water ponds
-
చెరువులకు శాపం ఇలా.. రక్షణ చర్యలు తీసుకోవాలిలా...
సాక్షి, హైదరాబాద్: మహానగరానికి మణిహారంలా ఉన్న జలాశయాల పరిరక్షణ, సుందరీకరణ విషయంలో సర్కారు విభాగాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులతోపాటు ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న వందలాది జలాశయాలు కబ్జాలతో కుంచించుకుపోయాయి. మరికొన్నింట గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల వ్యర్థజలాలు చేరి వాటిని కాలుష్య కాసారాలుగా మార్చివేశాయి. ఈ విషయంలో ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, పీసీబీ, పరిశ్రమలు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర విభాగాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలాశయాల పరిరక్షణ విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ పలు సందర్భాల్లో జారీచేసిన మార్గదర్శకాలను సర్కారు యంత్రాంగం అమలు చేయాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. చెరువులకు శాపం ఇలా... ► పలు చెరువుల్లో ఇటీవలికాలంలో గుర్రపుడెక్క ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. ► సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధిచేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతున్నాయి. దీంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గంధభరితంగా మార్చేస్తున్నాయి. ► ఈ ప్రభావంతో ఆయా జలాశయాల్లో నీటిలో సూక్ష్మజీవులు, జలచరాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్ మోతాదు దారుణంగా పడిపోవడం గమనార్హం. ► సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరడంతోనేఈ దుస్థితి తలెత్తింది. ► గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాలకు గురవడం.. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు కూపమౌతున్నాయి. ► చాలా చెరువులు తమ ఎఫ్టీఎల్ పరిధిలో సగం భూములను కోల్పోయి చిక్కిశల్యమై కనిపిస్తున్నాయి. పైపై మెరుగులకే జీహెచ్ఎంసీ ప్రాధాన్యం ► రోజువారీగా గ్రేటర్‌వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మా త్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే చెరువులు, మూసీ లో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. రక్షణ చర్యలు తీసుకోవాలిలా... ► చెరువుల ప్రక్షాళన, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సేవ్ అవర్ అర్భన్‌లేక్స్ సంస్థ పలు సూచనలు చేసింది. ► గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల్లో తక్షణం పూడిక తొలగించాలి. ఆయా చెరువుల్లో అట్టడుగున పేరుకుపోయిన ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. ► జలాశయాల ఉపరితలపై ఉద్ధృతంగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలి. ► చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటుచేయాలి. ► గృహ,వాణిజ్య,పారిశ్రామిక సముదాయాల నుంచి నేరుగా వ్యర్థజలాలు చేరకుండా దారి మళ్లించాలి. ► ఆయా నీటిని మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన అనంతరమే చెరువులో చేరే ఏర్పాట్లు చేయాలి. ► అన్యాక్రాంతం కాకుండా ఎఫ్టీఎల్ బౌండరీలు,రక్షణ కంచె ఏర్పాటుచేయాలి. నిరంతరం నిఘా పెట్టాలి. జలాశయాల చుట్టూ పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలి. ► వర్షపునీరు చేరే ఇన్‌ఫ్లో ఛానల్స్‌ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. ► జలాశయాల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేయాలి. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేయాలి. ► కాలుష్యం, కబ్జాలకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలి. -
