కొనసాగుతున్న‘కాల్‌మనీ’ కార్యకలాపాలు | call me sex rocket continueing in guntur district | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న‘కాల్‌మనీ’ కార్యకలాపాలు

Published Mon, Aug 26 2019 9:01 AM | Last Updated on Mon, Aug 26 2019 9:24 AM

call me sex rocket continueing in guntur district - Sakshi

శ్రీనగర్‌ కాలనీకి చెందిన తిరుపతిరావు కొబ్బరి బొండాలు వ్యాపారం చేసుకుంటుంటారు. బావాజీ పేటకు చెందిన పిల్లా సింహాచలం, బి.నారాయణ, వాసు, చంద్రశేఖర్‌ అనే నలుగురు వ్యక్తులు రూ. 35 లక్షలు తిరుపతిరావుకు అప్పు ఇచ్చి రోజువారీ వడ్డీ వ్యాపారం చేయమన్నారు. ఆ అప్పును ఆయన తిరిగి చెల్లించినా ఇంకా రూ. 3 లక్షలు బకాయి పడ్డావని వేధిస్తున్నారు. ఈ మేరకు తిరుపతిరావు నగర సీపీకి ఫిర్యాదు చేశారు. ఆంధ్రా బ్యాంక్‌కు చెందిన 18 చెక్కులను, 13 ప్రామిసరీ నోట్ల తన నుంచి తీసుకున్నారని, ఇటీవల డబ్బు కోసం కొట్టారని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇలాంటి అనేక ఘటనలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నగర వ్యాప్తంగా కమిషనరేట్‌తోపాటు వివిధ పోలీసుస్టేషన్లలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో కాల్‌మనీ వ్యాపారుల అరాచకాలపై పోలీసు అధికారులకు పదుల సంఖ్యలో బాధితులు ఏకరువు పెడుతున్నారు.  

సాక్షి, అమరావతి/ కృష్ణా: విజయవాడ కాల్‌మనీ వడ్డీ వ్యాపారుల నేరాలు, ఘోరాలపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. రాజకీయ నాయకులు, సంపన్నులు నిర్లజ్జగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. తరచూ వేదికల మీద నీతులు చెప్పే కొందరు బడా నేతలు కాల్‌మనీ ముఠాకు నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. ఇటీవల వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంలో కాల్‌మనీ కోరల్లో చిక్కుకున్న బాధితులు తమను రక్షించాలంటూ విజయవాడ నగర కమిషనర్‌ను వేడుకుంటున్నారు. తీసుకున్న వడ్డీ డబ్బులు చెల్లించినా చెక్కులు, ప్రామిసరీ నోట్లు తిరిగి ఇవ్వకుండా మరింత బాకీ ఉన్నావు.. అది తీర్చాకే ఇస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని.. మరికొందరు కాల్‌మనీ వ్యాపారులు చిత్రహింసలకు సైతం గురిచేస్తున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రతి ఫిర్యాదును కాల్‌మనీ కేసుగా పరిగణించలేమని నగర కమిషనర్‌ స్వయంగా చెబుతున్నా.. మరోవైపు బాధితులు మాత్రం ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో అర్జీలు దాఖలు చేస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. 

చర్యలకు వెనుకడుగు.. 
2015 డిసెంబరులో వెలుగులోకి వచ్చిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ కేసుతో రాష్ట్రం అట్టుడుకింది. దాదాపు 1,952 ఫిర్యాదులు అందగా 105 కేసులు నమోదు చేశారు. ఇందులో 406 కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. మరో 993 కేసుల్లో ఇరువర్గాలు రాజీపడ్డారు. 97 తప్పుడు కేసులుగా గుర్తించారు. అవిపోగా ఇతరత్రా, పోలీసుస్టేషన్లలో ఉన్నవి 342. అయితే పోలీసు చర్యలకు భయపడి కొంత కాలం అజ్ఞాతంలో ఉన్న కాల్‌మనీ వ్యాపారులు.. మళ్లీ ఇప్పుడు చెలరేగిపోతున్నారు. చాలా మంది బాధితులను తమ కార్యాలయాలకు పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వడ్డీ, అసలు కట్టాలని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక ‘స్పందన’ కార్యక్రమంలో తమ బాధలను చెప్పుకుంటే వెంటనే పరిష్కారం లభిస్తుందన్న ధీమా రావడంతో ఇప్పుడిప్పుడే కాల్‌మనీ బాధితులు ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. అయితే పోలీసు అధికారులు కొన్నింటిపై శ్రద్ధ చూపుతున్నా.. మరికొన్నింటి ఫిర్యాదులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement