయా?
ఈ ఏడాది అదనపు కోటాలో చివరిసారిగా విడుదల చేసిన 2 టీఎంసీలు శనివారంతో పూర్తవుతున్నాయి. ప్రస్తుతం గార్లదిన్నె మండలంలోని మిడ్‌పెన్నార్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇంకా మిడ్‌పెన్నార్ సౌత్ కెనాల్ కింద వెనుకదును కింద సాగైన పంటలకు ఒకటి, రెండు తడులు అందించాల్సి ఉంది. దీంతో రిజర్వాయర్‌లో 1 టీఎంసీ మాత్రమే నిల్వ ఉంటుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో మేరకు పెన్నానది ద్వారా మాత్రమే చాగల్లుకు నీటిని పంపాలి.
రానున్న వేసవిలో జిల్లాతో పాటు, వైఎస్సార్ జిల్లాలో కూడా తాగునీటి ఇబ్బందులు పరిష్కరించాల్సిన బాధ్యత ఇక్కడి అధికారులపైనే ఉంటుంది. పులివెందులకు మిడ్‌పెన్నార్ నుంచే తాగునీటిని అందించాల్సి ఉంది. ఈ మేరకు రానున్న వేసవిలో 5.715 టీఎంసీలు అవసరమవుతాయని లెక్కలు కట్టారు. ప్రస్తుతం మిడ్‌పెన్నార్ 1 టీఎంసీలు, పీఏబీఆర్‌లో 2 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. తుంగభద్ర నుంచి వస్తున్న అదనపు కోటా కూడా ఆగిపోనుంది. హంద్రీ నీవా జలాలు ఎప్పుడు ఆగిపోతాయో చెప్పలేని పరిస్థితి. ఈ సమయంలో నదీ ద్వారా వదలడం వలన నీటి వృథా అవుతుందే తప్పా రైతులకు, ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరదని అధికారులు పేర్కొంటున్నారు.
నీటి రాజకీయం
Published Fri, Jan 17 2014 2:41 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement