మేం కాదు.. మీరే మూగవారు...
Published Thu, Oct 17 2013 3:14 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : సీమాంధ్ర, కేంద్ర మంత్రులు, ఎంపీలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు మూగవారిగా మారడాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం మూగ, బధిరులు స్థానిక హిందూ కళాశాల సెంటర్లోని అమరజీవి విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. విధివశాత్తూ మేం మూగవారమైనా, మీరు నోరుండీ మాట్లాడలేని మూగవారన్న రీతిలో మూగవారు తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజాభీష్టానికి విరుద్ధంగా విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానంపై కనీసం నిరసన వ్యక్తం చేయలేక, ప్రజలకు జరిగే నష్టం వివరించలేని కేంద్ర మంత్రులు, ఎంపీల కంటే మాటలు రాని మూగవారే నయమన్నారు. విభజనతో జరిగే నష్టాన్ని గుర్తించి మాటలు రాకపోయినా తమ ఆవేదనను వెళ్లగేక్కందుకు మూగ, బధిర సోదరులు కడుపు మాడ్చుకుని రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారన్నారు. ఉద్యమంలో ఉధృతి తగ్గిందని, కొద్ది రోజులకు చల్లారి పోతుందని ఢిల్లీ పెద్ధలు భావిస్తే అది వారి అవివేకమని, సమైక్యాంధ్ర సాదించే వరకూ ఉద్యమం విరమించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్. శామ్యూల్ మాట్లాడుతూ విభజన ఆగుతుందంటూ కేంద్ర మంత్రులు, ప్రభుత్వం పడిపోతుందని రాష్ట్ర మంత్రులు రాాజీనామాలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన అడ్డుకుంటామని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చెబుతున్న మాటలు నమ్మి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా వేచి ఉండడం సరికాదని, దీని వలన ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి అసెంబ్లీ రద్దయ్యే పరిస్థితి తీసుకొస్తే కేంద్రం తప్పక దిగివస్తుందన్నారు. ప్రజా ఉద్యమాన్ని చూసి గుడ్డిగా వ్యవహరిస్తున్న ఢిల్లీ పెద్దలకు రాజకీయ భవిష్యత్ లేకుండా పోవడం ఖాయమని హెచ్చరించారు.
మూగ, బధిరుల ఆవేదన
రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని రిలే నిరాహార దీక్షలో కూర్చున్న మూగ, బధిర సోదరులు ఆవేదన చెందారు. మా మూగ సైగలు తెలుగుజాతి, రాష్ట్రం కలిసి ఉండాలని... అనే నినాదాలు రాసిన బోర్టులను మెడలో వేసుకుని సైగల ద్వారా సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. రిలే దీక్షలో కూర్చున్న వారికి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు కసుకుర్తి హనుమంతరావు, పాశం రవీంద్రయాదవ్, వైవీ సురేష్, గ్రంధి పార్థసారథి, విద్యార్థి జేఏసీ కో-ఆర్డినేటర్ మండూరి వెంకటరమణ సంఘీభావం తెలిపారు.
Advertisement
Advertisement