సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజనకు గడువు దగ్గర పడినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యపై స్పష్టత మాత్రం రాలేదు. వివిధ శాఖల్లో ఉద్యోగుల సంఖ్యపై ఇప్పటికీ గందరగోళం నెలకొంది. రాష్ట్ర విభజన తేదీకి ఇక 22 రోజుల మాత్రమే గడువు ఉండటంతో కీలకమైన ఉద్యోగుల సంఖ్య, పోస్టుల సంఖ్య తేల్చడంపై ఆర్థిక శాఖ రెండు నెలలుగా తలమునకలైంది. కొన్ని శాఖల్లో మంజూరైన పోస్టులకన్నా ఎక్కువ ఉద్యోగులు పనిచేస్తుండగా మరికొన్ని శాఖల్లో మంజూరైన పోస్టుల కన్నా తక్కువ ఉద్యోగులున్నట్లు ఆర్థిక శాఖకు సమాచారం వచ్చింది. ఈ పోస్టుల సంఖ్య కచ్చితంగా తేలితే గానీ జిల్లాలు నిష్పత్తి లేదా జనాభా నిష్పత్తి ఆధారంగా ఇరు రాష్ట్రాలకు పోస్టుల పంపిణీ సాధ్యం కాదు. పోస్టులు పంపిణీ అయితే గానీ ఉద్యోగుల పంపిణీ సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ప్రతి శాఖ మంజూరైన పోస్టుల సంఖ్య, ఉద్యోగుల సంఖ్యను మరోసారి సరిచూడాలని శుక్రవారం అన్ని శాఖలకు సర్క్యులర్ మెమో జారీ చేసింది.
ఆర్థిక శాఖ (ఎస్‌ఎంపీసీ) రాష్ట్రంలో 10,40,905 పోస్టులను మంజూరు చేసింది. అయితే శాఖాధిపతుల నుంచి 9,89,087 మంది ఉద్యోగులే పనిచేస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో 50 వేలమంది ఉద్యోగులు ఏమయ్యారనే సమాచారం ఆయా శాఖల నుంచి రాలేదు. పోస్టులు ఖాళీగా ఉంటే ఆ విషయాన్ని పేర్కొనాలని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
మొత్తం 181 శాఖాధిపతులు, 51 శాఖలు మంజూరైన పోస్టులకన్నా ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం పంపించారు. అయితే పోస్టులు మంజూరు కాకుండా ఎక్కువమంది ఉద్యోగులు ఎలా పనిచేస్తున్నారో వివరాలు లేవు. దీంతో ఆర్థిక శాఖ మంజూరు చేయకుండా ఆయా శాఖలే స్వయంగా ఉత్తర్వులు జారీ ద్వారా పోస్టులు మంజూరు చేసుకుని ఉంటే ఆ వివరాలను తెలియజేయాలని మెమోలో కోరారు.
107 శాఖలు మాత్రం మంజూరైన పోస్టులకన్నా తక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం పంపించారు. తక్కువగా ఉద్యోగులు ఉండటానికి కారణాలు ఏమిటో తెలియజేయాల్సిందిగా ఆదేశించారు. మంజూరై ఖాళీగా ఉన్న పోస్టులను కూడా ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉన్నందున ఆ సమాచారాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని మెమోలో పేర్కొన్నారు.
ఉద్యోగుల సీనియారిటీ గురించి కూడా సరైన సమాచారం ఇవ్వడంలేదని ఆర్థిక శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని శాఖలు అదే సీనియారిటీలో ఒక ఉద్యోగికన్నా ఎక్కువమంది ఉద్యోగులను లేదా అసలు సీనియారిటీలే లేరని సమాచారం ఇచ్చాయి. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోను అంగీకరించేది లేదని ఆర్థిక శాఖ పేర్కొంది. కేటగిరీల వారీగా సీనియారిటీలను కూడా శాఖలు ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఉద్యోగుల సంఖ్య, పోస్టుల మంజూరు తుది లెక్కల కోసం ఈ నెల 13, 14, 15 తేదీల్లో శాఖాధిపతులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆర్థికశాఖ పేర్కొంది. ఈలోగా సమాచారాన్ని మరోసారి సరిచూడాలని, అలాగే ఆ సమాచారానికి పూర్తి బాధ్యత వహిస్తూ శాఖాధిపతులు సర్టిఫై చేయాలని పేర్కొన్నారు.