సాక్షి ప్రతినిధి, అనంతపురం : కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి పాచిక పారలేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రచ్చబండలో ముఖ్యమంత్రితో ‘చాగల్లు’ రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయించి.. పునర్‌వైభవం సాధించాలని ఆరాటపడ్డారు. తాడిపత్రిలో పర్యటిస్తే.. తాము బహిష్కరిస్తామని మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ తెగేసి చెప్పడంతో సీఎం వెనక్కి తగ్గారు.
మరోసారి శింగనమల నియోజకవర్గంలోనే రచ్చబండ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. రెండేళ్లుగా సీఎంను రప్పించుకునేందుకు జేసీ విఫలయత్నం చేస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ మంత్రులే పైచేయి సాధిస్తున్నారు. ముఖ్యమంత్రి ఈనెల 11 నుంచి 26 వరకు మూడో విడత ‘రచ్చబండ’ నిర్వహిస్తోన్న విషయం విదితమే. జిల్లాలో 19 లేదా 24 తేదీల్లో రచ్చబండ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్‌ను కోరింది.
ఇది పసిగట్టిన జేసీ దివాకర్‌రెడ్డి రచ్చబండలో భాగంగా తన నియోజకవర్గంలో పర్యటించాలని కోరారు. ఇందుకు సీఎం అంగీకరించారు కూడా. సీఎం చేతుల మీదుగా చాగల్లు రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయడంతోపాటు తాడిపత్రిలో మున్సిపల్ కార్యాలయం, కాంప్లెక్స్‌లను ప్రారంభింపజేసి, నియోజకవర్గంపై పట్టు సాధించాలని జేసీ ఆరాటపడ్డారు. ఈ క్రమంలోనే చాగల్లుకు హంద్రీ-నీవా నీటిని తరలించేందుకు నవంబర్ 30న ప్రయత్నించారు. కానీ.. ఇందుకు అనుమతి లేకపోవడంతో అధికారులు నీటి విడుదల ఆపేశారు. తాడిపత్రిలో పర్యటించేందుకు సీఎం అంగీకరించడాన్ని తెలుసుకున్న మంత్రులు రఘువీరా, శైలజానాథ్ మండిపడ్డారు.
తాడిపత్రిలో పర్యటిస్తే.. తాము బహిష్కరిస్తామని సీఎంకు స్పష్టం చేశారు. దాంతో.. సీఎం వెనక్కి తగ్గారు. తన నియోజకవర్గంలో పర్యటించాలని శైలజానాథ్ పట్టుబట్టారు. గతంలో నిర్దేశించిన షెడ్యూల్‌తో నిమిత్తం లేకుండా ఈ నెల 22న శింగనమలలో పర్యటించాలని కోరారు. ఇందుకు సీఎం అంగీకరించారు. ఆ మేరకు శింగనమలలో రచ్చబండ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కిరణ్ 2011లో నిర్వహించిన తొలి విడత రచ్చబండలో శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలంలో పర్యటించారు.
మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, మంత్రులు రఘువీరా, శైలజానాథ్ మధ్య ఆధిపత్య పోరుతో రెండో విడత రచ్చబండ పర్యటనను గతేడాది సీఎం కిరణ్ జిల్లాలో రద్దు చేసుకున్నారు. రెండో విడత రచ్చబండ సమయంలోనూ తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించాలంటూ సీఎంను జేసీ పట్టుపట్టారు.
అక్కడ పర్యటిస్తే.. తాము బహిష్కరిస్తామని మంత్రులు చెప్పడంతో అప్పట్లో ఏకంగా రచ్చబండ పర్యటననే జిల్లాలో రద్దుచేసుకోవడం గమనార్హం. కాగా సీఎం సభను తొలుత ఈ నెల 24 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నెల 23న సత్యసాయి జయంతి వేడుకలు ఉన్నందున.. పోలీసు సిబ్బంది అంతా అక్కడకు వెళ్తారని పోలీసు అధికారులు సెలవిచ్చారు. దీంతో శైలజానాథ్ కల్పించుకుని.. ముఖ్యమంత్రి పర్యటన కంటే ఉత్సవాలు అంత ముఖ్యమా అని వ్యాఖ్యానించడంతో ‘రచ్చబండ’ను ఈ నెల 22న నిర్వహించాలని ఖరారు చేశారు.
పారని జేసీ పాచిక!
Published Fri, Nov 15 2013 2:43 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement