కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. టీడీపీలో చేరడం ఇక లాంఛనమే. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇవ్వడాన్ని తాడిపత్రిలోని ఆ పార్టీ నేతలు వ్యతిరేకించలేదు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. టీడీపీలో చేరడం ఇక లాంఛనమే. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇవ్వడాన్ని తాడిపత్రిలోని ఆ పార్టీ నేతలు వ్యతిరేకించలేదు. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామంటూ మంగళవారం చంద్రబాబు వద్ద తాడిపత్రి నేతలు ప్లేటు ఫిరాయించడం టీడీపీ నేతలనే విస్మయానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం జిల్లా టీడీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమైన విషయం విదితమే.
జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి తీసుకోవాలన్న తన నిర్ణయాన్ని చంద్రబాబు ఆ సమావేశంలో వివరించారు. చంద్రబాబు నిర్ణయం పరిటాల సునీత, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులును వెనకడుగు వేసేలా చేసింది. ఇన్నాళ్లూ జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన వారు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడం ఆ పార్టీ నేతలను ఆశ్చర్యపరచింది. ఈ క్రమంలోనే తాడిపత్రి ప్రాంత నేతలను పిలిపించి.. సర్దిచెప్పి జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి చేర్చుకోవాలని పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు .. చంద్రబాబుకు సూచించడం గమనార్హం. ఆ మేరకు మంగళవారం తాడిపత్రి ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలను హైదరాబాద్‌కు చంద్రబాబు రప్పించారు.
యాడికి, పెదపప్పూరు, పెద్దవడుగూరు, తాడిపత్రి రూరల్, తాడిపత్రి పట్టణానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు విడివిడిగా సమావేశమయ్యారు. జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి తీసుకోవాలన్న నిర్ణయంపై ఇటీవల తాడిపత్రిలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు విగ్రహావిష్కరణ సభలో ఆ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నిర్వహించే సమావేశంలో తాడిపత్రి నేతలు ధిక్కారస్వరం విన్పించడం ఖాయమనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు అంచనా వేశారు. కానీ.. ఒకరిద్దరు నేతలు మినహా జేసీ బద్రర్స్‌ను పార్టీలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించకపోవడం టీడీపీ నేతలనే విస్మయానికి గురి చేసింది. వీరు ప్లేటు ఫిరాయించడం వెనుక మర్మమేమిటన్నది అంతుచిక్కడం లేదు.
తాడిపత్రి నేతలు కూడా వ్యతిరేకించని నేపథ్యంలో జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరిక లాంఛనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ.. రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన జేసీ దివాకర్‌రెడ్డి కొత్తపార్టీ పెట్టేందుకు కసరత్తు చేస్తోన్న అపద్ధర్మ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో మంగళవారం సమావేశం కావడం.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించడం రాజకీయ విశ్లేషకుల మెదళ్లకు పనిపెట్టింది. అనంతపురం టీడీపీ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించిన తరుణంలో జేసీ.. కిరణ్‌తో సమావేశం కావడం హాట్‌టాపిక్‌గా మారింది.