
‘ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి మెరుపు సమ్మె’
విజయవాడ: ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి ఉపాధ్యాయులు మెరుపు సమ్మెకు సిద్ధం కానున్నట్లు సమైక్యాంధ్ర ఉపాధ్యాయుల పోరాట సమితి ప్రకటించింది. ఆదివారం సమావేశమైన పదమూడు జిల్లాల సమైక్యాంధ్రా ఉపాధ్యాయ పోరాట సమితి సభ్యులు మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించి 19వ తేదీన సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు.. ఈ నెల 19, 20. 21న సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి ఆందోళనలు చేపడుతున్నట్లు ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. 21వ తేదీన మెరుపు సమ్మెను చేస్తామని ముందుగా తెలిపారు. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సరిగా జరుగుతుందా.. లేదా అన్న విషయమై అనుమానాలు ఇంకా వీడట్లేదు. వాస్తవానికి హైకోర్టు ఆదేశాలు జారీచేయడంతో ఈనెల 19వ తేదీన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఉంటుందని ఉన్నత విద్యామండలి తేదీలు ప్రకటించిన విషయం తెలిసిందే. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు, వాటి సవరణ తదితరాలకు సంబంధించిన తేదీలను కూడా వెల్లడించారు. అయితే, ఈలోపు మళ్లీ సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె ఉధృతంగా సాగుతుండటం వల్ల కౌన్సెలింగ్ వాయిదా పడిందంటూ కొన్ని వార్తలు వినవచ్చాయి. కానీ.. అవి సరికాదని, ప్రస్తుతానికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ యథాతథంగా ఉంటుందని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి.ఈ క్రమంలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేయాలని సీమాంధ్ర ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.