నీటికుంట..రైతుకు అండ
– వర్షపు నీటిని ఒడిసిపడితేనే లాభసాటిగా వ్యవసాయం – ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్తలు బి.రవీంద్రారెడ్డి, బి.సహదేవరెడ్డి అనంతపురం అగ్రికల్చర్ : నీటి కుంటలు మెట్ట పంటలను రక్షిస్తాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయం లాభసాటి కావాలంటే పొలాల్లో నీటి కుంటలు, కందకాలు ఏర్పాటు చేసుకుని పై నుంచి పడే ప్రతి వర్షపు చుక్కను ఎక్కడిక్కడ ఇంకించుకోవాలన్నారు. 9.65 లక్షల హెక్టార్లకు వర్షమే శరణ్యం జిల్లావ్యాప్తంగా 9.65 లక్షల హెక్టార్లలో పంటలు పండించాలంటే వర్షమే శరణ్యం. రాష్ట్ర వ్యాప్తంగా 39.11 లక్షల హెక్టార్లు మెట్ట భూమి ఉండగా అందులో అత్యధికంగా 9.65 లక్షల హెక్టార్లలో జిల్లాలో ఉంది. అనిశ్చితి వాతావరణం, తక్కువ వర్షాలు, అననుకూల వర్షాలు, నెలల తరబడి బెట్ట పరిస్థితులు ఏర్పడటం (డ్రైస్పెల్స్), ఒక్కోసారి ఎడతెరపి లేకుండా వర్షాలు పడటం వల్ల పంటలు పండటం కష్టంగా మారింది. నీటి కుంటలు అత్యవసరం బెట్ట పరిస్థితుల నుంచి పంటలను కాపాడుకునేందుకు, కనీస పంట దిగుబడులు పొందేందుకు నీటి కుంటలు (ఫారంపాండ్స్) ఏర్పాటు చాలా అవసరం. అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు ప్రవహించకుండా ఎక్కడిక్కడ నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలి. 1.50 లక్షల నుంచి 4 లక్షల లీటర్లు నిల్వ ఉండేలా తవ్వుకోవాలి. సాధారణంగా 10 మీటర్ల పొడవు, పది మీటర్లు వెడల్పు, 2.5 మీటర్లు లోతు (10“10“2.50 మీటర్లు) తవ్వుకుంటే 2.50 లక్షల లీటర్లు నిల్వ చేసుకోవచ్చు. నీటి కుంటలకు లైనింగ్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నల్లరేగడి నేలల్లో లైనింగ్ లేకున్నా ఫరవాలేదు. నీటి కుంటలోకి నీరు వెళ్లే ముందు ఒక చిన్న తొట్టె లేదా గుంత (సిల్డ్ బేసిన్) ఏర్పాటు చేసుకోవాలి. దీని ద్వారా నీటి ప్రవాహంతో కొట్టుకువచ్చిన ఒండ్రుమట్టి ఫారంపాండ్‌లోకి వెళ్లకుండా ఇక్కడే అడ్డుకోవచ్చు. ఫారంపాండ్‌కు రూ.35,400 ఉదాహరణకు 10“10“2.5 మీటర్ల ఫారంపాండ్ తవ్వుకుని దానికి లైనింగ్ వేయడానికి రూ.35,400 ఖర్చు అవుతుంది. జేసీబీతో గంటకు రూ.750 ప్రకారం 15 గంటల పాటు తవ్వడానికి రూ.11,250, లైనింగ్‌కు బస్తాకు రూ.350 చొప్పున 25 సిమెంట్ బస్తాలకు రూ.8,750, లైనింగ్ వేసేందుకు ఒక కూలీకి రూ.250 ప్రకారం 40 మంది కూలీలకు రూ.10 వేలు, తవ్విన మట్టిన బయటకు చేర్చడానికి రూ.5,400 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం డ్వామా ఆధ్వర్యంలో ఉపాధిహామీ కింద నీటి కుంటలు నిర్మిస్తున్నారు. దానికి రైతులు లైనింగ్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేసవిలో నీటి కుంటలకు చిన్నపాటి మరమ్మత్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అధిక దిగుబడులు నిల్వ చేసిన నీటిని సూక్ష్మసేద్య పద్ధతుల (డ్రిప్, స్ప్రింక్లర్లు, రెయిన్గన్లు) ద్వారా సున్నిత దశలో పంటలకు నీటి తడులు ఇస్తే పంట దిగుబడులు వస్తాయి. వేరుశనగ పంట ఊడలు దిగే సమయంలో 20 మి.