త్రిపురారం, న్యూస్‌లైన్: మండలంలోని జి అన్నారం -దుగ్గెపల్లి గ్రామాల మధ్య ఉన్న డి-26 వరద కాలువకు మంగళవారం మధ్యాహ్నం గండిపడింది. అధికారులు ఇటీవల వరద కాలువకు నీటిని విడుదల చేశారు. కాలువ కట్ట బలహీనంగా ఉండడంతో నీటి ఉధృతి ఎక్కువకావడంతోనే గండిపడిందని భావిస్తున్నారు. దీంతో జి.అన్నారం గ్రామానికి చెందిన చిలుక రవీందర్‌రెడ్డి, వంగాల శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం ఆదిరెడ్డి, జాజుల మట్టయ్య, గోలి నాగయ్య, మేరెడ్డి హనుమారెడ్డిలకు చెందిన 30 ఎకరాల బత్తాయి తోట, 10 ఎకరాల పత్తి పంటలు నీట మునిగాయి. మూడు రోజుల క్రితం కూడా ఇదే వరద కాలువకు గండి పడడంతో రైతులు దానిని పూడ్చారు.
దిక్కుతోచని స్థితిలో రైతులు
కాలువకు మళ్లీ గండిపడడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు నీట మునిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కాలువకు గండి పడడంతో పత్తి పంట వరద తీవ్రతకు కొట్టుకుపోయిం ది. దీనికి తోడు మొక్కలు కనిపించని విధంగా అడుగుమేర నీరు పత్తి పంటలో నిలిచింది. దీంతో పాటు సమీపంలో ఉన్న బత్తాయి తోటలలలో కూడా వరద నీరు వచ్చి చేరింది.
చింతల చెరువులోకి చేరుతున్న వరద నీరు
డి-26 వరద కాలువకు గండి పడడంతో జి.అ న్నారం గ్రామ సమీపంలో ఉన్న చింతల చెరువులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నీటి ప్రవాహంలో పత్తి చేలు కొట్టుకుపోగా, సమీపంలోని బత్తాయి తోటల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చింతల చెరువును నింపేందుకే గుర్తుతెలియని వ్యక్తులు వరద కాలువకు గండ్లు పెడుతున్నారని కొంత మంది రైతులు ఆరోపిస్తున్నారు.
వరద కాలువకు గండి
Published Wed, Aug 21 2013 3:33 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement