తీసుకున్న అప్పుకు ఓ వైపు వడ్డీలపై వడ్డీలు వసూలు చేస్తూ, మరో వైపు తనఖా పెట్టిన ఇంటి పట్టాను తన కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న వడ్డీ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని...
-వడ్డీవ్యాపారి ఇంటి వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకున్న బాధితులు
- వడ్డీ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని మనస్తాపం
- ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయిన వైనం
రేపల్లె(గుంటూరు జిల్లా): తీసుకున్న అప్పుకు ఓ వైపు వడ్డీలపై వడ్డీలు వసూలు చేస్తూ, మరో వైపు తనఖా పెట్టిన ఇంటి పట్టాను తన కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న వడ్డీ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగి విసిగిపోయిన కాల్‌మనీ బాధితులు సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లెలో సోమవారం చోటుచేసుకుంది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఏకలవ్య కాలనీకి చెందిన దాసరి వెంకట నాగేశ్వరమ్మ నాలుగేళ్ల క్రితం 6వ వార్డుకు చెందిన పొదిలి సత్యనారాయణ వద్ద రూ.1.50 లక్షలు అప్పు తీసుకుంది. నెలకు రూ.7,500 చొప్పున క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తోంది. అయినా ఇంకా రూ.4లక్షలు చెల్లించాలంటూ సత్యనారాయణ ఒత్తిడి తెస్తున్నారు.
మరో బాధితురాలు సజ్జా రజని అదే వ్యాపారి వద్ద మూడేళ్ల క్రితం రూ.లక్ష తీసుకుని నెలకు రూ.5,000 చొప్పున క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. అప్పు తీకుసున్న సమయంలో తనకున్న ఇంటిపట్టాను తాకట్టుపెట్టింది. తీరా చూస్తే తన స్థలాన్ని వడ్డీవ్యాపారి పొదిలి సత్యనారాయణ కుమార్తె పేర రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఉంది. అదేమని అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించాడు. విధిలేక వ్యాపారి ఇంటి ముందు పలుమార్లు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలో మూడు రోజుల క్రితం వడ్డీవ్యాపారి కుమారులు బాధిత మహిళలపై దాడి చేయడంతో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాళ్లరిగేలా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు చొరవ చూపడం లేదని మనస్తాపం చెందిన బాధితులు సోమవారం ఉదయం వడ్డీవ్యాపారి ఇంటి ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశారు. గమనించిన వ్యాపారి కుటుంబసభ్యులు అడ్డుకొని, పోలీసులకు సమాచారం అందించారు. స్టేషన్‌కు తరలించిన తర్వాత కూడా మరోమారు బాధితులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేయడంతో పోలీసులు కంగుతిన్నారు. సీఐ మల్లికార్జునరావు బాధితులతో చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.