పేదలతో కాల్‌మనీ చెలగాటం | Call Money Is Bothering Poor People In Piduguralla | Sakshi
Sakshi News home page

పేదలతో కాల్‌మనీ చెలగాటం

Published Fri, Aug 23 2019 8:10 AM | Last Updated on Fri, Aug 23 2019 8:11 AM

Call Money Is Bothering Poor People In Piduguralla - Sakshi

సాక్షి, పిడుగురాళ్ల(గుంటూరు) : రోజు వారీ కూలీలు, చిరు ఉద్యోగులు, రోజు వారీ వ్యాపారులు, తోపుడు బండ్ల వారు ఇలా పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఓ రూపాయి సంపాదించాలని పెట్టుబడి కోసం, లేదంటే వారి కుటుంబాల అవసరాల కోసం వారాల లెక్క వడ్డీకి డబ్బులు తీసుకుని అసలు, వడ్డీ చెల్లించలేక నానా అవస్థలు పడుతున్న వైనం పిడుగురాళ్ల పట్టణంలో జరుగుతుంది. పట్టణంలోని మాచర్ల బస్టాండ్‌ సెంటర్‌ వద్ద ఓ దివ్యాంగురాలు ప్రైవేటు పాఠశాలలో ఆయాగా, వంట మనిషిగా పని చేస్తుంది. కుమార్తెకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారాల లెక్కన రూ.10 వేలు తీసుకుంది. సగం డబ్బులు చెల్లించింది. మధ్యలో తనకు ఆరోగ్యం బాగోలేక రెండు నెలలు ఆలస్యం కావడంతో వారాల లెక్క వడ్డీకి డబ్బులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు ఇంటిపైకి వచ్చి గతంలో చెల్లించిన డబ్బులు వడ్డీకే సరిపోయాయని, తిరిగి మళ్లీ నోటు రాసి మొదటి నుంచి చెల్లించాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

అదే విధంగా పట్టణంలోని ఆదర్శ కాలనీకి చెందిన షేక్‌ ఖాశిం అనే వ్యక్తి సున్నం బట్టీల్లో కూలి పనులు చేస్తుంటాడు. కుటుంబ అవసరాల కోసం రూ.10 వేలు వారాల లెక్క వడ్డీకి తీసుకున్నాడు. ఇతను కూడా సగానికి పైగానే అప్పు చెల్లించాడు. మధ్యలో ఇతనికి అనారోగ్యం కారణంగా ఓ నెల చెల్లించలేకపోవడంతో సదరు వడ్డీ రాయుళ్లు అతని ఇంటిపైకి వెళ్లి అతని పట్ల అసభ్య పదజాలంతో దూషించి అతన్ని భయబ్రాంతులకు గురి చేయడంతో అతను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక బిక్కుబిక్కు మంటూ ఉన్నాడు. ఇలా పట్టణంలో వందల సంఖ్యలో పేద, నిరుపేద, చిరువ్యాపారులు వడ్డీకి డబ్బులు తీసుకుని అధిక వడ్డీలు చెల్లించలేక నరకయాతన పడుతున్నారు. 

వారాల లెక్క ఇలా...
పట్టణంలోనే కాకుండా రాజమండ్రి, అనపర్తి, మండపేట ప్రాంతాల నుంచి కొంతమంది వడ్డీ వ్యాపారులు పిడుగురాళ్ల పట్టణంలో వారాల లెక్క వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరు ఒక్కొక్కరు 1000 మందికి రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు వారాల లెక్క వడ్డీలకు  తిప్పుతున్నారు. వీరు రూ.5 వేలు తీసుకున్న వారికి రూ.4900 ఇస్తారు. కాని వారు 12 వారాల్లో రూ.6 వేలు చెల్లించాలి. రూ.10 వేలు తీసుకున్న వారికి రూ.9800 ఇస్తారు. 12 వారాల్లో రూ.12 వేలు చెల్లించాలి. సుమారు నూటికి రూ.8 వడ్డీ వసూలు చేస్తున్నారు. మధ్యలో ఎవరైనా రెండు, మూడు వారాలు చెల్లించకుంటే అదనంగా మరో రూ.4 వడ్డీ వేసి రూ.12 వడ్డీ వసూలు చేస్తున్నారు. ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు, వేలిముద్రలు తీసుకుని వీరు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. 

అన్నీ అనధికారమే...
ఈ వడ్డీ వ్యాపారం చేసే వారు అన్నీ అనధికారికంగానే చేస్తున్నారు. ఎటువంటి లైసెన్సులు ఉండవు. ఓ చిన్న పుస్తకాన్ని వారి పేరుతో ప్రింట్‌ చేసి వారాల వివరాలు, వారానికి ఎంత కట్టాలి రాసి ఇస్తారు. అయితే వసూలు చేసే వ్యక్తులు చదువు రాని వారికి రాయకుండానే రాశామని చెప్పి మాయ చేస్తూ వారు పూర్తిగా చెల్లించినప్పటికీ ఇంకా చెల్లించాలంటూ వారి వద్ద నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.  దీనిపై పేద, మధ్య తరగతి ప్రజలు  ఆందోళన చెందుతున్నారు. కాల్‌మనీ వ్యాపారులపై  సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి బడుగు, బలహీన, చిరు వ్యాపారులను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ విషయమై పిడుగురాళ్ల పట్టణ సీఐ ఎ.సురేంద్రబాబును ‘సాక్షి’ వివరణ కోరగా కాల్‌మనీకి సంబంధించిన ఫిర్యాదులు తన దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ఖాళీ నోటుపై సంతకాలు పెట్టమంటున్నారు
కుటుంబ అవసరాల కోసం వారాల వారి దగ్గర రూ.10 వేలు అప్పు తీసుకుంటే సగానికి పైగానే చెల్లించాను. మధ్యలో ఓ నెల ఆరోగ్యం బాగోలేక చెల్లించలేకపోయాను. దానికే చెల్లించిన నగదు వడ్డీకి సరిపోయిందని, మళ్లీ రూ.10 వేలు చెల్లించాలని, దానికి గాను ఖాళీ నోటుపై సంతకాలు పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు. 
వై.కుమారి, పిడుగురాళ్ల, కాల్‌మనీ బాధితురాలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement