
వెంకన్న కొండపై తోపులాట
- పోటెత్తిన భక్తులు...తలనీలాలిచ్చేందుకు ఇక్కట్లు
- శ్రీవారి దర్శనానికి 14 గంటలు
సాక్షి, తిరుమల: తిరుమల కల్యాణకట్టలో శనివారం తోపులాట చోటుచేసుకుంది. తలనీలాలు సమర్పించేందుకు భారీగా క్యూ కట్టిన భక్తులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. రెండో శనివారం, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచే తలనీలాలు సమర్పించేందుకు ప్రధాన కల్యాణకట్ట వద్ద భక్తులు క్యూ కట్టారు. వచ్చినవారికి వచ్చినట్టుగా తలనీలాలు తీసే పనిలో క్షురకులు నిమగ్నమయ్యారు.
ఉదయం 8 గంటల తర్వాత క్యూ కదల్లేదు. అప్పటి వరకు లోనికి వచ్చినవారికి తలనీలాలు తీసిన సిబ్బంది ఉదయం 9 గంటలకు విధులు ముగించారు. దీనివల్ల సుమారు గంట సమయం ఆలస్యమైంది. దీనివల్ల కల్యాణకట్ట వెలుపల భక్తుల క్యూ భారీగా పెరిగింది. ఎవరికి వారు ఎగబడడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. పలువురు కింద పడ్డారు. చంటి బిడ్డల రోదనలు క్యూలో మిన్నంటాయి. వృద్ధులు అవస్థలు ఎదుర్కొన్నారు.
తిరుపతి జేఈవో పోలా భాస్కర్ పరిస్థితిని సమీక్షించి, చక్కదిద్దే చర్యలు చేపట్టారు. కల్యాణకట్ట డెప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, విజిలెన్స్ ఏవీఎస్‌వో రామకృష్ణ కల్యాణ కట్ట వద్దకు చేరుకున్నారు. అందుబాటులో ఉండే కల్యాణకట్ట ఉద్యోగులు, పీసు రేటు క్షురకులు, మేళం స్టాఫ్, శ్రీవారి సేవకులు మొత్తంగా 380 మంది సిబ్బందిని కల్యాణకట్టలో భక్తుల తలనీలాలుతీసే విధుల్లో వినియోగించారు. దీనివల్ల క్యూలైను త్వరగా కదిలింది. సాయంత్రం 4 గంటలకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం 24,892 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
దర్శనానికి 14 గంటలు
ఇక రద్దీ పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు, కాలిబాట దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 56,242 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గదుల కోసం భక్తులు అన్ని రిసెప్షన్ కేంద్రాల్లోనూ క్యూ కట్టారు.