
సమ్మె ఆపండి: సీమాంధ్ర ఉద్యోగులకు జేపీ విజ్ఞప్తి
కోస్తా, రాయలసీమ ప్రభుత్వ ఉద్యోగులు తాము చేపట్టిన సమ్మె ఆపాలని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం సహచర నేతలతో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోనైనా, ఆంధ్రాలోనైనా ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ ఉద్యమాలలో పాల్గొనడం మంచి సంప్రదాయం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సేవకులు కాబట్టే వారికి ప్రత్యేక ఉద్యోగ భద్రతా ఏర్పాట్లున్నాయని, రాజకీయ కారణం కోసం వారు సమ్మెకు దిగడం సరికాదని సూచించారు.
ఉద్యోగులు ఎంసెట్ కౌన్సిలింగ్ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె వల్ల కౌన్సిలింగ్ మొదటి రోజు చాలా మంది విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అవకాశం లేకుండా పోయిందన్నారు. తాము ఎవరి తరుఫున పోరాటం చేస్తున్నామని చెబుతున్నారో, ఆ ప్రజలు విద్యార్థుల మీదే యుద్ధాన్ని ప్రకటించినట్టయిందన్నారు.
ఉద్యోగులకు ఏవైనా అభ్యంతరాలుంటే నల్ల బ్యాడ్జీలు ధరించో.. ఎక్కవసేపు పనిచేసో.. సాయంత్రం సమయాల్లో సమావేశాలు నిర్వహించో శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించాలి తప్ప, ఈ రకంగా సమ్మెలకు దిగడం మంచిది కాదని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి ప్రజలకు నష్టం కలిగించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఉద్యోగులు రాజకీయ పార్టీల ఉచ్చులో చిక్కుకొని సాటి ఉద్యోగులతో ఘర్షణకు దిగే ధోరణికి స్వస్తిచెప్పాలని కోరారు.
లోక్‌సత్తా బహిరంగ సభలు
రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాస్తవ పరిస్థితుల మీద రాష్ట్ర ప్రజల మధ్య అవగాహన పెంచి, సామరస్య పరిష్కారం దిశగా వారిని నడిపించేందుకు లోక్‌సత్తా పార్టీ రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో బహిరంగసభలను నిర్వహిస్తోందని జయప్రకాష్‌నారాయణ ప్రకటించారు. హైదరాబాద్ ఆదాయం, ఉద్యోగుల పరిస్థితి, ఇతర వనరులకు సంబంధించిన అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహస్య వైఖరి వీడి బైటపెట్టాలని డిమాండ్ చేశారు.
తాబట్టిన కుందేలుకు మూడేకాళ్లు అనే ధోరణి కాకుండా సామరస్య పరిష్కారం దిశగా చర్చలకు ఈ వేళ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు తగిన వాతావరణాన్ని కల్పించాలని కోరారు. పార్టీ నిర్వహించే సభల వివరాలను ఒకట్రెండు రోజుల్లో తెలియజేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో కొన్ని లోక్‌సభ సీట్లు గెలుచుకోవడం కోసం తప్ప, ఇక్కడి ప్రజల పట్ల ప్రేమతో కేంద్రం నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు.
రాష్ట్ర వ్యవ హారం సొంత వ్యవహారంగా చూడడం వల్లే, పార్లమెంటరీ లేదా కేబినేట్ కమిటీ వేయకుండా కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆంటోని కమిటీ వేసిందన్నారు. హైదరాబాద్, ఆదాయం, ఉద్యోగుల సమస్య, నీటి వనరులు, రాయలసీమ- ఈ అంశాలన్నింటిపై ప్రజలలోకి తీసుకెళ్లి బహిరంగ సభలలో చర్చ చేస్తామని, వారిలో అవగాహన పెంచి పరిష్కారంలో భాగస్వాముల్ని చేస్తామన్నారు. ఇంకా సమస్య ఉంటే పరిస్థితులను బట్టి కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజనపై సంక్షోభానికి సంబంధించి ఈ తతంగమంతా పూర్తయ్యాక అసలు పని మొదలవుతుందన్నారు.
ప్రజల మధ్య ఈర్ష్యాభావాల్ని ప్రేరేపించడం నికృష్ణ రాజకీయం, నీచ నాయకత్వమని విమర్శించారు. అందరి ప్రయోజనాలను సమన్వయం చేస్తూ అందరికీ ఎదిగే అవకాశాలను కల్పించడం జన రాజకీయమని వ్యాఖ్యానించారు. సభలు, సమావేశాలు, కరప్రతాలు వంటి మార్గాల ద్వారా రాష్ట్రంలోని సంకోభాన్ని నిర్మాణాత్మకంగా పరిష్కరించేందుకు, వ్యవస్థలో మార్పునకు దీన్నో అవకాశంగా వినియోగించుకునేందుకు లోక్‌సత్తా పార్టీ కృషి చేస్తోందని జయప్రకాష్‌ణారాయణ అన్నారు.