వంగవీటి రంగా హత్య, ఎన్టీఆర్ మరణంపై మాట్లాడగలరా?
హైదరాబాద్: టిడిపి నేతలు కాంగ్రెస్ నేత వంగవీటి మోహన రంగా హత్య, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మరణంపై మాట్లాడగలరా? అని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు రాజన్నదొర, నారాయణస్వామి, సంజీవయ్య ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వారు విలేకరులతో మాట్లాడుతూ పరిటాల రవి హత్య గురించి ఇప్పుడు మాట్లాడమేంటి? అని అడిగారు. ఆ కేసులో నిందితులుగా ఆరోపణలకు గురైనవారు ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వవ్యవహార శైలిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా స్వామ్యామా? నియంతృత్వమా? అసెంబ్లీలో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే ఎలా? అని అడిగారు.
సభలో ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతామన్నప్పుడు స్పీకర్ కచ్చితంగా మైక్ ఇవ్వాలని వారన్నారు. కాని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన రెడ్డి వాకౌట్ చేస్తామన్నా స్పీకర్ ఆ అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. అధికార పక్షం దారుణంగా మాట్లాడుతున్నా స్పీకర్ వారిని నిలువరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 నెలల్లో జరిగిన హత్యల గురించి మాట్లాడమంటే అధికారపక్షం చర్చను తప్పుదోవ పట్టించిందన్నారు.
అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ వారు ప్రశ్నిస్తామనే భయంతో ప్రతిపక్షంపై దాడికి దిగారని మండిపడ్డారు. రుణమాఫీపై నిలదీస్తారనే వారి భయం అన్నారు. రైతులను మోసం చేశారని, ఇప్పడు బ్యాంక్‌లను నిందించి తప్పుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతి విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారన్నారు. నిరుద్యోగులకు మేనిఫెస్టోలో రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు శాసనసభలో వెయ్యి రూపాయలు మాత్రమే ప్రకటించారని వివరించారు.
స్పీకర్ అసెంబ్లీలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం లేదన్నారు. తమకు ఉపప్రశ్నలు వేయడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. అధికారపక్షానికి పేరు లేకపోయినా అవకాశాలు ఇస్తున్నారన్నారు. ఇప్పటికైనా చర్చ అర్ధవంతం జరిగేలా స్పీకర్ వ్యవహరించాలని కోరారు. స్పీకర్ టీడీపీ నేతగా పని చేయవద్దని కోరారు. స్పీకర్‌ను ముషారఫ్, రౌడీ అని నిందించిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబుదే అని అన్నారు. గతంలో స్పీకర్లను దారుణంగా అవమానించిన చరిత్ర టిడిపి నేతలదని రాజన్నదొర, నారాయణస్వామి, సంజీవయ్య విమర్శించారు.