అనీల్ నగరంలోని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం ఆఫీసుకు బయల్దేరాడు. బైక్ తీస్తుండగా ఆయన సెల్‌ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే.. అపరిచిత నంబరు. లిఫ్ట్ చేయగానే..
హలో.. నమస్కారం..
నగరంలో శాంతిభద్రతలపై మీ అభిప్రాయం ఏమిటీ?
భద్రత బాగానే ఉందా.. అయితే, ఆప్షన్-2 నొక్కండి.. లేదంటే ఆప్షన్-7 నొక్కండి.. అంటూ రికార్డెడ్ వాయిస్.
అనీల్ తేరుకుని ఏదో ఒక నంబరు ప్రెస్ చేయగానే.. ఉన్నట్టుండి కాల్ కట్ అయ్యింది.గురువారం ఉదయం నగరంలోని చాలామంది ఫోన్లకు 83339 99999 నంబరు నుంచి ఇలాంటి వాయిస్ రికార్డెడ్ కాల్సే వచ్చాయి. ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ప్రభుత్వం తరఫున కాల్ చేస్తున్నట్టు ఆ కాల్ సారాంశమే అయినా.. ఇందులోని అంతర్థాన్ని పరిశీలిస్తే.. పోలీస్ కమిషనరేట్‌లో శాంతిభద్రతలపై ప్రభుత్వానికి సందేహాలు ఉన్నాయా? ఏజెన్సీల నుంచి తగిన సమాచారం లేదని ప్రభుత్వం భావిస్తోందా? ప్రజల నుంచి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారా? అనే అనుమానం రాకమానదు.
సిటీ పోలీస్‌పై నిఘానా..?
కొద్దిరోజులుగా నగర పోలీసులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. శాంతిభద్రతల పేరిట తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణ పేరిట జులుం ప్రదర్శించడం, పాత నేరస్తుల కస్టోడియల్ డెత్ వంటి అంశాల్లో వారి వ్యవహారశైలి విమర్శనాత్మకంగా మారింది. అనేక సందర్భాల్లో అధికార పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. పోలీస్‌పరంగా చేపట్టిన కార్యక్రమాలపై విమర్శలు రావడంతో ప్రభుత్వ ఏజెన్సీల నుంచి తగిన సమాచారం రావడం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. పైకి చెబుతున్నంత గొప్పగా ఇక్కడ శాంతిభద్రతల పరిస్థితి ఏమీ లేదనే అభిప్రాయంతో వీరున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలీసుల పనితీరు, శాంతిభద్రతల అంశాలను నేరుగా తెలుసుకోవాలనే ప్రభుత్వం నిర్ణయించి ఇలాంటి ఫోన్‌కాల్స్ చేస్తోందని సమాచారం.
సేఫ్ సిటీ కోసమేనా..
విజయవాడ రాజధాని అయిన క్రమంలో త్వరలో ఇక్కడి నుంచే ప్రభుత్వ పాలన సాగనుంది. వీటన్నింటి దృష్ట్యా నగరంలో శాంతిభద్రతల అంశం ప్రధానంగా మారింది. ఇక్కడికి వచ్చే వారికి భద్రతపై భరోసా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని నగర పరిస్థితులను అంచనా వేసేందుకే ప్రభుత్వం ఇలాంటి ఫోన్‌కాల్స్‌తో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోందనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది.
కమిషనరేట్‌లో చర్చ
పోలీస్‌లపై ప్రభుత్వం నేరుగా అభిప్రాయ సేకరణ చేయడంపై నగర పోలీసులు అవాక్కవుతున్నారు. గురువారం ఉదయం పలువురికి వచ్చిన ఫోన్ కాల్స్‌పై పోలీస్ కమిషనరేట్‌లో తీవ్రమైన చర్చ మొదలైంది. ఎవరెవరికి ఫోన్లు వచ్చాయి? వారే ఏ విధమైన సమాచారం ఇచ్చారు?.. వంటి అంశాలను నిఘా వర్గాల ద్వారా పోలీసులు కూడా సేకరిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా పోలీసుల పనితీరుపై ప్రభుత్వం ఆరా తీయడం ప్రస్తుతం సిటీలో హాట్ టాపిక్‌గా మారింది. - విజయవాడ సిటీ
కాల్ కలకలం
Published Fri, Feb 20 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement
Advertisement