మీ మేర స్ప్రింక్లర్ల ద్వారా రెండు తడులు ఇస్తే 33 శాతం దిగుబడులు పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది. కంది పంట పూత, కాయ ఏర్పడే దశలో 20 మి.మీ చొప్పున రెండు తడులు ఇస్తే 66 శాతం దిగుబడులు వచ్చినట్లు రుజువైంది. నల్లరేగడి నేలల్లో పప్పుశెనగలో కొమ్మలు వేసే దశ, గింజ గట్టి పడే దశలో ఇస్తే 15 నుంచి 20 శాతం దిగుబడులు పెరుగుతాయి. నేల, నీటి సంరక్షణ చర్యలపై రైతులు దృష్టి పెడితే భవిష్యత్తులో వ్యవసాయం లాభసాటిగా మారుతుందనడంలో సందేహం లేదు. -
పల్లె గొంతెండుతోంది
మచిలీపట్నం : జిల్లాలో 370 తాగునీటి చెరువులు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీ అనంతరం వారం రోజుల పాటు కాలువలకు నీటిని విడుదల చేయగా అప్పట్లో తాగునీటి చెరువులను నింపారు. ఈ చెరువుల్లోని నీరు మే నెలలోనే సగానికి పైగా వాడుకున్నారు. గత నాలుగు నెలలుగా తాగునీటి చెరువుల్లోకి చుక్కనీరు చేరకపోవటంతో చెరువులు అడుగంటాయి. చల్లపల్లి మండలం కొత్తమాజేరులోని తాగునీటి చెరువులో నీరు కలుషితం కావటం, విషజ్వరాల బారినపడి 19 మంది మృతి చెందటంతో అడుగంటిన చెరువుల్లోని నీటిని తాగాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. కోట్లాది రూపాయలు తాగునీటి శుద్ధి కోసం, సరఫరా కోసం ఖర్చు చేస్తున్నా కలుషిత నీరే తాగాల్సిన దుస్థితి ప్రజలకు ఏర్పడింది. రక్షిత నీటి పథకాల ద్వారా సరఫరా అవుతున్న నీరు పచ్చగా ఉండటంతో వాటిని తాగలేక జనం అల్లాడిపోతున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే పంచాయతీల్లోని 13, 14వ ఆర్థిక సంఘ నిధులను ఖర్చుచేసి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని అధికారులు చెప్పటమే తప్ప ఆచరణలో చూపటం లేదు. గ్రామాల్లో దాహం కేకలు... మచిలీపట్నం మండలం కోన, పల్లెతుమ్మలపాలెం, తుమ్మలచెరువు, అరిసేపల్లి, పెదయాదర, రుద్రవరం తదితర గ్రామాల్లో తాగునీటి చెరువులు పూర్తిగా అడుగంటాయి. చెరువులను నింపేందుకు కాలువల ద్వారా నీరు రాకపోవటంతో పంచాయతీ పాలకవర్గాలు చేతులెత్తేశాయి. కోన గ్రామస్తులు చెరువు పక్కనే ఉన్న బావి, పంట కాలువ పక్కనే ఉన్న బోరు పంపు వద్దకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామంలో ఆకుమర్రు మంచినీటి పథకం ద్వారా మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇంటికి రెండు బిందెలు చొప్పున తాగునీటిని సరఫరా చేస్తున్నారు. నందివాడ మండలం ఇలపర్రు, ఎల్‌ఎన్‌పురం, వెన్ననపూడి, అరిపిరాల, కోరుకొండ పంచాయతీల్లోని చెరువులు పూర్తిస్థాయిలో అడుగంటాయి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, తమిరిశ పీఏసీఎస్ అధ్యక్షుడు పిన్నమనేని బాబ్జిల సహకారంతో ఈ గ్రామాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. పామర్రు మండలం ఎలకుర్రులో తాగునీటి చెరువు అడుగంటింది. నీరు - చెట్టు కార్యక్రమం ద్వారా ఈ చెరువును తవ్వారు. అనంతరం చెరువును నింపకపోవటంతో గ్రామానికి నిమ్మకూరు నుంచి ఓ దాత సహాయంతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కోడూరు మండలం వి.