Seemandhra Employees Protest
-
సమ్మె విరమణ వెనుక కథేంటి?: చలసాని
గుంటూరు: సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు చిత్తశుద్ధితో సమ్మె చేస్తుంటే వారి నాయకుడు అర్థాంతరంగా విరమించాలని చెప్పడం వెనుక అంతరార్థమేంటని ఆంధ్రా మేధావులు, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. మరో ఎనిమిది గంటలపాటు సమ్మె జరిపి ఉంటే కేంద్రం దిగి వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆంధ్ర మేధావుల, విద్యావంతుల వేదికలో పాల్గొన్న ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఉద్యోగులు సమ్మె విరమించడానికి అశోక్‌బాబుకి దిగ్విజయ్‌సింగ్ ఏమైనా ఆదేశాలిచ్చారా అని ప్రశ్నించారు. ఎవరు చెబితే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మె నిలిపివేయాల్సి వచ్చిందని నిలదీశారు. సర్వోన్నత న్యాయస్థానం విభజనను అడ్డుకునే అవకాశాలున్నాయని, అయితే విభజనపై కేంద్రప్రభుత్వాన్ని చాలాకాలం క్రితమే న్యాయస్థానం వివరణ ఇవ్వమన్నప్పటికీ ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. -
సమ్మె ఆపండి: సీమాంధ్ర ఉద్యోగులకు జేపీ విజ్ఞప్తి
కోస్తా, రాయలసీమ ప్రభుత్వ ఉద్యోగులు తాము చేపట్టిన సమ్మె ఆపాలని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం సహచర నేతలతో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోనైనా, ఆంధ్రాలోనైనా ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ ఉద్యమాలలో పాల్గొనడం మంచి సంప్రదాయం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సేవకులు కాబట్టే వారికి ప్రత్యేక ఉద్యోగ భద్రతా ఏర్పాట్లున్నాయని, రాజకీయ కారణం కోసం వారు సమ్మెకు దిగడం సరికాదని సూచించారు. ఉద్యోగులు ఎంసెట్ కౌన్సిలింగ్ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె వల్ల కౌన్సిలింగ్ మొదటి రోజు చాలా మంది విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అవకాశం లేకుండా పోయిందన్నారు. తాము ఎవరి తరుఫున పోరాటం చేస్తున్నామని చెబుతున్నారో, ఆ ప్రజలు విద్యార్థుల మీదే యుద్ధాన్ని ప్రకటించినట్టయిందన్నారు. ఉద్యోగులకు ఏవైనా అభ్యంతరాలుంటే నల్ల బ్యాడ్జీలు ధరించో.. ఎక్కవసేపు పనిచేసో.. సాయంత్రం సమయాల్లో సమావేశాలు నిర్వహించో శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించాలి తప్ప, ఈ రకంగా సమ్మెలకు దిగడం మంచిది కాదని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి ప్రజలకు నష్టం కలిగించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఉద్యోగులు రాజకీయ పార్టీల ఉచ్చులో చిక్కుకొని సాటి ఉద్యోగులతో ఘర్షణకు దిగే ధోరణికి స్వస్తిచెప్పాలని కోరారు. లోక్‌సత్తా బహిరంగ సభలు రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాస్తవ పరిస్థితుల మీద రాష్ట్ర ప్రజల మధ్య అవగాహన పెంచి, సామరస్య పరిష్కారం దిశగా వారిని నడిపించేందుకు లోక్‌సత్తా పార్టీ రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో బహిరంగసభలను నిర్వహిస్తోందని జయప్రకాష్‌నారాయణ ప్రకటించారు. హైదరాబాద్ ఆదాయం, ఉద్యోగుల పరిస్థితి, ఇతర వనరులకు సంబంధించిన అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహస్య వైఖరి వీడి బైటపెట్టాలని డిమాండ్ చేశారు. తాబట్టిన కుందేలుకు మూడేకాళ్లు అనే ధోరణి కాకుండా సామరస్య పరిష్కారం దిశగా చర్చలకు ఈ వేళ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు తగిన వాతావరణాన్ని కల్పించాలని కోరారు. పార్టీ నిర్వహించే సభల వివరాలను ఒకట్రెండు రోజుల్లో తెలియజేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో కొన్ని లోక్‌సభ సీట్లు గెలుచుకోవడం కోసం తప్ప, ఇక్కడి ప్రజల పట్ల ప్రేమతో కేంద్రం నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్ర వ్యవ హారం సొంత వ్యవహారంగా చూడడం వల్లే, పార్లమెంటరీ లేదా కేబినేట్ కమిటీ వేయకుండా కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆంటోని కమిటీ వేసిందన్నారు. హైదరాబాద్, ఆదాయం, ఉద్యోగుల సమస్య, నీటి వనరులు, రాయలసీమ- ఈ అంశాలన్నింటిపై ప్రజలలోకి తీసుకెళ్లి బహిరంగ సభలలో చర్చ చేస్తామని, వారిలో అవగాహన పెంచి పరిష్కారంలో భాగస్వాముల్ని చేస్తామన్నారు. ఇంకా సమస్య ఉంటే పరిస్థితులను బట్టి కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజనపై సంక్షోభానికి సంబంధించి ఈ తతంగమంతా పూర్తయ్యాక అసలు పని మొదలవుతుందన్నారు. ప్రజల మధ్య ఈర్ష్యాభావాల్ని ప్రేరేపించడం నికృష్ణ రాజకీయం, నీచ నాయకత్వమని విమర్శించారు. అందరి ప్రయోజనాలను సమన్వయం చేస్తూ అందరికీ ఎదిగే అవకాశాలను కల్పించడం జన రాజకీయమని వ్యాఖ్యానించారు. సభలు, సమావేశాలు, కరప్రతాలు వంటి మార్గాల ద్వారా రాష్ట్రంలోని సంకోభాన్ని నిర్మాణాత్మకంగా పరిష్కరించేందుకు, వ్యవస్థలో మార్పునకు దీన్నో అవకాశంగా వినియోగించుకునేందుకు లోక్‌సత్తా పార్టీ కృషి చేస్తోందని జయప్రకాష్ణారాయణ అన్నారు. -
