ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సరిగా జరుగుతుందా.. లేదా అన్న విషయమై అనుమానాలు ఇంకా వీడట్లేదు. వాస్తవానికి హైకోర్టు ఆదేశాలు జారీచేయడంతో ఈనెల 19వ తేదీన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఉంటుందని ఉన్నత విద్యామండలి తేదీలు ప్రకటించిన విషయం తెలిసిందే. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు, వాటి సవరణ తదితరాలకు సంబంధించిన తేదీలను కూడా వెల్లడించారు. అయితే, ఈలోపు మళ్లీ సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె ఉధృతంగా సాగుతుండటం వల్ల కౌన్సెలింగ్ వాయిదా పడిందంటూ కొన్ని వార్తలు వినవచ్చాయి. కానీ.. అవి సరికాదని, ప్రస్తుతానికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ యథాతథంగా ఉంటుందని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి.
కానీ.. సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యోగులు సమ్మె చేస్తున్నందువల్ల కౌన్సెలింగ్ ఏమాత్రం సజావుగా సాగుతుందన్న విషయం అనుమానంగానే కనపడుతోంది. ప్రస్తుతానికి కోర్టు ఆదేశాలను పాటించాలి కాబట్టి ఎలాగోలా తేదీలను ప్రకటించినా.. అక్కడకు వెళ్లిన తర్వాత పరిస్థితిని బట్టి, ఉద్యోగులు వచ్చి సర్టిఫికెట్ల పరిశీలన లాంటి కార్యక్రమాలు కొనసాగిస్తే పర్వాలేదు గానీ, లేనిపక్షంలో అప్పటికప్పుడు వాయిదా విషయాన్ని ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేవని విద్యాశాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇప్పటికే ఎంసెట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఆలస్యంగా వెలువడటంపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఇప్పటికే తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ పరిస్థితి గందరగోళంగా మారడం విద్యార్థులను మరింతగా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఇంత జాప్యం కావడం ఇదే మొదటిసారి. మే 12న ఎంసెట్ నిర్వహించగా, జూన్ 5న ఫలితాలు వెలువడ్డాయి.
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్పై వీడని అనుమానాలు
Published Fri, Aug 16 2013 7:23 PM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement
Advertisement