కాల్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోండి
కాకినాడ కలెక్టరేట్ : వివిధ శాఖల సమాచారం తెలుసుకునేందుకు, ప్రజా సమస్యలు, ఫిర్యాదులకు కలెక్టరేట్‌లో 18004253077 టోల్ ఫ్రీ నంబర్‌తో ఏర్పాటు చేసిన ఈ- పరిష్కారం కాల్ సెంటర్‌ను ప్రజలు సద్వినియోగించుకోవాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ కోరారు. ఈ- పరిష్కారం కాల్ సెంటర్ ద్వారా సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకూ కలెక్టరేట్ నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 31 మంది ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయగా వాటిలో కొన్నింటికి అక్కడికక్కడే కలెక్టర్ సమాధానం ఇచ్చారు. మరికొన్ని ఫిర్యాదులను సంబంధిత శాఖలకు బదిలీ చేసి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
‘గ్రీవెన్స్’కు 120 వినతులు
డయల్ యువర్ కలెక్టర్ అనంతరం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు డ్వామా సమావేశ హాలులో జిల్లాస్థాయి గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. కలెక్టర్ నీతూ ప్రసాద్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, అదనపు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ గ్రీవెన్స్ సెల్‌కు 120 మంది వివిధ సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సంపత్‌కుమార్, డీఈఓ శ్రీనివాసులు రెడ్డి, డీఎస్‌ఓ రవికిరణ్, పౌరసరఫరాల కార్పొరేషన్ డీఎం కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖరరాజు, డీపీఓ శ్రీధర్‌రెడి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సిరి, ఎస్‌ఎస్‌ఏ పీడీ చక్రధరరావు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.