కొత్తపాలెం, రామకృష్ణాపురం, ఊటగుండం, ఇరాలి, జరుగువానిపాలెం గ్రామాల్లో తాగునీటి పథకాలు మూలనపడ్డాయి. దీంతో ఇరాలి గ్రామస్తులు రెండు కిలోమీటర్ల దూరంలోని ఇరాలి డ్యాం వద్ద ఉన్న చేతి పంపు నుంచి, జరుగువానిపాలెం గ్రామస్తులు కోడూరు వచ్చి తాగునీటిని తీసుకువెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నాగాయలంక మండలం సొర్లగొందిలో ఉన్న తాగునీటి చెరువు ద్వారా 10 పంచాయతీలకు సంగమేశ్వరం నీటి పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ చెరువు అడుగంటడంతో తాగునీటిని పొదుపుగా గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో 1.90 మీటర్ల నీటిమట్టం మచిలీపట్నం, పెడన పురపాలక సంఘాలతో పాటు మచిలీపట్నం, గూడూరు మండలాల్లో 3.5 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరందరికీ తరకటూరు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు ద్వారా తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. ట్యాంకు నీటి మట్టం 5.19 మీటర్లు. ప్రస్తుతం అది 1.90 మీటర్లకు చేరింది. మూడు అడుగులకు నీరు చేరితే ఆ నీటిని ఉపయోగించడానికి వీలు లేకపోవటంతో పాటు దుర్వాసన వస్తుంది. ప్రస్తుతం ఉన్న నీటి మట్టం 40 రోజులకు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. పెడన, మచిలీపట్నం పురపాలక సంఘాల్లో రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేస్తుండగా గూడూరు మండలంలోని 15 పంచాయతీలకు, బందరు మండలంలోని 34 పంచాయతీలకు మూడు, నాలుగు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటిని ఎంత పొదుపుగా వాడినా నెల రోజులకు మించి తరకటూరు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులోని నీరు రాదని అధికారులే చెప్పటం గమనార్హం. నందిగామ పట్టణంలో ఐదు రోజులకు ఒకసారి, పది రోజులకు ఒకసారి తాగునీటిని ఇష్టానుసారంగా సరఫరా చేస్తున్నారు. ఐతవరం వద్ద మూడు బోర్లు ఉన్నాయి. మోటార్లు మరమ్మతులకు గురైనా వాటిని బాగు చేయించటం లేదు. పాత పైప్లైన్ల కారణంగా నీరు వృథా అవుతోంది. జగ్గయ్యపేట పురపాలక సంఘంలో రెండు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. బోర్ నుంచి సక్రమంగా నీరు రాకపోవటంతో పట్టణంలోని మినరల్ వాటర్ ప్లాంట్ల నుంచి స్థానికులు నీటిని కొనుగోలు చేస్తున్నారు. అక్కడ.. పొరుగు జిల్లా నుంచి తెచ్చుకోవాల్సిందే పశ్చిమగోదావరి జిల్లాకు సరిహద్దున ఉన్న కృత్తివెన్ను మండలంలో పల్లెపాలెం, లక్ష్మీపురం గ్రామస్తులు భీమవరం వెళ్లి తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 20 లీటర్ల టిన్ను కొనుగోలు, రవాణా ఖర్చులు కలిసి ఇంటికి చేరేసరికి రూ.50 అవుతోంది. తాగునీటి కోసం ఇంటికి ఒకరు పనులు మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కృత్తివెన్ను మండలంలోని శీతనపల్లి, నీలిపూడి, కొమాళ్లపూడి, మాట్లం, పల్లెపాలెం, నిడమర్రు తదితర ప్రాంతాల్లోని తాగునీటి చెరువుల్లోని నీరు పూర్తిగా అడుగంటింది. కైకలూరు మండలంలోని లంక గ్రామాల ప్రజలు దుంపగడప, ఆకివీడు గ్రామాలకు వెళ్లి తాగునీటిని కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. కైకలూరు, కలిదిండి మండలాల్లోని కొట్టాడ, సున్నంపూడి గ్రామస్తులు ఉప్పుటేరును దాటి పడవలో తాగునీటి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కైకలూరులోని