‘ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి మెరుపు సమ్మె’
-
‘ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి మెరుపు సమ్మె’
విజయవాడ: ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి ఉపాధ్యాయులు మెరుపు సమ్మెకు సిద్ధం కానున్నట్లు సమైక్యాంధ్ర ఉపాధ్యాయుల పోరాట సమితి ప్రకటించింది. ఆదివారం సమావేశమైన పదమూడు జిల్లాల సమైక్యాంధ్రా ఉపాధ్యాయ పోరాట సమితి సభ్యులు మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించి 19వ తేదీన సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు.. ఈ నెల 19, 20. 21న సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆందోళనలు చేపడుతున్నట్లు ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. 21వ తేదీన మెరుపు సమ్మెను చేస్తామని ముందుగా తెలిపారు. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సరిగా జరుగుతుందా.. లేదా అన్న విషయమై అనుమానాలు ఇంకా వీడట్లేదు. వాస్తవానికి హైకోర్టు ఆదేశాలు జారీచేయడంతో ఈనెల 19వ తేదీన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఉంటుందని ఉన్నత విద్యామండలి తేదీలు ప్రకటించిన విషయం తెలిసిందే. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు, వాటి సవరణ తదితరాలకు సంబంధించిన తేదీలను కూడా వెల్లడించారు. అయితే, ఈలోపు మళ్లీ సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె ఉధృతంగా సాగుతుండటం వల్ల కౌన్సెలింగ్ వాయిదా పడిందంటూ కొన్ని వార్తలు వినవచ్చాయి. కానీ.. అవి సరికాదని, ప్రస్తుతానికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ యథాతథంగా ఉంటుందని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి.ఈ క్రమంలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేయాలని సీమాంధ్ర ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై వీడని అనుమానాలు
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సరిగా జరుగుతుందా.. లేదా అన్న విషయమై అనుమానాలు ఇంకా వీడట్లేదు. వాస్తవానికి హైకోర్టు ఆదేశాలు జారీచేయడంతో ఈనెల 19వ తేదీన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఉంటుందని ఉన్నత విద్యామండలి తేదీలు ప్రకటించిన విషయం తెలిసిందే. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు, వాటి సవరణ తదితరాలకు సంబంధించిన తేదీలను కూడా వెల్లడించారు. అయితే, ఈలోపు మళ్లీ సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె ఉధృతంగా సాగుతుండటం వల్ల కౌన్సెలింగ్ వాయిదా పడిందంటూ కొన్ని వార్తలు వినవచ్చాయి. కానీ.. అవి సరికాదని, ప్రస్తుతానికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ యథాతథంగా ఉంటుందని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. కానీ.. సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యోగులు సమ్మె చేస్తున్నందువల్ల కౌన్సెలింగ్ ఏమాత్రం సజావుగా సాగుతుందన్న విషయం అనుమానంగానే కనపడుతోంది. ప్రస్తుతానికి కోర్టు ఆదేశాలను పాటించాలి కాబట్టి ఎలాగోలా తేదీలను ప్రకటించినా.. అక్కడకు వెళ్లిన తర్వాత పరిస్థితిని బట్టి, ఉద్యోగులు వచ్చి సర్టిఫికెట్ల పరిశీలన లాంటి కార్యక్రమాలు కొనసాగిస్తే పర్వాలేదు గానీ, లేనిపక్షంలో అప్పటికప్పుడు వాయిదా విషయాన్ని ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేవని విద్యాశాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటికే ఎంసెట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఆలస్యంగా వెలువడటంపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఇప్పటికే తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ పరిస్థితి గందరగోళంగా మారడం విద్యార్థులను మరింతగా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఇంత జాప్యం కావడం ఇదే మొదటిసారి. మే 12న ఎంసెట్ నిర్వహించగా, జూన్ 5న ఫలితాలు వెలువడ్డాయి. -
'సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన సరికాదు'
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన సరికాదని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేంద్రరావు అన్నారు. తక్షణమే సీమాంధ్ర ఉద్యోగులు తమ ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ డిమాండ్లపై కాక ఉద్యోగుల సమస్యలపై నిరసన తెలిపితే తమకు అభ్యంతరం లేదని అన్నారు. ఉద్యోగ సంబంధిత సమస్యలపై చర్చించేందుకు సోమవారం సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు విరమించాలని సూచించారు. 8 తెలంగాణ ఉద్యోగ సంఘాలతో సచివాలయ టి.ఉద్యోగుల సమన్వయ కమిటీ ఏర్పాటుచేశామని, సోమవారం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని నరేంద్రరావు తెలిపారు.