
కాయ్ రాజా కాయ్!
- జిల్లాలో జూదగాళ్ల జోరు
- పండగ వేళ పందాల హోరు
- పేకాట, కోడిపందాల నిర్వహణకు యత్నం
- కోట్లలో చేతులు మారే అవకాశం
- ఈ ఏడాది ముందే రంగం సిద్ధం
- లోపాయికారీ ఒప్పందాలు, కళ్లు మూసుకుంటున్న పోలీసులు
- శివారు ప్రాంతాలు తోటలే వేదికలు
- మూడు జిల్లాల ఘనులే నిర్వాహకులు
సాక్షి, విశాఖపట్నం : సంక్రాంతి వచ్చిందంటే భారీ ఎత్తున జూదానికి తెర తొలగిందన్నమాటే. పండగ ముం దు, వెనుక రోజుల్లో పేకాట, కోడిపందాలు జిల్లాలో శ్రుతి మించిపోతాయన్న సంగతి తెలిసిందే. పండగ వేళ కోడిపందాలు, పేకాట డెన్‌లతో పాటు పొట్టేళ్ల పందాల స్థావరాలు లెక్కకు మించి సిద్ధమవుతాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. ఇందుకోసం పొరుగు జిల్లాల నుంచి బడాబాబులు వస్తుంటారు. మూడేళ్లుగా వీరు జోరు కొనసాగిస్తున్నారు. జూదం సాఫీగా సాగడానికి లక్షల్లో ముట్టజెబుతూ ఉండడంతో స్థానికులు కూడా సహకరిస్తున్నారు.
అవసరమైతే జిల్లా స్థాయిలోనో, లేదా రాజధాని స్థాయిలోనో ఒత్తిడి తెచ్చి వీటిని కొనసాగిస్తున్నారు. సాధారణంగా సంక్రాంతికి చేరువలో ఏర్పాట్లు చేసేవారు. ఈసారి వారం ముందే రంగంలోకి దిగారు. విశాఖతో పాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో అప్పుడే తిష్టవేసి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల శివారు ప్రాంతాలు, వాటికి సమీపంలోని తోటలను వేదికగా చేసుకుంటున్నారు.
ఆ మధ్య పేకాడుతున్న 34మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారంతా విజయనగరం వాసులే. రేబాకలో పోలీసులు దాడుల చేయగా 20కార్లు వదిలేసి జూదగాళ్లు పరారయ్యారు. డొంకాడ కొత్తూరులోనైతే కొందరు పోలీసులపై తిరగబడ్డారు. ఏటా వీరి జోరు కొనసాగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని, చర్యలు తీసుకోకుండా వీరిపై రకరకాల ఒత్తిళ్లు వస్తున్నాయని ఆరోపణలు వినవస్తున్నాయి.
ఇవీ వేదికలు
నర్సీపట్నం నియోజకవర్గం ఆక్షాయపేట, టి.కొత్తపల్లి, గొలుగొండ, జోగంపేట, జగ్గంపేట పాయకరావుటపేట నియోజకవర్గం ఎస్.రాయవరం, రేబాక, సీతారాంపురం పోలవరం గట్టు, చినదొడ్డిగల్లు, ఉపమాక, చందనాడ, లింగరాజుపాలెం, గుడివాడ, నామవరం, కొరుప్రోలు, పెద గుమ్ములూరు, వేంపాడు,డొంకాడ కొత్తూరు,చందనాడ,ఉపమాక
యలమంచిలి, రాంబిల్లి,ముగనపాక మండలాల్లోని పలు గ్రామాలు, చోడవరం, వి.మాడుగుల నియోజకవర్గాల పరిధిలో కొన్ని..
అనకాపల్లి నియోజకవర్గం తీడ, కన్నూరుపాలెం, భీమవరం, తాళ్లపాలెం, కూండ్రం, గోపాలపురం
పాడేరు నియోజకవర్గం మత్స్యపురం, నగిసిపల్లె, గుత్తలపుట్టు, డి.కింతలివీధి
అనంతగిరి మండలం గుమ్మకోట సమీప ప్రాంతంలో పెద్ద ఎత్తున పేకాట డెన్ ఏర్పాటుకు సన్నాహాలు.