బిల్లు అయ్యాక చేసేదేమీ ఉండదు: నారిమన్
సమైక్య పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 8 పిటిషన్లు దాఖలు కాగా, వాటన్నింటినీ కోర్టు విచారణకు స్వీకరించింది. అన్నింటినీ ఒకేసారి విచారిస్తోంది. కాగా, పిటిషనర్ల తరఫున మోహన్‌లాల్ శర్మ, రోహింగ్టన్ నారిమన్ వాదనలు వినిపస్తున్నారు. రాజ్యాంగంలోని 371(డి), ఇ లను సవరించకుండా విభజన చేయలేరని నారిమన్ అన్నారు. పంజాబ్ విభజన సమయంలో అనేక కమిటీలు పనిచేశాయని, ఇప్పుడు మాత్రం కనీసం శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టలేదుని, బిల్లు చట్టం అయ్యాక చేయడానికి ఇంకేమీ ఉండదని నారిమన్ వాదించారు. తక్షణమే విభజన స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.
ఇక సమైక్య స్ఫూర్తి అనేది ప్రజాస్వామ్యానికి మూలమని మరో న్యాయవాది ఎంఎన్ రావు అన్నారు. అసెంబ్లీ అంగీకారం లేకుండా ఎక్కడా విభజన జరగలేదని, ఒకవేళ బిల్లును అసెంబ్లీ నిరాకరిస్తే రాష్ట్రాన్ని ఏర్పరిచే హక్కు కేంద్రానికి ఉండదని వాదించారు. అసెంబ్లీకి వచ్చిన బిల్లులో అన్ని అంశాలు లేవని, అసలు విభజన ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాల్సిన హక్కు ప్రతి ఎమ్మెల్యేకూ ఉందని ఎంఎన్ రావు చెప్పారు. ఇలాంటి అంశాల్లో కూడా రహస్యం పాటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
అసెంబ్లీలో సభ్యులకు వాదనలు వినిపించే హక్కుందని మరో న్యాయవాది పప్పు శ్యామల అన్నారు. రాష్ట్రపతి తెలంగాణ బిల్లును రికమండ్ చేయాలంటే ఆయన కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, రాష్ట్రపతి ముందు సరైన సమాచారం ఉంటేనే అసెంబ్లీలో సభ్యులు తమ వాదనల్ని వినిపిస్తారని, అయితే ఈ బిల్లులో సమగ్ర సమాచారం లేదని పప్పు శ్యామల చెప్పారు.