పెంచికలమర్రు, మండవల్లి మండలంలోని తక్కెళ్లపాడులలో మెగా తాగునీటి ప్రాజెక్టు పథకాలు ఉన్నాయి. ఈ రెండు పథకాల ద్వారా 16 పంచాయతీలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఈ రెండు చెరువులకు గత నాలుగు నెలలుగా నీరు చేరకపోవటంతో 16 పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఈ 16 పంచాయతీల చుట్టూ చేపల చెరువులు ఉండటంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. గుక్కెడు నీటి కోసం ఎన్ని తిప్పలో మా గ్రామంలో గుక్కెడు నీరు దొరకని పరిస్థితి నెలకొంది. చెరువు పక్కనే ఉన్న బావిలోని నీటినే వంట చేసుకునేందుకు ఉపయోగిస్తున్నాం. ప్రతిరోజూ తెల్లవారుజాము రెండు గంటల నుంచి ఈ బావి వద్ద క్యూ కట్టాల్సిందే. కొంతసేపటికే బావిలో నీరు అయిపోతోంది. నీరు ఊరే వరకు వేచి ఉండి మళ్లీ తోడుకోవాల్సిందే. గ్రామంలోని తాగునీటి చెరువు పూర్తిగా పాడైపోయింది. - కుమారి, కోన 16 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నాం జిల్లాలో 370 తాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిలో 10 రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉంది. జిల్లాలోని సముద్రతీరం, కాలువ శివారున ఉన్న 16 గ్రామాలకు 16 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నాం. ఒక మనిషికి రోజుకు 10 లీటర్లు చొప్పున అందజేస్తున్నాం. ఏదైనా గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంటే ట్యాంకర్ల ద్వారా సరఫరాకు సిద్ధంగా ఉన్నాం. - గోపాల్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ -
వరద కాలువకు గండి
త్రిపురారం, న్యూస్‌లైన్: మండలంలోని జి అన్నారం -దుగ్గెపల్లి గ్రామాల మధ్య ఉన్న డి-26 వరద కాలువకు మంగళవారం మధ్యాహ్నం గండిపడింది. అధికారులు ఇటీవల వరద కాలువకు నీటిని విడుదల చేశారు. కాలువ కట్ట బలహీనంగా ఉండడంతో నీటి ఉధృతి ఎక్కువకావడంతోనే గండిపడిందని భావిస్తున్నారు. దీంతో జి.అన్నారం గ్రామానికి చెందిన చిలుక రవీందర్‌రెడ్డి, వంగాల శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం ఆదిరెడ్డి, జాజుల మట్టయ్య, గోలి నాగయ్య, మేరెడ్డి హనుమారెడ్డిలకు చెందిన 30 ఎకరాల బత్తాయి తోట, 10 ఎకరాల పత్తి పంటలు నీట మునిగాయి. మూడు రోజుల క్రితం కూడా ఇదే వరద కాలువకు గండి పడడంతో రైతులు దానిని పూడ్చారు. దిక్కుతోచని స్థితిలో రైతులు కాలువకు మళ్లీ గండిపడడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు నీట మునిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కాలువకు గండి పడడంతో పత్తి పంట వరద తీవ్రతకు కొట్టుకుపోయిం ది. దీనికి తోడు మొక్కలు కనిపించని విధంగా అడుగుమేర నీరు పత్తి పంటలో నిలిచింది. దీంతో పాటు సమీపంలో ఉన్న బత్తాయి తోటలలలో కూడా వరద నీరు వచ్చి చేరింది. చింతల చెరువులోకి చేరుతున్న వరద నీరు డి-26 వరద కాలువకు గండి పడడంతో జి.అ న్నారం గ్రామ సమీపంలో ఉన్న చింతల చెరువులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నీటి ప్రవాహంలో పత్తి చేలు కొట్టుకుపోగా, సమీపంలోని బత్తాయి తోటల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చింతల చెరువును నింపేందుకే గుర్తుతెలియని వ్యక్తులు వరద కాలువకు గండ్లు పెడుతున్నారని కొంత మంది రైతులు ఆరోపిస్తున్నారు.